2.1 కి.మీ. కాదు.. 400 మీటర్లు!


Thu,September 12, 2019 03:16 AM

Isro lost Chandrayaan 2 lander Vikram contact 400 metres above Moon not 2.1 kms

- చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సంకేతాలు నిలిచిపోయిందక్కడే
- డిసెంట్ గ్రాఫ్‌లో స్పష్టంగా నమోదైందంటున్న నిపుణులు
- ప్రస్తుత విశ్లేషణలన్నీ అవాస్తవాలని వ్యాఖ్య
- ఇస్రో ప్రకటనను అర్థం చేసుకోవడంలో గందరగోళ ఫలితమని వెల్లడి


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: చంద్రయాన్-2కు సంబంధించిన ఆసక్తికరమైన అంశం బుధవారం తెరమీదికి వచ్చింది. అందరూ భావిస్తున్నట్టు చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోలేదని.. 400 మీటర్ల ఎత్తువరకు సంకేతాలను పంపిందని తాజాగా తేలింది. ల్యాండర్ డిసెంట్ గ్రాఫ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నదని నిపుణులు చెప్తున్నారు. వారి తాజా విశ్లేషణ ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఇస్రో చైర్మన్ కే శివన్ క్లుప్తంగా ప్రకటన చేయడం, దానిని పొరబాటుగా అర్థం చేసుకోవడం, ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తల నుంచి ఎలాంటి అదనపు వివరాలు వెల్లడికాకపోవడం వంటి కారణాలతో అందరూ విక్రమ్ ల్యాండర్ నుంచి 2.1 కి.మీ. ఎత్తులో సంకేతాలు ఆగిపోయాయని భావిస్తూ వస్తున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ల్యాండర్ చంద్రుడిపై దిగే ప్రక్రియ రికార్డయిన గ్రాఫ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఉపరితలానికి 400 మీటర్ల ఎత్తుకు చేరేవరకు విక్రమ్ నుంచి సంకేతాలు అందినట్టు స్పష్టమవుతున్నది. శనివారం తెల్లవారుజామున 2:18 గంటలకు ఇస్రో చైర్మన్ కే శివన్ చేసిన అధికారిక ప్రకటనలో 2.1 కి.మీ. వరకు సజావుగా సాగిందని మాత్రమే చెప్పారు. 2.1 కి.మీల ఎత్తులో సంకేతాలు నిలిచిపోయాయని చెప్పలేదు.

ఇప్పుడేంటి?

చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటార్ సాయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్ ఉనికిని గుర్తించారు. ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడం (హార్డ్ ల్యాండింగ్ ) వల్ల విక్రమ్ ఒక పక్కగా ఒరిగిందని నిర్ధారించారు. దానితో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ల్యాండర్, దానిలోని రోవర్ జీవితకాలం 14 రోజులు. అంటే ఇస్రోకు మరో 10 రోజులు గడువు ఉన్నది. ఆలోగా సంబంధాలు పునరుద్ధరించగలిగి.. రోవర్‌ను ఉపరితలం మీదికి దించితే మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువాన్ని తాకిన రికార్డు సొంతమవుతుంది. అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. ఒకవేళ ల్యాండర్ విఫలమైనా ఆర్బిటార్ రూపంలో ఇస్రో గొప్ప విజయాన్ని సాధించినట్టేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆర్బిటార్ అద్భుతంగా పనిచేస్తున్నదని ల్యాండర్‌ను గుర్తించడంతోనే తేలిపోయిందన్నారు. కాబట్టి చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైనట్టే లెక్క అని స్పష్టం చేస్తున్నారు.

ఎందుకీ తికమక

ఇస్రో చైర్మన్ కే శివన్ సైతం ల్యాండర్ 2.1 కి.మీ. ఎత్తువరకు సక్రమంగా పనిచేసింది అని మాత్రమే ప్రకటించారని, అక్కడే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పలేదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఎంత ఎత్తులో ఉండగా ల్యాండర్‌తో సంబంధాలు కోల్పోయామో శివన్ గానీ.. ఇతర శాస్త్రవేత్తలు గానీ స్పష్టంగా చెప్పకపోవడంతో అందరూ 2.1 కి.మీల ఎత్తులోనే ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయా యని భావించారన్నారు. ఆర్బిటార్ సాయంతో చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ జాడను గుర్తించామని ఆదివారం శివన్ ప్రకటించారు. ఆ సమయంలో కూడా ల్యాండర్ నుంచి ఎంత ఎత్తులో సిగ్నల్స్ ఆగిపోయాయో స్పష్టం చేయలేదు.

అసలేం జరిగిందంటే..

విక్రమ్ ల్యాండర్ గమన మార్గాన్ని రికార్డ్ చేసిన గ్రాఫ్‌ను లోతుగా పరిశీలించినప్పుడు ప్రస్తుత విశ్లేషణలన్నీ అవాస్తవాలని అర్థమవుతాయని నిపుణులు చెప్తున్నారు. డిసెంట్ గ్రాఫ్‌లో మొత్తం మూడు గీతలున్నాయి. మధ్యలో ఉన్న ఎర్రటి గీత ప్రధానమైనది. అది ల్యాండర్ నిర్దేశిత మార్గాన్ని సూచిస్తుంది. దానిపైనే ఏర్పడే ఆకుపచ్చ గీత ల్యాండర్ గమనాన్ని సూచిస్తుంది. అంటే ఆకుపచ్చ గీత.. ఎరుపు గీత మీదుగా వెళ్తుంటే ల్యాండర్ సజావుగా ప్రయాణిస్తున్నట్టు అర్థం. గ్రాఫ్ ప్రకారం ల్యాండర్ ఐదు కి.మీ. ఎత్తు వరకు సరైన మార్గంలోనే ప్రయాణించింది. 5-3 కి.మీ.ల మధ్య అక్కడక్కడా ఎరుపు గీతను దాటి బయటికి వెళ్లినట్టు కనిపించగా, తేడా స్వల్పంగానే ఉండటంతో శాస్త్రవేత్తలు కంగారుపడలేదు. 2.1 కి.మీ. ఎత్తులో ల్యాండర్ పూర్తిగా అదుపు తప్పింది. నిర్దేశిత మార్గం నుంచి పూర్తిగా పక్కకు జరిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికి సంకేతాలు నిలిచిపోయాయి. గ్రాఫ్ ప్రకారం.. ల్యాండర్ 400 మీటర్ల ఎత్తులో ఉండగా చివరగా సంకేతాలను పంపింది.

4618
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles