ఓటమికి బాధ్యత నాదే


Fri,May 24, 2019 03:41 AM

Election results 2019 Rahul Gandhi congratulates Narendra Modi says he respects peoples mandate

- ప్రజాతీర్పును గౌరవిస్తున్నా.. గెలుపొందిన మోదీకి, బీజేపీకి అభినందనలు
- కాషాయపార్టీతో సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగుతుంది
- కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ


న్యూఢిల్లీ, మే 23: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి 100 శాతం బాధ్యత తనదేనని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధాని మోదీకి, బీజేపీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కాషాయ పార్టీతో సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే సమావేశమవుతుందని, ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేయాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి, బీజేపీకి శుభాకాంక్షలు. ప్రధానిగా మళ్లీ మోదీనే దేశ ప్రజలు నిర్ణయించారు. ప్రజాతీర్పును నేను పూర్తిగా గౌరవిస్తున్నా అని రాహుల్ పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. మా అభ్యర్థులు మనస్ఫూర్తిగా, ధైర్యంగా ఎన్నికల్లో పోరాడారు. వారందరికీ హృదపూర్వక కృతజ్ఞతలు. సిద్ధాంతంపైనే మా పోరాటం.

దేశంలో రెండు వేర్వేరు భావజాలాలు ఉన్నాయి. ఒకటి నరేంద్రమోదీ, బీజేపీది కాగా, రెండోది కాంగ్రెస్‌ది. ఈ ఎన్నికల్లో బీజేపీ, మోదీ విజయాన్ని మేం అంగీకరించాల్సి ఉంది అని ఆయన పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కేవలం 44 సీట్లనే గెలుచుకున్న కాంగ్రెస్.. ఈసారి స్వల్పంగా తన స్థానాలను మెరుగుపరుచుకుంది. తమ కుటుంబానికి కంచుకోట అయిన అమేథీలో ఓటమిపాలైన రాహుల్‌గాంధీ.. కేరళలోని వయనాడ్‌లో మాత్రం రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. దేశ ప్రజల తీర్పును అంగీకరిస్తున్నా. మోదీకి, ఎన్డీయేకి శుభాకాంక్షలు. ఎంపీగా గెలిపించిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు. అమేథీ ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో ఎంతో కష్టపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని రాహుల్ అనంతరం ట్వీట్ చేశారు.

రాజీనామాపై వర్కింగ్ కమిటీదే నిర్ణయం

కాంగ్రెస్ అధ్యక్షుడిగా దిగిపోతున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాహుల్ తెలిపారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారా అని మరోసారి ప్రశ్నించగా.. ఈ విషయాన్ని తనకు, వర్కింగ్ కమిటీకి వదిలేయాలని బదులిచ్చారు. కాగా, అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ సిద్ధపడగా, ఆయన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అందుకు అంగీకరించలేదని సమాచారం. నిజానికి ఈ రోజు నేను ఏమనుకుంటున్నాననేది విషయం కాదు. మోదీని మళ్లీ ప్రధానిగా ప్రజలు నిర్ణయించడమనేదే విషయం. ప్రజాతీర్పును నేను అంగీకరిస్తున్నా అని రాహుల్ చెప్పారు. ప్రజాతీర్పుపై వివరాల్లోకి వెళ్లేందుకు ఈ రోజు తనది కాదని, నూతన ప్రధాని ఎన్నికయ్యారని, ఆయనకు శుభాకాంక్షలు తెలిపే రోజు ఇదని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలను ఆయన కాపాడుతారని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని రాహుల్ సూచించారు.

స్మృతీ ఇరానీకి అభినందనలు

తాను వరుసగా మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన అమేథీలో ఓటమిని రాహుల్ అంగీకరించారు. అక్కడ గెలుపొం దిన స్మృతీ ఇరానీకి అభినందనలు తెలియజేశారు. అమేథీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం. స్మృతీ ఇరానీ అమేథీ ప్రజలను ప్రేమతో జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తున్నా అని అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను విశ్వసించేవారు చాలా మంది ఉన్నారని, వారెవరూ చింతించాల్సినవసరం లేదని భరోసా ఇచ్చారు. నాకు ఏమి చెప్పినా, నన్ను దూషిస్తూ ఏమన్నా ప్రేమతోనే బదులిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పా. ప్రస్తుతం ఏమైనా జరుగనీ, ప్రేమతోనే నేను స్పందిస్తా. ఇది నా ఫిలాసఫీ అని రాహుల్ చెప్పారు.

664
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles