భారమంటూ.. కన్నబిడ్డలను చంపేశారు

Mon,September 23, 2019 03:02 AM

యూపీలో కవల ఆడశిశువులను కుంటలో పడేసిన తండ్రి
ముజఫర్‌నగర్‌: నాగరిక సమాజంలోనూ ఆడపిల్లల పుట్టుకపై వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కవల ఆడపిల్లలు పుడితే సంతోషించాల్సిన దంపతులు.. ఖర్చు భరించలేమని ఆ పసికందులను కుంటలో పడేసి హత్యచేశారు. ఈ ఘటన ఆదివారం వెలుగుచూసింది. ముజఫర్‌నగర్‌ సమీపంలోని భిక్కి గ్రామ వాసులు వసీమ్‌, నజ్మా దంపతులకు ఏడేండ్ల కొడుకు ఉన్నాడు. నజ్మా 20 రోజు ల కిందట రెండోసారి ప్రసవించగా కవల ఆడపిల్లలు జన్మించారు. పుట్టినప్పటి నుంచే వారిని తల్లిదండ్రులు భారంగా భావించసాగారు. వారిని వదిలించుకునే విషయంలో భార్యాభర్తల మధ్య శనివారం రాత్రి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. తర్వాత వసీమ్‌ తన ఇద్దరు కూతుళ్లను తీసుకెళ్లి ఇంటి సమీప కుంటలో పడేశాడు. ఆదివారం ఉదయం వసీమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డలు కనిపించడం లేదంటూ ఫిర్యాదుచేశారు. పోలీసుల విచారణలో చిన్నారులిద్దరినీ తల్లిదండ్రులే హత్య చేసినట్టు తేలింది. వారు కూడా తమ నేరాన్ని అంగీకరించారు. తమది పేద కుటుంబమని, ఇద్దరు ఆడపిల్లలను పోషించ లేకే వారిని కుంటలో పడేశామని వెల్లడించారు. ఈ మేరకు వసీమ్‌తోపాటు అతడి భార్య నజ్మాపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

318
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles