మిన్నంటిన సంబురాలు


Fri,May 24, 2019 03:01 AM

Modi scores historic election victory

-ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సందడి
-పటాకుల పేలుళ్లతో దద్దరిల్లిన ప్రాంగణం

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారానికి రావడం ఖాయమని తేలడంతో కమలనాథుల్లో ఆనందోత్సాహాలు మిన్నుముట్టాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం పండుగ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఆధిక్యతను చాటడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సంబురాలలో మునిగితేలారు. స్వీట్లు పంచుకుంటూ నృత్యాలు చేశారు. పార్టీ కార్యాలయం ప్రాంగణం పటాకుల పేలుళ్లతో దద్దరిల్లింది. మోదీ, మోదీ, జైశ్రీరాం వంటి నినాదాలు మిన్నంటాయి. కొంతమంది మోదీ, అమిత్‌షా కటౌట్‌లను ప్రదర్శించారు. కార్యాలయం లోపల కూడా పలువురు నాయకులు ఒకరినొకరు అభినందించుకుంటూ, శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించారు.

ఆరెస్సెస్ సిద్ధాంతకర్త, బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా మాట్లాడుతూ, ఇది మోదీ, ఆయన దార్శనిక విజయం అని పేర్కొన్నారు. మోదీ-యిజం సంఘటితం అయింది. నెహ్రూయిజం పూర్తిగా కనుమరుగైంది.. దాని స్థానంలో మోదీ-యిజం వచ్చింది అని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం సమయానికి కార్యకర్తల సంఖ్య మరింత పెరిగింది. కొందరు మళ్లీ నమో(నరేంద్రమోదీ), చౌకీదార్ ఫిర్‌సే, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ వంటి నినాదాలు రాసి ఉన్న టీ షర్టులను ధరించారు. కొందరు ముఖాలకు మోదీ మాస్క్‌లను ధరించారు. మహిళా కార్యకర్తలు కూడా నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఒక మోదీ కటౌట్‌పై సింగం రిటర్న్స్ అని రాసి ఉంది.

188
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles