ఢిల్లీ పీఠంపై నమో కొలువు


Fri,May 31, 2019 03:52 AM

Narendra Modi take Oath as Prime Minister of India

- రెండోసారి దేశ ప్రధానిగా మోదీ ప్రమాణం
- మరో 57 మంది మంత్రులుగా..
- తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి స్థానం
- రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో వేడుకగా కార్యక్రమం
- మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా పెద్దసంఖ్యలో హాజరైన వివిధ రంగాల ప్రముఖులు
- ప్రమాణం చేయించిన రాష్ట్రపతి
- కొత్తపాతల మేలు కలయిక
- బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు చోటు
- కొనసాగిన రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మల
- సుష్మ, ఉమ, మేనకలకు దక్కని చాన్స్
- క్యాబినెట్‌లో బెర్తులపై జేడీయూ కినుక
- ప్రభుత్వంలో చేరబోమని ప్రకటన


మొత్తం మంత్రులు - 58
క్యాబినెట్ మంత్రులు - 25
స్వతంత్ర హోదా - 9
సహాయ మంత్రులు - 24

PM-Modi1
ఢిల్లీ పీఠంపై మరోసారి నరేంద్రమోదీ సర్కారు కొలువుదీరింది. ఫిర్ ఏక్‌బార్ మోదీ సర్కార్ అన్న నినాదంతో భారతీయుల మనస్సులు చూరగొన్న నరేంద్రమోదీ.. భారతదేశ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకరించారు. విపక్షాల విమర్శలను తోసిరాజని.. చమక్కులు, చమత్కారాలు, చాతుర్యం ప్రదర్శిస్తూ.. ఒంటిచేత్తో రెండోసారి బీజేపీకి సంపూర్ణ మెజారిటీ సాధించిన మోదీతో గురువారం రాత్రి ఏడు గంటలకు రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. బిమ్‌స్టెక్ దేశాల అధినేతలు, 8000 మంది అతిథులు, కార్పొరేట్ అతిరథ మహారథులు, సినీ ప్రముఖుల తళుకుబెళుకుల మధ్య అత్యంత సందడిగా కేంద్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరిగింది.
PM-Modi2
మోదీ సహా మొత్తం 58 మంది ప్రమాణం చేశారు. వీరిలో 25 మంది క్యాబినెట్ మంత్రులు, తొమ్మిది మంత్రి స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు కాగా, మిగిలిన 24 మంది సహాయ మంత్రులు. మోదీ మలి విడుత క్యాబినెట్ కొత్త పాతల మేలు కలయికగా ఉన్నది. బీజేపీ అధ్యక్షుడు, తనతోపాటు పార్టీ విజయానికి ఎనలేని కృషిచేసిన వ్యూహకర్త అమిత్‌షాకు మోదీ కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించారు. రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, నిర్మలాసీతారామన్ తదితర సీనియర్లను కొనసాగించారు. మొత్తంగా 36 మందికి రెండోసారి అవకాశం కల్పించారు.
PM-Modi3
ఎనిమిదిసార్లు గెలుపొందిన సీనియర్ నేత మేనకాగాంధీతోపాటు సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, మహేశ్‌శర్మ వంటి ప్రముఖులకు ఈ దఫా క్యాబినెట్‌లో చోటు లభించలేదు. సీనియర్ నేత జేపీ నడ్డాను పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన కూడా మోదీ క్యాబినెట్‌లో చేరలేదు. మాజీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్య కారణాలతో క్యాబినెట్‌లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఇక మోదీకి విధేయుడు గిరిరాజ్‌సింగ్, కిరెన్‌రిజిజు, గజేంద్రసింగ్ షెకావత్, మాజీ సీఎంలు రమేశ్ చంద్ర పోఖ్రియాల్, అర్జున్ ముండా తదితరులకు క్యాబినెట్ హోదా లభించింది. కొత్త క్యాబినెట్‌లో స్మృతి ఇరానీతోపాటు ఆరుగురు మహిళలకు చోటుదక్కింది. ముస్లిం మైనారిటీల్లో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి మాత్రమే అవకాశం లభించింది. అన్నింటికి మించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మాజీ విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ను మోదీ తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఇదిలావుంటే.. కేంద్ర క్యాబినెట్‌లో చేరాలన్న మోదీ ప్రతిపాదనను ఎన్డీయే కీలక భాగస్వామ్య పక్షం జేడీయూ తిరస్కరించింది. తమకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వని కారణంగానే క్యాబినెట్‌లో చేరటం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అయితే.. ఎన్డీయే నుంచి తమ పార్టీ వైదొలగడం లేదని స్పష్టంచేశారు. దానికి అనుగుణంగానే మోదీ ప్రమాణస్వీకారానికి జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తదితర విపక్ష నేతలు కూడా హాజరయ్యారు.
PM-Modi4
PM-Modi5
PM-Modi6
PM-Modi7
PM-Modi8

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles