అంతఃకరణశుద్ధితో..


Fri,May 31, 2019 03:52 AM

Narendra Modi take Oath as Prime Minister Of India

- రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం
- 58 మందితో కొలువు దీరిన కేంద్ర క్యాబినెట్
- అమిత్‌షా, జైశంకర్‌లతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నిర్మలకు చోటు
- రాష్ట్రపతి భవన్ ఫోర్ట్‌కోర్టులో వేడుకగా క్యాబినెట్ ప్రమాణం
- సుష్మ, ఉమ, మేనకలకు దక్కని చోటు
- మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సహా పెద్దసంఖ్యలో హాజరైన వివిధ రంగాల ప్రముఖులు


న్యూఢిల్లీ, మే 30: భారతీయుల సమ్మోహన శక్తిగా జాతీయతా భావంతో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన బీజేపీ నేత నరేంద్రమోదీ గురువారం రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణం చేయించారు. ఇంకా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఎస్ జయశంకర్, డీవీ సదానందగౌడ, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, రాం విలాస్ పాశ్వన్ తదితరులతో రాష్ట్రపతి రామ్‌నాథ్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్ట్ ఆవరణలో ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ.. దేశానికి సేవ చేయ డం గౌరవం అని ట్వీట్ చేశారు. అంతా భావించినట్లే 2014లో తొలిసారి బీజేపీని కేంద్రంలోని అధికారంలోకి తేవడంలో కీలకంగా పని చేసిన వ్యూహకర్త, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా.. మోదీ మలివిడుత సర్కార్‌లో క్యాబినెట్ మంత్రిగా చేరారు. విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఎస్ జయశంకర్‌నూ మోదీ తన క్యాబినెట్‌లోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. లోక్‌సభలో తమ ప్రాతినిధ్యానికి తగినట్లు క్యాబినెట్‌లో చోటు దక్కలేదని కినుక వహించి న ఎన్డీఏ మిత్రపక్షం జేడీయూ.. ప్రభుత్వంలో చేరబోమని తెలిపింది. అయితే ఆ పార్టీ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం వేడుకలకు హాజరయ్యారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాత్రమే క్యాబినెట్‌లో చోటు దక్కిం చుకున్న ముస్లిం నేత కావడం గమనార్హం.
Narendra-Modi2
ఇక తొలి విడుత ప్రభుత్వంలో కీలకశాఖల మంత్రులుగా ఉన్న సుష్మా స్వరాజ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మేనకాగాంధీలకు చోటు దక్కలేదు. ఆరోగ్య కారణాలతో మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనను క్యాబినెట్‌లోకి తీసుకోవద్దని కోరుతూ ప్రధాని మోదీకి బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి గా పని చేసిన జేపీ నడ్డాను ఈ దఫా క్యాబినెట్‌లోకి తీసుకోలేదు. నడ్డాను అమిత్‌షా స్థానంలో బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తున్నది. ఇక జైట్లీ స్థానే అమిత్‌షాకు ఆర్థిక శాఖ, రాజ్‌నాథ్‌కు తిరిగి హోంశాఖ కేటాయించే అవకాశం ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, బీజేపీ కురువృద్ధుడు అద్వానీ, అధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌లతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, రాష్ర్టాల సీఎంలు సహా సుమారు 8000 మంది అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇంకా క్యాబినెట్ మంత్రులుగా నరేంద్ర సింగ్ తోమర్, రవిశంకర్ ప్రసాద్, హర్‌సిమ్రత్ కౌర్, థావర్‌చంద్ గెహ్లాట్, రమేశ్ పోఖ్రియాల్, అర్జున్ ముందా, హర్షవర్ధన్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు ప్రమాణం చేశారు. స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులుగా సంతోష్ కుమార్ గంగ్వార్, ఇందర్‌జిత్ సింగ్, శ్రీపాద్ యస్సో నాయక్, జితేంద్ర సింగ్, కిరెన్ రిజిజు, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రాజ్ కుమార్ సింగ్, హర్దిప్ సింగ్ పూరీ, మాన్‌సుఖ్ ఎల్ మాండవియా ప్రమాణం చేశారు. తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన 20 మందికి నేరుగా క్యాబినెట్ మంత్రి పదవి లభించింది. గతంతో పోలిస్తే క్యాబినెట్‌లో మహిళా ప్రాతినిధ్యం ఎనిమిది మంది నుంచి ఆరుగురికి చేరుకుంది. 543 స్థానాలు గల లోక్‌సభలో ప్రధాని మోదీ తన క్యాబినెట్ లోకి 80 మంది మంత్రులను తీసుకోవచ్చు. రాజ్యాంగం ప్రకా రం లోక్‌సభలో 15% సభ్యులకు మించి క్యాబినెట్‌లో ఉండరాదు.

రాష్ట్రపతి భవన్ ఫోర్ కోర్టు ఆవరణలో మోదీ ప్రమాణం చేయడం ఇది రెండోసారి. 2014లో మోదీతో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ప్రమాణం చేయించారు. సార్క్ దేశాధినేతలతోపాటు 3,500 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఇంతకుముందు ఫోర్‌కోర్టు ఆవరణలో 1990లో చంద్రశేఖర్, 1999లో వాజపేయి ప్రధానిగా ప్రమాణం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు అత్యధికంగా మహిళా నేతలు ఎన్నికైనా క్రితంసారితో పోలిస్తే మోదీ క్యాబినెట్‌లో మహిళల ప్రాతినిధ్యం తగ్గింది. మలి విడుతలో ఆరుగురు మహిళలకు చోటు లభించింది. క్యాబినెట్‌లో అతిపెద్ద వయస్కుడిగా రాం విలాస్ పాశ్వాన్ (73), అతి పిన్న వయస్కురాలిగా స్మృతి ఇరానీ (43) ఉన్నారు. దక్షిణాదిలో రాజకీయంగా బీజేపీకి కీలకంగా ఉన్న కర్ణాటక నుంచి మోదీ నలుగురికి అవకాశం కల్పించారు. ఆశ్చర్యకరంగా క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి ఎస్ జయశంకర్‌తోపాటు క్రితం క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న ఎల్జేపీ అధినేత పాశ్వాన్.. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కూడా ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది.

అన్ని దారులు రాష్ట్రపతి భవన్ వైపే

మలి విడుత మోదీ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో దేశ రాజధాని హస్తినలో దారులన్నీ రాష్ట్రపతి భవన్‌వైపే సాగాయి. వివిధ దేశాల అధినేతలు, కార్పొరేట్ ప్రముఖులు, విపక్ష నేతలు, సినీ తారల తళుకుబెళుకుల మధ్య మోదీ సర్కార్ ప్రమాణ స్వీకార వేడుక అద్యంతం కన్నుల పండువగా సాగింది. సరిగ్గా సాయంత్రం ఏడు గంటలకు మొదలైన కార్యక్రమం రెండు గంటలు సాగింది. కొన్ని సార్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కఠిన క్రమశిక్షణ గల ఉపాధ్యాయుడ్ని తలపించారు.

హాజరైన కార్పొరేట్ ప్రముఖులు వీరే

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా, స్టీల్ బారన్ ఎల్‌ఎన్ మిట్టల్, ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీ, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, హెచ్డీఎఫ్‌సీ అధినేత దీపక్ పరేఖ్‌లతోపాటు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హాజరయ్యారు.

లోక్‌సభకు ఎన్నికైన హేమమాలినీ, సన్నీ డియోల్‌తోపాటు సినీ తారలు రజనీకాంత్, అనుపమ్ కేర్, వివేక్ ఒబెరాయ్, మాధూర్ భండార్కర్, కంగనా రౌత్, సినీ నిర్మాతలు కరణ్ జోహర్, బోనీ కపూర్ పాల్గొన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రాజకీయ హింసలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలు, పుల్వామా ఉగ్రదాడిలో అమర సైనికుల కుటుంబాలు పాల్గొన్నాయి.
Narendra-Modi1

మురిసిన మోదీ తల్లి హీరాబెన్

అహ్మదాబాద్, మే 30: తన కుమారుడు మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణం చేయడాన్ని టీవీలో చూసి ఆయన తల్లి హీరాబెన్ మురిసిపోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న తన ఇంట్లో టీవీ ముందు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించిన హీరాబెన్ చప్పట్లు కొడుతూ ఆనందంలో మునిగిపోయారు. ప్రధానిగా మోదీ ప్రమాణం చేసినంత సేపు ఆమె టీవీ ముందు అలాగే కూర్చొని వీక్షించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Narendra-Modi3

తరలివచ్చిన వివిధదేశాల అధినేతలు

బిమ్‌స్టెక్ దేశాల అధినేతల్లో బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ, మయన్మార్ అధ్యక్షుడు యూ విన్ మైంట్, భూటాన్ ప్రధాని లోటే షేరింగ్, థాయిలాండ్ ప్రత్యేక ప్రతినిధి గ్రిసాద బూన్‌రాక్ వేడుకలకు హాజరయ్యారు. బిమ్‌స్టెక్‌లో భారత్‌తోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలు. ప్రస్తుతం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) చైర్మన్‌గా ఉన్న కిర్గిజ్ అధ్యక్షుడు సూరొన్‌బే జీన్‌బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
Narendra-Modi4
Narendra-Modi5
Narendra-Modi6
Narendra-Modi7

653
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles