గనుల్లో బాల్యం సమాధి


Mon,August 26, 2019 02:03 AM

Over 5,000 children abandon education in mica mines of Jharkhand

-జార్ఖండ్, బీహార్ మైకా గనుల్లో 5వేల మంది బాల కార్మికులు
-అందరూ ఆరు నుంచి 14 ఏండ్ల మధ్య వయసు వాళ్లే
-కుటుంబ పోషణ కోసం చదువుకు దూరంగా.. పనికి దగ్గరగా!

బడిలో బలపం పట్టాల్సిన చిన్నారుల బాల్యం మైకా గనుల్లో చితికిపోతున్నది. భావి భారతాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన వాళ్ల ఆలోచనలు రాళ్ల నేలపై అగమ్యగోచరంగా మారుతున్నాయి. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో బడికెళ్లాల్సిన పసి మొగ్గలు బాల కార్మికులుగా మగ్గిపోతున్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25:పిల్లలు పనిలో కాకుండా బడిలో ఉంటేనే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం సాధ్యమవుతుంది. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మైకా ఖనిజాన్ని ఉత్పత్తి చేసే జిల్లాల్లో నివసించే పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. కుటుంబ పోషణ కోసం మైకా గనుల్లో పనికి కుదురుతున్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. జార్ఖండ్‌లోని కోడెర్మా, గిరిడి జిల్లాలు.. బీహార్‌లోని నవాడా జిల్లాలకు చెందిన 6- 14 ఏండ్ల చిన్నారులు మైకా గనుల్లో కార్మికులుగా పనులు చేస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. సర్వే ప్రకారం జార్ఖం డ్ నుంచి 4,545 మంది, బీహార్ నుంచి 649 మంది చిన్నారులు పాఠశాల విద్యకు దూరమై.. ఆయా జిల్లాల్లోని గనుల్లో పనిచేస్తున్నారు అని ఎన్‌సీపీసీఆర్ ప్రతినిధులు తెలిపారు.

కుటుంబ భారం మోయడానికే..

మైకా ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉన్నది. జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ప్రధానంగా మైకాను ఉత్పత్తి చేస్తున్నాయి. భవనాల నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, పెయింటింగ్స్, కాస్మొటిక్స్ తయారీలో మైకాను ప్రధానంగా వాడుతారు. విద్య ప్రాధాన్యం తెలియకపోవడం, పేదరికం తదితర కారణాల వల్ల కోడెర్మా, గిరిడి, నవాడా జిల్లాల్లో నివసిస్తున్న చాలా కుటుంబాలు చిన్నారులను పనికి పురిగొల్పుతున్నాయి. బాలలు ఏరుకొచ్చిన మైకా శకలాల్ని విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. మరికొన్ని కుటుంబాలు పిల్లల్ని గనుల్లో పనులకు పురమాయిస్తున్నాయి. జిల్లాల్లోని పలు కుటుంబాలు తమ చిన్నారులను మైకా శకలాలు ఏరుకురావడం, గనుల్లో పనులు చేయించడం వంటివి చేస్తున్నాయి. పాఠశాలకు పిల్లల్ని పంపడం వల్ల కలిగే లాభం, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుపై కన్నవాళ్లకు అవగాహన లేకపోవడమే దీనికి కారణం అని అధ్యయనంలో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు.

వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు..

పగలు రాత్రి అనే తేడా లేకుండా గనుల్లో పనిచేస్తున్న పిల్లలను ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. గిరిడి, కోడెర్మా జిల్లాల్లోని గనుల్లో పనిచేస్తున్న పిల్లల్లో 14 నుంచి 19%, నవాడా జిల్లా గనుల్లో పనిచేస్తున్న 69% చిన్నారుల్లో పోషకాహారలోపం కనిపించిందని అధ్యయనం పేర్కొంది. మైనింగ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ వసతిని కల్పిస్తే పరిస్థితిలో మార్పు రావొచ్చని సూచించింది.

సొగసు మాటున చిన్నారుల శ్రమ!

కాంతులీనేలా మెరుగులద్దిన ముఖం వెనుక చీకటి బతుకీడుస్తున్న బాలల మౌన వేదన దాగి ఉన్నది. ముఖ వర్చస్సును, శరీర నిగారింపును ఇనుమడింపజేసుకోడానికి వాడే సౌందర్య సాధనాల తయారీ వెనుక బాలల నిగూఢ కష్టమున్నది. చిట్టి చేతులు, లేత తనువు చిందించే చెమటతో బడా కాస్మొటిక్ సంస్థలు లాభాల్ని గడిస్తున్నాయి. సహజసిద్ధంగా లభించే మైకా ఖనిజాన్ని సౌందర్య సాధనాల తయారీలో ప్రముఖంగా వినియోగిస్తారు. జార్ఖండ్, బీహార్‌లో లభించే మైకాను పేరుగాంచిన బ్రాండ్‌లు కూడా వాడుతున్నాయి. బాలల్ని కార్మికులుగా చేసి, తక్కువ వేతనం చెల్లించి ఆయా రాష్ట్రాల్లో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతున్నది. విదేశీ కాస్మొటిక్ బ్రాండ్ సంస్థలు ప్రత్యక్షంగా ఈ గనుల్లో ఉత్పత్తి అయిన మైకాను కొనుగోలు చేయనప్పటికీ, సరఫరా సంస్థల(వీళ్లు మైనింగ్ సంస్థల నుంచి ఖనిజాన్ని కొనుగోలు చేస్తా రు) ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నాయి.
micamines

598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles