ఫలించని మహాకూటమి


Fri,May 24, 2019 03:34 AM

Rahul loses Amethi Congratulates Smriti Irani and PM Modi for huge success

- పట్టునిలుపుకొన్న బీజేపీ
- రాహుల్‌గాంధీపై స్మృతి ఘన విజయం
- రాయ్‌బరేలీలో సోనియా గెలుపు ఓడిన జయప్రద.. గెలిచిన హేమామాలిని
- 4.79 లక్షల మెజారిటీతో మోదీ ఘనవిజయం


లక్నో, మే 23: దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే వెనుకబడినా.. పట్టునిలుపుకొన్నది. రాజకీయంగా బద్ధ విరోధులైన సమాజ్‌వాదీపార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు మహాకూటమి పేరుతో ఏకమైనా.. బీజేపీ 62 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్ (సోనేలాల్) రెండు స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష ఎస్పీ-బీఎస్పీ కూటమి 15 స్థానాల్లో గెలుపొందింది. ప్రధాని నరేంద్రమోదీ వారణాసి నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి, సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి షాలినీయాదవ్‌పై 4.79 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే అమేథీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరాజయం పాలయ్యారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించారు. సమాజ్‌వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌యాదవ్ మైన్‌పురిలో, ఆయన కుమారుడు అఖిలేశ్‌యాదవ్ ఆజంగఢ్ నియోజకవర్గంలో గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ దిగ్గజ నేత ఆజంఖాన్ రాంపూర్‌లో జయప్రదపై నెగ్గారు. ఆమె ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామాచేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మహాకూటమిలో భాగస్వామ్యపక్షమైన రాష్ట్రీయలోక్‌దళ్ అధినేత అజిత్‌సింగ్ ముజఫర్‌నగర్‌లో పరాజయంపాలు కాగా.. ఆయన కుమారుడు జయంత్‌చౌదరి బాగ్‌పట్ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు.

బీఎస్పీ 10 సీట్లలో, ఎస్పీ 5 సీట్లలో గెలుపొందాయి. కాంగ్రెస్ ఒక్క రాయబరేలీలో మాత్రమే విజయం సాధించగలిగింది. ఇక్కడ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి దినేశ్‌ప్రతాప్‌సింగ్‌పై విజయం సాధించారు. జనతాదళ్ (ఎస్)కు రాజీనామాచేసి, బీఎస్పీలో చేరిన కున్వర్‌డానిశ్ అలీ అమ్రోహాలో దూసుకుపోయారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ మహేంద్రనాథ్ పాండే.. చందౌలీ నియోజకవర్గంలో, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, సంతోష్‌గంగ్వార్ బరేలీలో విజయం సాధించారు. మరో కేంద్రమంత్రి మనోజ్‌సిన్హా ఘజియాపూర్‌లో ఓడిపోయారు. ఆయన ప్రత్యర్థి మాఫియా నాయకుడిగా ఉండి.. రాజకీయ నాయకుడి అవతారమెత్తిన బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ ఇక్కడ విజయం సాధించారు. కేంద్రమంత్రి మేనకాగాంధీ సుల్తాన్‌పూర్‌లో బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన గోరఖ్‌పూర్, ఫుల్పూర్ నియోజకవర్గాలు మళ్లీ కాషాయదళానికి దక్కాయి. కైరానాలో ఎస్పీ సిట్టింగ్ ఎంపీ తబస్సుమ్ బేగం బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. మథురలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ హేమామాలిని భారీ మెజార్టీతో గెలిచారు. ఇక ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఉండి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసిన నలుగురు మంత్రుల్లో ముగ్గురు గెలిచారు.
Uttar-Pradesh1

473
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles