చంద్రబాబు అబద్ధాలకోరు


Sat,March 23, 2019 02:51 AM

Mohan Babu Protest Over Fee Reimbursement Failure Of Chandrababu Govt

-నాలుగున్నరేండ్లుగా నమ్మించి మోసంచేశారు
-ఫీజు డబ్బును పసుపు-కుంకుమకు మళ్లించారు
-మా విద్యాసంస్థకు రూ.19 కోట్ల ఫీజు బకాయి
-శ్రీవిద్యానికేతన్‌సంస్థల ఆధినేత మోహన్‌బాబు ఫైర్
-ఫీజు డబ్బులు చెల్లించాలని విద్యార్థులతో ర్యాలీకి యత్నం
-అడ్డుకున్న పోలీసులు.. అనంతరం గృహనిర్బంధం

చిత్తూరు: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాల కోరని, నాలుగున్నరేండ్లుగా నమ్మించి మోసం చేశారని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ మంచు మోహన్‌బాబు నిప్పులు చెరిగారు. తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడం ఆపేసిందని ఆరోపించారు. తమ విద్యాసంస్థకు రూ.19 కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని, ఇందుకోసం చంద్రబాబుకు తాను స్వయంగా లేఖలురాసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి చెల్లించాలని డిమాండ్‌చేస్తూ శుక్రవారం చిత్తూరు జిల్లాలో తిరుపతికి వెళ్లే రోడ్డులోని తన కళాశాల నుంచి విద్యార్థులతో తిరుపతి నగరానికి ర్యాలీ నిర్వహించడానికి ఆయన ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు.

ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం మొదట మూడునెలలకోసారి డబ్బులు చెల్లిస్తామని చెప్పింది. 2017-18 విద్యాసంవత్సరానికి రూ.2 కోట్లు ఇవ్వాలి. ఈ విద్యాసంవత్సరానికి రూ.16 కోట్లు ఇవ్వాలి. ఏదో ఒక వంకచెప్పి ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నది. కాలేజీలకు ఇవ్వాల్సిన డబ్బులు పసుపు-కుంకుమ పేరుతో వేరే పథకానికి మళ్లించారు. నిధులు లేవని విద్యార్థులకు ఇవ్వాల్సిన సొమ్మును అటకెక్కిస్తావా? నాలుగున్నరేండ్లుగా లేని ప్రేమ ఇప్పుడు ఆడపడుచులపై పుట్టిందా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలుచేయకుండా, కొత్త పథకాలతో చంద్రబాబు మోసాలకు పాల్పడుతున్నారని మోహన్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఒక అబద్ధాల కోరని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన నిరసన ఆగదని అన్నారు. విద్యాసంస్థల్లో చదువుతున్న బిడ్డల కోసమే ఈ ఉద్యమం అని ఆయన స్పష్టంచేశారు. ధర్నాలో విద్యార్థులతోపాటు మోహన్‌బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోహన్‌బాబును ఇంటికి తరలించిన పోలీసులు గృహ నిర్బంధం విధించారు. మోహన్‌బాబు వ్యాఖ్యలను ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సినీనటుడు శివాజీ ఖండించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌పై మోహన్‌బాబు అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.

నీ కంటే ముందే టీడీపీలో చేరా..

ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేకుండా చేశావు. ఇది వాస్తవం. ఇది ప్రజలకు తెలియదు. నీకంటే ముందు నేను తెలుగుదేశంలో చేరాను. అది నిజం. నా ఆస్తులు తాకట్టుపెట్టుకొని ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్ సినిమా తీశా. ఆ సినిమాలోని పుణ్యభూమి నాదేశం పాట పెట్టుకొని తిరుగుతున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఆ పాట పెట్టకుండా ప్రచారం చేయి అని చంద్రబాబుకు మోహన్‌బాబు సవాల్ విసరారు.

446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles