చిన్నారిని మింగిన బోరుబావి


Wed,June 12, 2019 02:11 AM

Punjab Toddler Pulled Out of 125-ft Deep Borewell After 110 Hours Declared Dead

-పంజాబ్‌లో రెండేండ్ల ఫతేవీర్ మృతి
-110 గంటలపాటు సాగిన సహాయక చర్యలు విఫలం

సంగ్రూర్: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా, భగవాన్‌పురా గ్రామంలో బోరుబావిలో పడిన రెండేండ్ల చిన్నారి మృతి చెందాడు. ఆ బాలుడిని సజీవంగా వెలికితీయడంలో సహాయ సిబ్బంది విఫలమయ్యారు. దాదాపు 110 గంటలపాటు తీవ్రంగా శ్రమించినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చిమ్మచీకటిలో నరకయాతన అనుభవించిన బాలుడు ఫతేవీర్‌సింగ్ మరణించి చాలా గంటలైందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఎలాంటి ఆహారం లేకుండా కేవలం ఆక్సిజన్ మాత్రమే అందడంతో చిన్నారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. బాలుడి మృతదేహానికి మంగళవారమే అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం నాడే రెండో ఏడాదిలోకి అడుగుపెట్టిన తమ ఒక్కగానొక్క కొడుకుకు అప్పుడే నూరేండ్లు నిండాయంటూ తల్లిదండ్రులు చేసిన రోదన పలువురిని కంటతడిపెట్టించింది. గత గురువారం బోరుబావిలో పడిన బాలుడిని సహాయ సిబ్బంది మంగళవారం ఉదయం 4.45 గంటలకు వెలికితీశారు. వెంటనే ఆ బాలుడిని అంబులెన్స్‌లో 130 కి.మీ. దూరంలో ఉన్న చండీగఢ్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు పేర్కొన్నారు.
boy1
పంజాబ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో బాలుడి మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. ఇంటికి సమీపంలోని పొలాల్లో ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు ఆ బోరుబావిలో పడ్డాడు. బోరుబావిపై కేవలం ఒక వస్ర్తాన్ని మాత్రమే కప్పి ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. 150 అడుగుల లోతున్న బోరుబావిలో బాలుడు 125 అడుగుల లోతుకు పడిపోయాడు. బాలుడిని రక్షించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారని, సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించలేదని కుటుంబసభ్యులు, స్థానికులు విమర్శించారు. తాజా ఘటన నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రంలోని వినియోగం లో లేని అన్ని బోరుబావుల ను మూసివేయాలని సీఎం అమరీందర్‌సింగ్ ఆదేశించారు.

3008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles