దాడులు జరిగాయా?


Sat,March 23, 2019 03:38 AM

Sam Pitroda said If 300 terrorists were killed then government

-300 మంది ఉగ్రవాదులు హతమయ్యారా?
- అక్కడెవరూ చనిపోలేదని అంతర్జాతీయ మీడియా చెబుతున్నది
-మోదీ సర్కారేమో ఉగ్రవాదుల్ని చంపేశామని అంటున్నది ఇందులో ఏది వాస్తవం?
-దాడులపై సాక్ష్యాలుంటే బయటపెట్టాలి
-కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా డిమాండ్
న్యూఢిల్లీ, మార్చి 22: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై కాంగ్రెస్ ప్రవాస భారతీయ విభాగం చైర్మన్, రాహుల్‌గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బాలాకోట్ దాడులు జరిగాయా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొందరు ఉగ్రవాదులు జరిపిన పుల్వామా ఉగ్రదాడికి యావత్ పాకిస్థాన్‌ను నిందించడం సరికాదన్నారు. బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులను చంపామని వారు (కేంద్రం) చెబుతున్నారని, ఇందుకు సాక్ష్యాలున్నాయా? అని ప్రశ్నించారు. శుక్రవారం పిట్రోడా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. వాళ్లు (కేంద్రం) 300 మంది ని చంపామంటున్నారు. అయితే ఇందులో నిజాలేమిటో దీన్ని నిరూపించే సాక్ష్యాలేమిటో చూపించగలరా? అని ప్రశ్నించారు. పాక్‌లోని జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద క్యాంపులపై భారత వాయుసేన చేసిన దాడులపై ప్రశ్నించగా పిట్రోడాపై వ్యాఖ్యలు చేశారు.

ఈ దాడులపై అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న కథనాలు మరోలా ఉన్నాయని, అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాల్సిన హక్కు భారత ప్రజలకు ఉన్నదని ఆయన పేర్కొన్నారు. బాలాకోట్ దాడుల గురించి న్యూ యార్క్ టైమ్స్ తదితర పత్రికల్లో కథనాల్ని చదివాను. మనం నిజంగా బాలాకోట్ దాడు లు చేశామా? 300 మంది ఉగ్రవాదుల్ని హతమార్చామా? ఇందుకు సాక్ష్యాలుంటే చూపించండి. అంతర్జాతీయ మీడియా మాత్రం అక్కడెవరూ చనిపోలేదని చెబుతున్నది. ఇందులో ఏది వాస్తవం? నాకైతే దాడి విషయాలు తెలియవు. అయితే, ఓ భారతీయుడిగా నిజాలు తెలుసుకోవడం నా హక్కు. దాడులను ప్రశ్నించినంత మాత్రాన నేనేమీ జాతీయవాదిని కాకుండాపోను. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది అని వ్యాఖ్యానించారు. వాయుసేన ఆపరేషన్ గురించి ప్రజలకు నిజాలు తెలియాల్సి ఉందన్నారు. బాలాకోట్ దాడులపై మరింత చర్చ జరుగాలని, మరిన్ని వివరాలు బయటకు రావాలని అన్నారు.

ఏ సమస్యకైనా పరిష్కారం చర్చలే!

పాకిస్థాన్‌తో చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని పిట్రోడా అభిప్రాయపడ్డారు. నేను గాంధేయవాదిని. ప్రపంచంలో ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తాను. అలాగే పాకిస్థాన్‌తో ఎందుకు చర్చలు జరుపకూడదు అని అన్నారు. పుల్వామా ఉగ్ర దాడిపై పిట్రోడా స్పందిస్తూ.. ఎవరో కొంతమంది ఇక్కడికి వచ్చి దాడిచేస్తే దానికి ఆ దేశం (పాక్)లోని వారంతా దోషులే అన్నట్లు వ్యవహరించడం సరికాదు. పుల్వామా లాంటి దాడులు తరుచూ జరుగుతుంటాయి. ఈ ఘటనలో పాక్‌ను నిందించాల్సిన అవసరం లేదు. పుల్వామా దాడి గురించి నాకు పూర్తి వివరాలు తెలియదు. అయితే, గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయి. ముంబైలోని తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్‌పై కూడా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ సమయంలో మేము (నాటి యూపీఏ ప్రభుత్వం) కూడా యుద్ధ విమానాలను పంపాం. కానీ, అలా చేయడం కూడా సరైన పద్ధతి కాదు.

air-attack
ముంబై దాడుల సమయంలో ఎనిమిది మంది వచ్చి దాడులు చేశారు. అయితే ఇందుకు ఆ దేశం (పాక్) మొత్తాన్ని తప్పుపట్టకూడదు అని అన్నారు. పుల్వామా దాడుల అనంతరం కేంద్రం వ్యవహరించిన తీరు సరిగాలేదని పిట్రోడా పేర్కొన్నారు. బాలాకోట్ దాడులపై భారత వాయుసేన సామర్థ్యాన్ని శంకిస్తున్నారా? అని ప్రశ్నించగా.. మెరుపు దాడులు వేరు.. 300 మంది చనిపోవడం అనేవి వేర్వేరు అంశాలు. ఈ విషయంలో మనం భావోద్వేగానికి గురికావాల్సిన అవసరం లేదు. వాస్తవ సమాచారం మాత్రమే పక్కాగా ఉంటుంది. మీరు 300 మందిని చంపామని చెబుతున్నారు. కానీ, ప్రపంచం మాత్రం అక్కడ ఒక్కరూ కూడా చనిపోలేదని చెబుతున్నది. ఇందులో నిజానిజాలేమిటి? అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం

సొంత అభిప్రాయాలతో, వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేశానని, వీటితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని పిట్రోడా చెప్పారు. ఒక శాస్త్రవేత్తగా తాను సహేతుకతనే విశ్వసిస్తానని తెలిపారు. వాస్తవాలను నమ్ముతాను కానీ, భావోద్వేగాలను కాదని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీలా ముంబై దాడుల సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ వ్యవహరించినట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? అని ప్రశ్నించగా.. ఇప్పటివరకు ఉన్న దేశ అత్యుత్తమ ప్రధానుల్లో మన్మోహన్ ఒకరు. ఆయనపై మీడియాలో వచ్చిన కథనాలు, సినిమాలు అన్నీ బోగస్ అని పిట్రోడా కొట్టిపారేశారు. పుల్వామా దాడి అనంతరం ప్రధాని మోదీ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. ప్రధాని వ్యాఖ్యలు గందరగోళంగా, తికమక పెట్టేలా ఉన్నాయన్నారు. 2014 తర్వాత భారత్, అమెరికాలో ఏర్పడిన ప్రభుత్వాలు సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారనే భయాన్ని ప్రజల్లో సృష్టించడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు.

549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles