రక్షణశాఖపై శీతకన్ను

Sat,July 6, 2019 03:18 AM

-ఆయుధ వ్యవస్థల కొనుగోలుపై బడ్జెట్‌లో నీరుగారిన అంచనాలు
-సైనికబలగాల నవీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం
-బడ్జెట్ కేటాయింపులను పెంచని మోదీ సర్కార్
-మధ్యంతర బడ్జెట్ కేటాయింపులనే కొనసాగించిన కేంద్రం

-న్యూఢిల్లీ, జూలై 5: రక్షణశాఖకు బడ్జెట్ కేటాయింపుల్లో ఎలాంటి మార్పులేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌లో రక్షణశాఖకు రూ.3.18 లక్షల కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. యథాతథంగా అవే కేటాయింపులను సార్వత్రిక బడ్జెట్‌లోనూ కొనసాగించింది. దీంతో సాయుధ బలగాల నవీకరణతోపాటు కీలకమైన ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఈసారి బడ్జెట్‌లో కేటాయింపులు భారీగా పెరుగుతాయన్న అంచనాలు నీరుగారిపోయాయి. 2018-19లో బడ్జెట్ అంచనాలను సవరించి రక్షణశాఖకు ఇచ్చిన రూ.2.98 లక్షల కోట్లతో పోలిస్తే ఈసారి ఆ శాఖకు కేటాయింపులు 6.87 శాతం పెరిగాయి. ప్రస్తుతం రక్షణశాఖకు జరిపిన రూ.3.18 లక్షల కోట్ల కేటాయింపులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 1.6 శాతం మేరకు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 1962లో చైనాతో యుద్ధం తర్వాత రక్షణశాఖకు జరిపిన అతితక్కువ కేటాయింపులు ఇవేనని వారంటున్నారు. అయితే మన దేశంలో తయారు చేయకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న రక్షణ సామగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని తొలిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రక్షణ రంగాన్ని నవీకరించడం తక్షణావసరమని, ఇది జాతీయ ప్రాధాన్యతతో కూడిన అంశమైనందున విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్షణ సామగ్రిపై కస్టమ్స్ సుంకాన్ని తొలిగించాలని నిర్ణయించామని ఆమె స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాను న్న ఐదేండ్లలో దాదాపు రూ.25 వేలకోట్లు ఆదా అవుతుందని రక్షణశాఖ పేర్కొంది.

బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన (ఐఏఎఫ్) దాడుల అనంతరం చైనా తన సాయుధ బలగాలను వేగంగా ఆధునీకరిస్తున్నది. దీంతో ఇంతకుముందు రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన నిర్మలా సీతారామన్ తన తొలి పద్దులో ఆ శాఖకు కేటాయింపులను గణనీయంగా పెంచుతారని ఎంతోమంది ఆశించారు. కానీ ఈ ఆశలు నెరవేరకపోవడం దురదృష్టకరమని, ప్రస్తుతం జరిపిన కేటాయింపులు సాయుధ బలగాల నవీకరణకు సరిపోవని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్‌లో పనిచేస్తున్న లక్ష్మణ్ బెహెరా పేర్కొన్నారు. ప్రస్తుతం రక్షణశాఖకు జరిపిన మొత్తం కేటాయింపుల్లో కొత్త ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలు, సైనిక సామగ్రి కొనుగోలు కోసం రూ.1,08,248 కోట్లను వెచ్చించనున్నారు. సిబ్బంది వేతనాల చెల్లింపు, సైనిక వ్యవస్థల నిర్వహణ కోసం 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1,88,118 కోట్లను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.2,10,682 కోట్లకు పెంచింది. దీంతో ఈ రెండు కేటాయింపులు కలిపి రూ.3,18,931 కోట్లకు చేరాయి. ఈ కేటాయింపులు 2018-19 బడ్జెట్ అంచనాల (రూ.2.95 లక్షల కోట్లు) కంటే 7.93 శాతం, సవరించిన అంచనాల (రూ.2.98 లక్షల కోట్లు) కంటే 6.87 శాతం ఎక్కువ. అయితే పింఛన్లను చెల్లించేందుకు ప్రత్యేకంగా పక్కనపెట్టిన రూ.1,12,079 కోట్లను మొత్తం కేటాయింపుల్లో పొందుపర్చలేదు. పింఛన్లకు వెచ్చించాల్సిన నిధులను కూడా కలిపితే రక్షణశాఖకు జరిపిన మొత్తం కేటాయింపులు రూ.4.31 లక్షల కోట్లకు చేరుతాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కేంద్ర ప్రభుత్వం చేసే మొత్తం ఖర్చులో ఇది 15.47 శాతంగా ఉంటుంది.

సైనికబలగాల అవసరాలు ఘనం

బ్రిటిష్ కాలంనాటి పాత విమానాలను తొలిగించాలని భావిస్తున్న భారత వాయుసేన సరికొత్త యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని.. హిందూ మహాసముద్రంలో చైనాను ప్రతిఘటించేందుకు డజను జలాంతర్గాములను సమకూర్చుకోవాలని యోచిస్తున్నది. అలాగే పాకిస్థాన్ సరిహద్దులో భారత సైనికదళం అసాల్ట్ రైఫిళ్లు మొదలుకొని నిఘా డ్రోన్ల వరకు వివిధ రకాల ఆధునిక ఆయుధాల కోసం ఎదురుచూస్తున్నది. అయితే వార్షిక బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు పెరుగకపోవడంతో సైనికబలగాల నవీకరణ మరింత ఆలస్యమవుతుందని రక్షణ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles