సట్లెజ్‌ నదిలోకి నీరు వదిలిన పాక్‌


Mon,August 26, 2019 01:46 AM

Heavy water release by Pakistan flood threat to Punjab villages

-ముంపుబారిన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా
-సహాయ చర్యలు చేపట్టిన పంజాబ్‌ సర్కార్‌

చండీగఢ్‌: సట్లెజ్‌ నదిపై నిర్మించిన రిజర్వాయర్ల నుంచి పాకిస్థాన్‌ నీటిని విడుదల చేయడంతో సరిహద్దుల్లోని పంజాబ్‌ రాష్ట్రం ఫిరోజ్‌పూర్‌ జిల్లాలోని టెండీవాలా సహా పలు గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ చర్యలు చేపట్టాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండో-పాక్‌ సరిహద్దుల్లోని గ్రామాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు సైన్యం, ఇతర శాఖలతో కలిసి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర జల వనరులశాఖను పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ కోరారు. ఫిరోజ్‌పూర్‌, జలంధర్‌, కపుర్తలా, రూప్‌నగర్‌ జిల్లాల్లో వరదల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. వరదలతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేయాలని ఫిరోజ్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.

సరోవర్‌ బ్యాక్‌వాటర్‌లో మునిగిన గ్రామం

ఇండోర్‌: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన వరదల వల్ల గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ నిండిపోయింది. ఫలితంగా దిగువకు నీటిని విడుదల చేయడంతో ఉరి భాఘినీ నదిలోకి వరద పోటెత్తింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని ధర్‌ జిల్లాలోని నిసార్‌పూర్‌ గ్రామం ముంపునకు గురైంది. ఆదివారం నీటి నిల్వలు 133 మీటర్ల స్థాయికి చేరాయి. ఇది ప్రమాద స్థాయి కంటే 6.5 మీటర్లెక్కువ. దీంతో గ్రామంలోని ఇండ్లన్నీ ముంపునకు గురయ్యాయి. నిసార్‌పూర్‌ పరిసర గ్రామాల్లో సగం జనాభాను సురక్షిత ప్రాంతాలకు తరలించామని నర్మదా వ్యాలీ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారి ఒకరు తెలిపారు.

మరోసారి ఒడిశాకు వరద ముప్పు

భువనేశ్వర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఒడిశాను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఉత్తర బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 28 నాటికి తీరం దాటవచ్చునని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజులుగా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల్లో ఇది నాలుగోది. ఈ అల్ప పీడనం వాయవ్య ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్‌, తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా తీరం దాటుతుందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల్లో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, మత్సకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles