ప్రభుత్వానికి తగిన సమయమిద్దాం!


Wed,August 14, 2019 02:17 AM

Supreme Court JandK situation sensitive govt needs time to lift restrictions

-కశ్మీర్‌లో ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ఆదేశించలేం
-పరిస్థితులు సద్దుమణిగేవరకు వేచిచూద్దాం: సుప్రీంకోర్టు
-2016 నాటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు
-ఇప్పటివరకు ఒక్క ప్రాణం కూడా పోలేదు: కేంద్ర ప్రభుత్వం
-కశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలన్న పిటిషన్‌పైఅత్యున్నత న్యాయస్థానంలో వాదోపవాదాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు ‘అత్యంత సున్నితం’గా మారాయని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సర్కార్‌కు తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. తక్షణమే ఆంక్షలు ఎత్తేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది. ఒక్క ప్రాణ మూ పోకూడదన్నదే తమ అభిమతమని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఈ నెల 5 నుంచి అమలవుతున్న ఆంక్షలను ఎత్తివేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కాంగ్రెస్‌ నేత తెహ్‌సీన్‌ పూనంవాలా దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఎంఆర్‌ షా, అజయ్‌ రస్తోగిలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌(ఏజీ) కేకే వేణుగోపాల్‌, పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కేంద్రం చేపడుతున్న చర్యలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజీ వేణుగోపాల్‌ స్పందిస్తూ.. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితిపై కేంద్రం రోజువారీ సమీక్షిస్తున్నదని, జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చే నివేదికలను సమీక్షించి, కొన్నిచోట్ల ఆంక్షలు సడలిస్తున్నారన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ‘అత్యంత సున్నితం’గా ఉన్నాయన్నా రు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు మరికొన్ని రోజులు ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం నిర్ణయిందన్నారు. 2016 నాటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నదన్నారు. ‘2016 జూలైలో ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైనప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. దాదాపు 3 నెలలు కర్ఫ్యూ కొనసాగింది. మొత్తం 47 మంది మృతిచెందారు’ అని గుర్తుచేశారు. 2016 ఘటనల వెనుక కొందరు వేర్పాటువాదుల హస్తం ఉన్నదని, సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు అల్లర్లు సృష్టించారని, ఈ మేరకు ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పటిష్ఠ భద్రతాచర్యలు తీసుకోవడంతో ఒక్క హింసాత్మక ఘటన కూడా జరుగలేదన్నారు. ఆంక్షలు విధించిననాటి నుంచి సోమవారం వరకు ఒక్క ప్రాణమూ పోలేదన్నారు. ఎక్కడా మానవహక్కుల ఉల్లంఘన జరుగలేదన్నారు.
kashmir

ఒక్కరోజులోనే అంతా అయిపోదు

రాష్ట్రంలో ఫోన్‌, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారని, దీంతో ప్రజలు పండుగ సమయంలోనూ తమ బంధువులతో మాట్లాడేందుకు అవకాశం లేక పోయిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది మేనక గురుస్వామి వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘ఒక్కరోజులోనే అంతా అయిపోదు. అక్కడ కొన్ని తీవ్ర సమస్యలున్నాయి. తగిన సమయం ఇస్తేనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడటమే మనకు ముఖ్యం’ అని పేర్కొన్నది. కనీసం అక్కడ పనిచేస్తున్న సైనికులూ తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం లేదని మేనక గురుస్వామి పేర్కొనగా.. ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘మీరు సైనికుల తరఫున ఎందు కు మాట్లాడుతున్నారు. సైనికులు క్రమశిక్షణగా ఉండాల్సిందే. ఒకవేళ వారికి సమస్య ఉంటే నేరుగా మా వద్దకు రమ్మనండి. మీ కేసు ఇది కాదు’ అని పేర్కొన్నది. ఆర్టికల్‌ 370 గురించి ప్రస్తావించేందుకు గురుస్వామి ప్రయత్నించగా.. దీనిపై ఏ ప్రకటన చేయవద్దని ఆదేశించింది. తాను ఏ ప్రకటన చేయడం లేదని.. ప్రజ ల హక్కులను హరిస్తున్న తీరును వివరించేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. ప్రజలు బయట కు వెళ్లేందుకూ ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశాలేవీ పిటిషన్‌లో చేర్చలేదన్నది. ‘మీ పిటిషన్‌ చాలా పేలవంగా ఉన్నది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా తయారుచేశారు’ అని ఆగ్రహించింది. ‘ప్రజల స్వేచ్ఛ హక్కుపై మీతో ఏకీభవించేందుకు సిద్ధంగా ఉన్నా.. వాస్తవ పరిస్థితి మా ముందు ఉంచడంలో విఫలమయ్యారు’ అని పేర్కొన్నది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.

మీడియాపై ఆంక్షల పిటిషన్‌ను అత్యవసరంగా విచారించండి

జమ్ముకశ్మీర్‌లో మీడియాపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరుపాలని ‘కశ్మీర్‌ టైమ్స్‌' పత్రిక ఎడిటర్‌ అనురాధ భాసిన్‌ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు రిజిస్ట్రార్‌కు వినతి పత్రం సమర్పించారు. దీనిపై జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ ‘మీ వినతిని పరిశీలిస్తాం’ అని సమాధానం ఇచ్చింది. కశ్మీర్‌లో ఆంక్షల వల్ల జర్నలిస్టులు తమ విధులు నిర్వహించలేకపోతున్నారని ఎడిటర్‌ తరఫు న్యాయవాది వివరించారు.

బాధ్యత కేంద్రానిదే


supreme-court1
విచారణ సందర్భంగా జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా మాట్లాడుతూ ‘జమ్ముకశ్మీర్‌లో ఏదైనా ఊహించని ఘటన జరిగితే ఎవరిని నిందిస్తారు? కేంద్రాన్నే కదా?. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే బాధ్యత కేంద్రానిదే. అందుకే వారు (ప్రభుత్వం) శాంతిభద్రతలపై రోజూ సమీక్షిస్తున్నారు. కాబట్టి పరిస్థితులు చక్కబడే వరకు వేచిచూద్దాం’ అని అన్నా రు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఆంక్షలు సడలించవచ్చో స్పష్టమైన సమాచారమిస్తే ఆ మేర కు ప్రభుత్వానికి ఆదేశాలిచ్చే అంశం పరిశీలిస్తామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది మేనక గురుస్వామికి సూచించింది. పరిస్థితులు చక్కదిద్దడానికి ఎంత సమయం కావాలని ధర్మాసనం ఏజీని ప్రశ్నించగా.. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని, సాధారణ పరిస్థితి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు.

1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles