అచ్ఛేదిన్ ఎక్కడ?


Sat,March 23, 2019 10:48 AM

National politics on the rise of religious politics in the election

-ఎన్నికల వేళ మత రాజకీయాలు తెరపైకి జాతీయవాదం
యూపీఏ పాలనలోని అవినీతి, కుంభకోణాలతో విసిగివేసారిన ప్రజానీకానికి అచ్చేదిన్ తీసుకొస్తామని గత లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు మోదీ హవా సాగడంతో విస్పష్ట మెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఐదేండ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈసారి పరిస్థితులు అప్పటిలా లేవు. మోదీ ప్రభ తగ్గుతూ వచ్చింది. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగం పెరిగింది. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా చిన్న వ్యాపారులు చితికిపోయారు. అచ్చేదిన్ తెచ్చామని ప్రభుత్వం కూడా గట్టిగా చెప్పలేకపోతున్నది. ఈ క్రమంలో పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలు బీజేపీకి కలిసివచ్చాయి. హిందుత్వవాదానికి తోడు జాతీయ వాదాన్ని బలంగా తెరపైకి తేవడం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందాలని బీజేపీ యత్నిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

జాతీయవాదం

surgical-strike
వ్యవసాయ సంక్షోభం, నాలుగు దశాబ్దాల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగం, మందగించిన ఆర్థిక వ్యవస్థ, ఉప ఎన్నికల్లో వరుస పరాభవాలు, మూడు కీలక హిందీ రాష్ర్టాల్లో పరాజయాలు.. లోక్‌సభ ఎన్నికల ముంగిట మొన్నమొన్నటి వరకు మోదీ సర్కార్ పరిస్థితి ఇది. అయితే పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలతో ఎన్నికలకు బీజేపీకి మంచి అస్త్రం చేతికందింది. ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్య ద్వారా ఉగ్రవాదంపై నిర్ణయాత్మకమైన చర్య తీసుకోగల బలమైన నేతగా మోదీ అవతరించారు. మెరుపుదాడులతో మోదీ గ్రాఫ్ పెరిగిందని పలు సర్వేలు కూడా వెల్లడిస్తున్నాయి. సైనికచర్యను బీజేపీకి ఎన్నికల్లో బాగా ఉపయోగించుకుంటున్నది. ఉగ్రవాదంపై పోరు పేరుతో జాతీయవాదాన్ని బలంగా తెరపైకి తెచ్చింది. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీతోపాటు బీజేపీ నేతలు దీన్నే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు . మరోవైపు మెరుపుదాడులకు ఆధారాలు చూపాలంటూ విపక్షాలు ప్రశ్నించడాన్ని కూడా బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంది. విపక్షాలు భద్రతా బలగాల మనోైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, పాక్ అనుకూల భాషను మాట్లాడుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నది. కాగా, గత అక్టోబర్ 21న నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతిని పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధాని ప్రత్యేకంగా జాతీయ జెండాను ఎగురువేయడం విశేషం. అలాగే ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి బోస్ మనవడిని బీజేపీ బరిలోకి దించడం గమనార్హం. జాతీయవాదాన్ని బలంగా తెరపైకి తీసుకురావడం ద్వారా అప్పటివరకు ఎన్నికల్లో ప్రధానాంశాలుగా ఉన్న వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, నోట్లరద్దు, జీఎస్టీ వంటి అంశాలు వెనక్కు వెళ్లాయి.

హిందుత్వ వాదం

rama-temple
హిందుత్వవాదం కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ దీన్ని ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నది. ఇటీవల కా లంలో గో సంరక్షణ పేరుతో పలు రాష్ర్టాల్లో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని మూకదాడులకు పాల్పడడం వివాదాస్పదమైంది. ఈ దాడులపై చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మించాలంటూ హిందూ సంఘాల నుంచి బీజేపీ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అయోధ్యలో వివాదంలో లేని భూమిని అసలైన యజమానులకు తిరిగి ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయోధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే రామమందిరం నిర్మించలేకపోవడం బీజేపీకి మైనస్‌గా మారిందన్న అంచనా లూ ఉన్నాయి. మరోవైపు శబరిమల వివాదం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేరళలో శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్నివయసుల మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడం ఆందోళనలకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని హిందూసంఘాలు, బీజేపీ తీవ్రం గా వ్యతిరేకించాయి. శబరిమల వివాదంలో కేరళ సర్కారు తీరుపై హిందూవర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ అంశం తమకు కలిసివస్తుందని బీజేపీ భావిస్తున్నది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా సాఫ్ట్ హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్నది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో చేపట్టిన గంగాయాత్రలో భాగంగా పలు హిందూ ఆలయాలను సందర్శించారు.

విపక్షాలపై ఎదురుదాడి

rafel
మోదీ సర్కారును గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీని నిలువరించేందుకు ఆయా రాష్ర్టాల్లో కూటములుగా ఏర్పడుతున్నాయి. హామీల అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నదని మోదీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తల రుణాలను మాఫీ చేసిన మోదీ సర్కారు.. రైతుల ను మాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని దుయ్యబడుతున్నాయి. విపక్షాల విమర్శలపై సూటిగా సమాధానం చెప్పకుం డా బీజేపీ ప్రభుత్వం ఎదురుదాడినే అస్త్రంగా చేసుకుంది. ముడుపులు దక్కనందునే యూపీ ఏ ప్రభుత్వం రాఫెల్ ఒప్పందాన్ని జాప్యం చేసిందని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. బాలాకోట్ దాడులకు ఆధారాలు చూపాలని కోరడం ద్వారా ప్రతిపక్షాలు భద్రతా బలగాలను అవమానిస్తున్నాయని ధ్వజమెత్తారు. విపక్షాలది కల్తీ కూటమి అని ఎద్దేవాచేశారు. ఐదేండ్లలో ఏం చేశామో చెప్పకుండా ఎదురుదాడికి దిగ డం ద్వారా బీజేపీ ఎలాంటి ఫలితాల ను సాధిస్తుందో చూడాలి.

ప్రకటనల వ్యయంలోనూ బీజేపీనే టాప్!

FB-PAGES
సామాజిక మాధ్యమాల్లో మిగిలిన అన్ని పార్టీల కంటే ముందువరుసలో ఉండే బీజేపీ.. ప్రకటనల వ్యయంలోనూ ముందంజలోనే ఉంది. ఫేస్‌బుక్ ఇటీవల విడుదల చేసిన యాడ్ లైబ్రరీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. పారదర్శకత పెంపొందించడంలో భాగంగా రాజకీయ ప్రకటనలకు సంబంధించి ఫేస్‌బుక్ ఈ నివేదిక రూపొందించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 90 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశంలో సుమారు 29.4 కోట్ల మందికి ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నట్లు అంచనా. 2,500 ఫేస్‌బుక్ పేజీలకు సంబంధించి ఫేస్‌బుక్ డేటా క్రోడీకరించగా, ఇందులో 35 పేజీలు ఫిబ్రవరి 7 మార్చి 2 మధ్య దాదాపు నెల వ్యవధిలోనే ఒక్కోటి రూ.లక్షకు పైగానే వ్యయం చేయడం గమనార్హం. ఈ 35 పేజీల్లో 19 పేజీలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి అనుబంధమైనవి. ఆయా పేజీలు ప్రకటనలకు వెచ్చించిన మొత్తం రూ.3.30 కోట్లలో ఈ 19 పేజీలే రూ.2.48 కోట్లు వెచ్చించాయి. ఇక టాప్-35లో కాంగ్రెస్‌కు అనుకూలమైన పేజీ ఒక్కటే ఉండడం గమనార్హం.11వ స్థానంలో ఉన్న కర్ణాటక టువార్డ్స్ డెవలప్‌మెంట్ పేజీ రూ.6.2 లక్షలు వెచ్చించింది. బీజేపీకి అనుకూలమైన భారత్ కే మన్ కీ బాత్ పేజీ అత్యధికంగా రూ.1.2 కోట్లు వ్యయం చేసింది. రూ.64 లక్షల వ్యయంతో నేషన్ విత్ నమో రెండో స్థానంలో ఉంది.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles