జాతి వ్యతిరేక శక్తులతో జాగ్రత్త!

Mon,November 11, 2019 02:53 AM

- అలజడులు సృష్టించవచ్చు
- మతపెద్దలతో దోవల్‌ భేటీ
- సంయుక్త ప్రకటన విడుదల

న్యూఢిల్లీ, నవంబర్‌ 10: అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశం లోపల, వెలుపల ఉన్న జాతి వ్యతిరేక శక్తులు దేశంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చని హిందూ, ముస్లిం మతపెద్దలు హెచ్చరించారు. ప్రభుత్వం ఈ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు అండగా ఉంటామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఆదివారం హిందూ, ముస్లిం మతపెద్దలతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఈ భేటీలో హిందూ ధర్మచార్యసభ, విశ్వహిందూ పరిషత్‌ నేతలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మతపెద్దలు పాల్గొన్నారు. అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయోధ్య వివాదంపై శనివారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం సామరస్యం పాటించినందుకు ప్రజలకు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టినందుకు ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు మతాల మధ్య మైత్రి, సోదరభావాన్ని కొనసాగించేందుకు మతపెద్దల మధ్య సంబంధాలను పెంపొందించేందుకు ఈ సమావేశం దోహదపడిందని ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగంపై అందరూ విశ్వాసం వ్యక్తంచేసినట్లు అందులో తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలకు తాము మద్దతుగా ఉంటామని పేర్కొన్నారు.

కోర్టు తీర్పును అంగీకరిస్తూ రెండు మతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు బాధ్యతగా వ్యవహరించడం, సంయమనం పాటించడంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది అలజడులు సృష్టించాలని కోరుకుంటున్నారని, వారు విజయం సాధించలేరు అనేందుకు ఈ సమావేశమే ఉదాహరణ అని స్వామి పరమాత్మానంద సరస్వతి వ్యాఖ్యానించారు. ‘తమ అనుచరులకు విజ్ఞప్తులు చేయడం ద్వారా దేశంలో శాంతి, సామరస్యాలు కాపాడాలని అందరూ తీర్మానించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు ఈ డిజిటల్‌ యుగంలో దేశం లోపల, వెలుపల కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంది. అలాంటి వారికి చెక్‌పెట్టేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమావేశంలో చర్చించాం’ అని ఆయన పేర్కొన్నారు. హజరత్‌ ఖ్వాజా మొయినుద్దీన్‌ హసన్‌ చిస్తీ అధిపతి సయ్యద్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీఖాన్‌ మాట్లాడుతూ.. ‘ఇలాంటి సమావేశాలు అభినందించదగినవి. హిందూ, ముస్లింల సమస్యలకు ముగింపు పలికి దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములయ్యేందుకు సమ యం ఆసన్నమైంది’ అని చెప్పారు.

613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles