యూపీ రాజకీయం రసవత్తరం


Fri,March 15, 2019 11:08 AM

SP and BSP meeting triggers tie up speculations in State

-బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ-బీఎస్పీ జట్టు
-ఒంటరిగానే బరిలోకి దిగుతున్న కాంగ్రెస్
-ముక్కోణపు పోరులో నెగ్గేదెవరో?

దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో తమను చావుదెబ్బ కొట్టిన బీజేపీని ఎదుర్కొనేందుకు బద్ధ శత్రువులైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ) జట్టుకట్టాయి. అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్‌ఎల్డీ)ని కలుపుకుని ఘట్‌బంధన్‌ను ఏర్పాటు చేసిన ఈ రెండు పార్టీలు.. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు మాత్రం కూటమిలో చోటివ్వలేదు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు కాంగ్రెస్‌పై పడింది. కూటమిలో చోటుదక్కక డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రియాంక గాంధీ రాజకీయ అరంగేట్రంతో నూతనోత్సాహం వచ్చిం ది. ప్రియాంకకు యూపీ తూర్పు ప్రాం త బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరిపోరుతో ఎవరికి నష్టం కలుగనుంది? బీజేపీపై దీని ప్రభావం ఎంత? ప్రియాంక గాంధీ ఏ మేరకు ప్రభావం చూపనున్నారు? అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.

రెండు వైపులా పదును..

కాంగ్రెస్ ఒంటరిపోరు.. బీజేపీతో పాటు ఎస్పీ-బీఎస్పీ కూటమిపైనా ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 11 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ ఇప్పటికే తొలిజాబితా విడుదల చేసింది. వీటిల్లో ఉన్నావ్, దౌరారా నియోజవర్గాల్లో గత ఎన్నికలను పరిశీలిస్తే పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అనుటాండన్, జితిన్ ప్రసాద్‌లను కాంగ్రెస్ ఈ రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దింపింది. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన వీరిద్దరూ 2014లో మాత్రం బీజేపీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూశారు. 2009లో ఉన్నావ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ 4.75 లక్షలకు పైగా ఓట్లు సాధించగా, బీజేపీ కేవలం 75 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2014లో సీన్ రివర్సయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 5.18 లక్షల ఓట్లు సాధించగా, కాంగ్రెస్ పార్టీకి 1.95 లక్షల ఓట్లే పడ్డాయి. దీన్ని బట్టి 2014లో కాంగ్రెస్ నుంచి బీజేపీకి భారీగా ఓట్లు బదిలీ అయినట్లు స్పష్టమవుతున్నది.

దౌరారా నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 3.91 లక్షల ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి కేవలం 25 వేల ఓట్లే పడ్డాయి. అదే 2014లో మోదీ హవా కారణంగా బీజేపీ 3.60 లక్షల ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 2 లక్షల ఓట్లతో ఓడిపోయింది. అయితే 2009తోపాటు 2014 ఎన్నికల్లోనూ ఎస్పీ-బీఎస్పీల ఓట్ల శాతం మాత్రం స్థిరంగా ఉంది. 2009లో ఉన్నావ్ నియోజకవర్గంలో ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడిగా 3.28 లక్షల ఓట్లు సాధించగా, 2014లో 4.8 లక్షల ఓట్లు సాధించాయి. మొత్తంగా ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమికి 2009లో 3.9 లక్షల ఓట్లు రాగా, 2014లో 4.68 లక్షల ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన ఫరూఖాబాద్, అక్బర్‌పూర్, జలౌన్, కుషినాగా వంటి నియోజకవర్గాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ మొత్తం డేటాను పరిశీలిస్తే కాంగ్రెస్ వల్ల బీజేపీకే ఎక్కువ నష్టం కలుగనున్నట్లు స్పష్టమవుతున్నది.

up-india2

మాకేమీ నష్టం లేదు: బీజేపీ

అయితే త్రిముఖ పోరుతో తమకు నష్టమేమీ లేదని, ఎస్పీ-బీఎస్పీ కూటమితో గానీ, ప్రియాంక గాంధీ ప్రభావంగానీ తమ పార్టీపై ఉండబోదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. షహరాన్‌పూర్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ చెబుతున్నట్లుగానే పరిస్థితి ఉంది. ఇక్కడ ముక్కోణపు పోరు బీజేపీకే కలిసివస్తున్నది. 2009 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీలకు లక్ష ఓట్ల కంటే తక్కువగానే వచ్చాయి. అయితే ఎస్పీ-బీఎస్పీ కూటమి 6 లక్షలకు పైగా ఓట్లను సాధించింది. అదే 2014లో బీజేపీ, కాంగ్రెస్ రెండూ 4 లక్షలకు పైగా ఓట్లు సాధించగా, ఎస్పీ-బీఎస్పీ కూటమికి మాత్రం 3 లక్షల కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీకే లాభం చేకూరనుంది. మొత్తం ఈ గణాంకాలను విశ్లేషిస్తే.. బీజేపీ పైనే కాంగ్రెస్ ఎక్కువ ప్రభావం చూపనుందని, కొన్ని సీట్లలో ఎస్పీ-బీఎస్పీపైనా ఈ ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రదీప్ శర్మ వ్యాఖ్యానించారు.

408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles