వడదెబ్బకు రైల్లోనే ముగ్గురు మృతి


Wed,June 12, 2019 02:06 AM

Three people were killed Heatstroke on the train

-దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలిన మరొకరు
-ఉత్తరాది తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దుర్ఘటన
-మృతులంతా తమిళనాడుకు చెందిన వాళ్లు

ఝాన్సీ (యూపీ)/న్యూఢిల్లీ: ఆగ్రా నుంచి కోయంబత్తూరుకు రైలులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు వడదెబ్బ తగిలి సోమవారం మరణించారు. తమిళనాడుకు చెందిన వీరు ఇటీవల ఉత్తరాదికి తీర్థయాత్రకు వెళ్లారు. పలు ప్రాంతాలను సందర్శించిన వీరు కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆగ్రా నుంచి కోయంబత్తూరుకు వస్తుండగా ఎండ వేడిని తట్టుకోలేక ముగ్గురు రైలులోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై రైల్వే అధికారి మనోజ్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ ఉత్తరాది ప్రాంతానికి తీర్థయాత్రకు వచ్చిన ఓ బృందంలో ఈ నలుగురు ఉన్నారని చెప్పారు. వీరంతా వారణాసిని సందర్శించిన అనంతరం ఆగ్రాకు వచ్చారని తెలిపారు. అనంతరం ఆగ్రా నుంచి కోయంబత్తూరుకు కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారని, వీరి రైలు సోమవారం సాయంత్రం ఝాన్సీ ప్రాంతానికి చేరుకోగానే అస్వస్థతగా ఉన్నదని ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. వెంటనే వైద్యులు ప్రయాణికుల వద్దకు చేరుకునే సరికి ముగ్గురు మరణించారని, తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఒకరిని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారని తెలిపారు. నాన్ ఏసీ బోగీలో ప్రయాణిస్తున్న వీరు అధిక ఉష్ణోగ్రతల వల్లే చనిపోయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కానీ అసలు కారణం తెలియదని చెప్పారు. కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో మంగళవారం 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఉత్తరాదిలో భగ్గుమంటున్న ఎండలు
ఉత్తరభారతంలో ఎండలు భగ్గుమంటున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లోని చాలా ప్రాంతాల్లో మంగళవారం దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్‌లోని చురూలో 47.3 డిగ్రీలు, శ్రీగంగానగర్‌లో 46.2 డిగ్రీలు నమోదైంది.

247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles