రెండువేల కోట్ల స్కామ్


Wed,June 12, 2019 02:21 AM

IMA Jewels Fraud Depositors Stage Protests in Front of Store for Their Money

-ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఐఎంఏ సంస్థ
-ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంస్థ యజమాని ఆడియో క్లిప్
-కాంగ్రెస్ ఎమ్మెల్యే 400 కోట్లు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపణ
-సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు

బెంగళూరు, జూన్ 11: అధిక వడ్డీ ఆశజూపి ప్రజల నుంచి (ముఖ్యంగా ముస్లింల నుంచి) సుమారు రూ.2,000 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన బెంగళూరుకు చెందిన ఐ మానెటరీ అడ్వైజరీ (ఐఎంఏ) అనే ఇస్లామిక్ బ్యాంకింగ్, నగల సంస్థ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్ తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆడియో క్లిప్ ద్వారా పేర్కొనడం కలకలం రేపుతున్నది. దీంతో శివాజీనగర్ ప్రాంతంలోని ఐఎంఏ కార్యాలయం వద్దకు బాధితులు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళనకు దిగారు. సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు మన్సూర్ ఆడియో క్లిప్‌లో పేర్కొన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రూ.400 కోట్లు అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదని, పైగా తన మీదకు రౌడీలను పంపుతున్నాడని అందులో ఆరోపించారు.

12-13 ఏండ్లు శ్రమించి ఈ సంస్థను నిర్మించాను. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో అవినీతి నెలకొని ఉంది. అధికారులు, రాజకీయ నాయకులకు లంచాలు ఇవ్వాల్సి వస్తున్నది. రోషన్ బేగ్ డబ్బు తిరిగి చెల్లించలేదు. పైగా నా ఆఫీసుకు, ఇంటికి రౌడీలను పంపుతున్నాడు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. ఓ గ్రామంలో నా కుటుంబంతో కలిసి దాక్కోవాల్సి వచ్చింది అని నగర కమిషనర్‌ను ఉద్దేశించి ఆడియోలో మన్సూర్ పేర్కొన్నాడు. ఈ ఆడియో ప్రజలకు చేరే సరికి తాను బతికి ఉండనని, రూ.500 కోట్ల విలువైన తన ఆస్తిని విక్రయించి, బాధితులకు తిరిగి చెల్లించాలని కోరాడు.

సోమవారం సామాజిక మాధ్యమాల్లో ఈ ఆడియో వైరల్ కావడంతో గంటల వ్యవధిలోనే సుమారు 3700 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. మంగళవారం తుమకూరు, మాండ్య, ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బెంగళూరుకు చేరుకుని ఆందోళనలకు దిగారు. అయితే ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ మన్సూర్‌దేనా కాదా అన్నది నిర్ధారణ కాలేదు. కంపెనీ కూడా దీనిపై స్పందించకపోవడంతో బాధితుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అతడు బతికే ఉన్నాడా అనేదానిపైనా స్పష్టత లేదు.

మన్సూర్‌పై లుక్ ఔట్ నోటీసులు

మన్సూర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో లుక్ ఔట్ నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను రోషన్ బేగ్ ఖండించారు. ఐఎంఏతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు తన ప్రత్యర్థులు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. మన్సూర్ ఖాన్‌తో కలిసి సీఎం కుమారస్వామి భోజనం చేస్తున్న ఫొటోను బీజేపీ రాష్ట్ర శాఖ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. మరోవైపు ఈ కేసుపై సీఎం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు.

1912
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles