ప్రజల మనిషి.. సారంగి


Sat,June 1, 2019 03:27 AM

Pratap Sarangi India social media hero ministers dubious past

- ఒడిశా మోదీ.. సోషల్ మీడియా హీరో..
- నిరాడంబర జీవనంతో ప్రధానిని మెప్పించిన నేత
- తొలిసారే కేంద్ర కేబినెట్‌లో చోటు


న్యూఢిల్లీ, మే 31: ప్రధాని మోదీ కేబినెట్‌లో తొలిసారి చోటు దక్కించుకున్న ప్రతాప్ చంద్ర సారంగి ఒక్కసారిగా సోషల్ మీడియా హీరో అయ్యారు. ఒడిశా మోదీగా పేరుగాంచిన ఆయన జీవనశైలే దీనికి కారణం. బాలాసోర్‌కు చెందిన సారంగి స్వతహాగా సామాజిక కార్యకర్త. చిన్ననాటి నుంచే ఆయన ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలానికి ఆకర్షితులయ్యారు. భజరంగ్ దళ్ కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొనేవారు. ఆ తర్వాత బీజేపీలో చేరి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 -14 వరకు నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. అయినా సాధారణ జీవితమే గడుపుతుంటారు.

అత్యంత నిరాడంబర జీవితం

పైకప్పు కూడా సరిగా లేని పూరి గుడిసె ఆయన నివాసం. అందులోని లాంతరే లైటు. సారంగి ఎప్పుడూ తెల్లటి పైజామా, ప్యాంటు ధరిస్తారు. గుబురు గడ్డం, భుజానికి సంచీ, కాళ్లకు తోలు చెప్పులతో కనిపిస్తారు. చేతిపంపు వద్దే స్నానపానాలు చేస్తారు. స్థానికులు పెట్టిందే తింటారు. ఇంటి ముందున్న నవారు మంచంలోనే నిద్రపోతారు. సైకిల్‌పై పరిసర ప్రాంతాల్లో తిరగడం, పిల్లలతో ఆడుకోవడం ఈయన వ్యాపకం. రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఆయన జీవన శైలిలో ఏ మార్పూ లేదు. జీతభత్యాలు ప్రజాసేవకే కేటాయిస్తారు. బ్రహ్మచారి అయిన 64 ఏండ్ల ప్రతాప్ చంద్ర సారంగి అత్యంత నిరాడంబరతకు ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యపోయారు. మోదీ ఒడిశాకు ఎప్పుడు వచ్చినా సారంగిని కలవకుండా వెళ్లరు. 2014 ఎన్నికల్లో బాలాసోర్ నుంచి పోటీ చేసి ఓడిన ఆయన ఈదఫా ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి బీజేడీ అభ్యర్థిపై విజయం సాధించారు. లోక్‌సభకు తొలిసారి ఎన్నికైన సారంగి మోదీ కేబినెట్‌లోనూ చోటు దక్కించుకున్నారు.

పలు కేసులు.. ఓ దాడి ఘటనలో అరెస్టు

ఇంత సింప్లిసిటీగా ఉండే సారంగిపై అల్లర్లు, దాడి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి కేసులున్నాయి. 2002లో ఒడిశా అసెంబ్లీపై వామపక్షాల నేతృత్వంలో జరిగిన ముట్టడిలో భజరంగ్ దళ్ తరఫున పాల్గొన్న ఆయన అరెస్టయ్యారు. అలాగే 1999లో జరిగిన ఆస్ట్రేలియా క్రిస్టియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ ఆయన ఇద్దరు పిల్లల దారుణ హత్య కేసులోనూ సారంగి నిందితుడిగా ఉన్నారు.

అందుకే నాపై కేసులు:సారంగి

తనపై నమోదైన కేసుల అంశాన్ని కేంద్ర మంత్రి సారంగి ఖండించారు. అన్యాయం, అవినీతిపైనే తన పోరాటమని అందుకే తనకు శత్రువులు ఎక్కువని మీడియాకు ఆయన తెలిపారు. అసాంఘిక చర్యలను ప్రశ్నించినందుకు తనపై దాడి జరిగిందన్నారు. గ్రాహం స్టెయిన్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక ఎప్పటికీ అవినీతి పరుల ఆటలు సాగవని సారంగి స్పష్టం చేశారు.

1632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles