బెంగాల్ ఆటబొమ్మ కాదు


Wed,June 12, 2019 02:31 AM

Mamata Banerjee unveils Vidyasagar bust statue says 8 TMC workers among 10 killed in post poll clashes

-ఘర్షణల్లో చనిపోయినవారిలో 8 మంది తృణమూల్‌వారే
-BJPబెంగాల్‌ను గుజరాత్‌లా మార్చేందుకు కుట్రలు
-బీజేపీపై ధ్వజమెత్తిన ముఖ్యమంత్రి మమతాబెనర్జీ
-ధ్వంసమైన చోటే విద్యాసాగర్ నూతన విగ్రహం ఆవిష్కరణ

కోల్‌కతా, జూన్ 11: పశ్చిమ బెంగాల్ ఆటబొమ్మ కాదని, రాష్ట్రంతో బీజేపీ ఆడుకోలేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత నెల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోల్‌కతాలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా ప్రముఖ సాంఘిక సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మంగళవారం అదే స్థానంలో నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. హేర్ స్కూల్ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం దాన్ని ఓపెన్ టాప్ జీపులో విద్యాసాగర్ కళాశాలకు తీసుకెళ్లి, పాత విగ్రహం ధ్వంసమైన చోటునే తిరిగి ఏర్పాటుచేశారు. అలాగే 8.5 అడుగుల విద్యాసాగర్ ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని కూడా కళాశాల ప్రాంగణంలో నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కవులు, రచయితలు, మంత్రులు హాజరయ్యారు. అనంతరం మమత మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసలో 10 మంది చనిపోగా, అందులో 8 మంది తృణమూల్ కాంగ్రెస్‌కు చెందినవారేనని తెలిపారు.

మిగిలిన ఇద్దరు బీజేపీకి చెందినవారని చెప్పారు. ప్రతి మరణం కూడా దురదృష్టకరం. విపత్తు సహాయ నిధి నుంచి 10 మంది బాధిత కుటుంబ సభ్యులకు సాయం అందించాలని ప్రధాన కార్యదర్శిని కోరుతా అని ఆమె పేర్కొన్నారు. అన్ని హత్యలపై విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. బెంగాల్‌ను గుజరాత్‌లా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం కానీ, ఆ ప్రయత్నాలను సఫలం కానివ్వబోనని స్పష్టంచేశారు. శనివారం సందేశ్‌ఖలి జిల్లాలో చోటుచేసుకున్న హింస నేపథ్యలో రాష్ట్ర గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి సోమవారం ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించిన విషయం తెలిసిందే. దీనిపై మమత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను గవర్నర్ పదవిని గౌరవిస్తానని, అయితే ప్రతి పదవికీ రాజ్యాంగ పరిమితులు ఉంటాయని స్పష్టం చేశారు. బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాష్ర్టాన్ని, రాష్ట్ర సంస్కృతిని కాపాడుకోవాలంటే అందరూ ఏకమవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ, కేంద్ర కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
mamata

మమత ప్రసంగాలే ఆజ్యం పోశాయి

సందేశ్ ఖలీ జిల్లాలో చోటుచేసుకున్న హింసకు మమతా బెనర్జీనే కారణమని బీజేపీ నేత ముకుల్ రాయ్ ఆరోపించారు. కాషాయ పార్టీ మద్దతుదారులపై దాడులకు ఆమె ప్రసంగాలు ఆజ్యం పోశాయని ధ్వజమెత్తారు. శనివారం నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన పార్టీ కార్యకర్తలు ప్రదీప్ మండల్, సుకంత మండల్ కుటుంబాన్ని ఆయన మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాను కోరుతామన్నారు. ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.

కొనసాగుతున్న హింస

బెంగాల్‌లో హింస కొనసాగుతూనే ఉంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్లలో ఇద్దరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇటీవలి ఎన్నికల్లో అధికార తృణమూల్‌పార్టీకి వారు ఓటు వేయడంతో బీజేపీ వారిని లక్ష్యంగా చేసుకున్నదని తృణమూల్ జిల్లా అధ్యక్షుడు జోతిప్రియ మాలిక్ ఆరోపించారు. అయితే కుటుంబ కక్షలతోనే ఈ ఘటన చేసుకుందని, రాజకీయాలకు సంబంధం లేదని బీజేపీ కొట్టివేసింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తూర్పు బుర్దాన్ జిల్లాలో దుండగులు జరిపిన దాడిలో తృణమూల్ కార్యకర్త మృతిచెందారు. మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తల మృతదేహాలను చెట్లకు వేలాడదీయడం కలకలం రేపుతున్నది. హౌరా జిల్లాలోని సర్పోటా, అట్చత గ్రామాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వీరు జైశ్రీరాం సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, వీరి హత్యల వెనుక తృణమూల్ హస్తం ఉన్నదని బీజేపీ నేత అనుపమ్ మాలిక్ ఆరోపించారు.

848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles