‘సమస్యలే’ ప్రచారాస్ర్తాలు కావాలి


Mon,April 15, 2019 01:50 AM

Lok Sabha election campaign is going on in india

-అప్పుడే విజయావకాశాలు మెండు
-రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్‌లో లోక్‌సభ ఎన్నికల సంగ్రామం జోరుగా సాగుతున్నది. 90 కోట్ల మంది ఓటర్లు రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఈసారి కూడా మీడియా ఒపీనియల్ పోల్స్, ఎగ్జిట్‌పోల్స్ విశ్లేషణలతో మునిగిపోయింది. ఫలితాల అంచనాలు రాజకీయ చర్చలకు మంచి విందుగా మారాయి. అయితే ఒపీనియన్ పోల్స్ రానురానూ విశ్వసనీయతను కోల్పోతున్నాయి. ప్రజానాడిని అందుకోలేక అంచనాలకు, వాస్త వ ఫలితాలకు భారీ తేడా ఉంటున్నది. ది వర్డిక్ట్ అనే పుస్తకంలో పొందుపరిచిన తాజా అధ్యయనం ప్రకారం.. ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసే పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు సాధిస్తుందో ఒపీనియన్ పోల్స్ వేసిన అంచనాలు 62 శాతం మాత్రమే నిజమయ్యాయని తేలింది. 1998-99 మధ్య కాలం నుంచి ఒపీనియన్ పోల్స్‌కు, వాస్తవ ఫలితాలకు మధ్య రానురానూ భారీ అంతరం ఉంటున్నదని ఇండియా టుడే నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ఫలితాల అంచనాలకు మెరుగైన స్టాటిస్టికల్ మోడల్‌ను అనుసరించాల్సి ఉంటుంది. మంచి ఆర్థిక వ్యవస్థ మంచి రాజకీయాలకు సూచికగా చాలా ప్రజాస్వామిక దేశాల్లో కామన్‌గా ఓ విశ్వాసం ఉంది. దీని ప్రకారం ఆర్థికాభివృద్ధి బాగుంటే అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే భారత్‌కు ఇది వర్తించదని గణాంకాలు చెబుతున్నాయి.

మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధించినప్పటికీ అధికార పార్టీ పరాజయంపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి భారత్‌లో ఆర్థికాభివృద్ధితోపాటు అనేక అంశాలు ఎన్నికలపై ప్రభావం చూపుతాయని అర్థమవుతున్నది. భారత్‌లో ప్రధానంగా రెండు అంశాలు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటిది సామాజిక అంశాలు కాగా, రెండోది ప్రభుత్వంపై సెంటిమెంట్. సామాజికాంశాల్లో విద్య, వైద్యం, నివాస సదుపాయాలు, పారిశుధ్యం, వ్యక్తిగత హక్కులు వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై ప్రజా సెంటిమెంట్‌ను రెండు మార్గాల ద్వారా అంచనా వేయొచ్చు. మొదటిది, కేంద్రంలోని అధికారపార్టీ తమ హయాంలో ఆయా రాష్ర్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం అయితే, రెండోది ఆయా పార్టీలు, రాజకీయ నేతలపై సంప్రదాయ మీడియా అందించే విశ్లేషణలతోపాటు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల వినియోగం. మైనార్టీలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలు, మహిళల పట్ల పార్టీల వైఖరి, వాటి హయాంలో జరిగిననేరాల ఆధారంగా ఓటరు నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. సమస్యలే ఎజెండాగా పార్టీలు ప్రచారం నిర్వహిస్తే విజయావకాశాలు మెండు గా ఉంటాయని పేర్కొంటున్నారు.

368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles