మసీదు స్థలం తీసుకోవాలా? వద్దా?

Mon,November 11, 2019 02:12 AM

- నవంబర్‌ 26న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం..
- సున్నీవక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫార్‌ ఫారుఖీ వెల్లడి

లక్నో, నవంబర్‌ 10: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పునిస్తూ.. అయోధ్యలో మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణం కోసం కేంద్రం కేటాయించే ఐదెకరాల స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరించాలా? వద్దా? అనే అంశంపై నవంబర్‌ 26న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ఆదివారం తెలిపింది. యూపీ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫార్‌ ఫారుఖీ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణానికి స్థలం తీసుకునే విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. ‘నవంబర్‌ 26న బోర్డు సాధారణ సమావేశం జరిగే అవకాశమున్నది.

మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించే స్థలాన్ని తీసుకోవాలో, లేదో ఆ సమావేశంలో నిర్ణయిస్తాం. స్థలాన్ని తీసుకునే అంశంలో నాకు భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, ప్రతికూలతను సానుకూల దృక్పథంతోనే గెలువాలని నేను వ్యక్తిగతంగా భావిస్తాను’ అన్నారు. బాబ్రీ మసీదు కోసం కేటాయించే స్థలాన్ని తీసుకోవద్దని కొందరు తనకు సలహాలు ఇస్తున్నారని, అయితే ఈ నిర్ణయంతో మరింత ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశముందన్నారు. మసీదు కోసం కేటాయించే స్థలాన్ని వక్ఫ్‌ బోర్డుతో పాటు మరొక విద్య సంస్థ కూడా తీసుకోవాలని, సదరు విద్యాసంస్థ ప్రాంగణంలో మసీదు నిర్మాణం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని మరికొందరు సలహా ఇస్తున్నట్టు ఫారుఖీ తెలిపారు. ‘స్థలాన్ని తీసుకోవాలో, లేదో సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ, స్థలం తీసుకోవాలని బోర్డు నిర్ణయిస్తే, ఏ నిబంధనల ప్రాతిపదికన స్థలాన్ని తీసుకోవడానికి అంగీకరించాలో నిర్ణయిస్తాం’ అని ఆయన తెలిపారు.

361
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles