2021 డిసెంబర్‌లో గగన్‌యాన్

Sun,September 22, 2019 02:50 AM

-స్వదేశీ రాకెట్ ద్వారా రోదసిలోకి
-భారతీయ వ్యోమగామి: ఇస్రో చైర్మన్ కే శివన్
-చంద్రయాన్-2 ప్రయోగం 98 % సక్సెస్
-ఆర్బిటార్ చాలా బాగా పనిచేస్తున్నదని వెల్లడి

చెన్నై/భువనేశ్వర్, సెప్టెంబర్ 21: మానవ సహి త అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ను 2021 డిసెంబర్‌లో చేపడుతామని ఇస్రో చైర్మన్ కే శివన్ ప్రకటించారు. చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని తెలిపారు. ఆర్బిటార్ చాలాబాగా పనిచేస్తున్నదని చెప్పారు. విక్రమ్ ల్యాండర్ ప్రణాళిక మేరకు చంద్రుడి ఉపరితలంపై దిగలేదని.. అయినా దీని ప్రభావం గగన్‌యాన్‌పై ఉండబోదని స్పష్టం చేశారు. శనివారం ఐఐటీ భువనేశ్వర్‌లో నిర్వహించిన ఎనిమిదో స్నాతకోత్సవానికి శివన్ ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలను వెల్లడించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి వివరిస్తూ.. 2020 డిసెంబర్ నాటికి ఒక మానవరహిత వ్యోమనౌకను సిద్ధం చేస్తాం. 2021 జూలై నాటికి రెండో వ్యోమనౌకను సిద్ధంచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే ఏడాది డిసెంబర్‌కు మనం సొంతంగా అభివృద్ధి చేసిన రాకెట్ ద్వారా భారతీయ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపుతాం అని పేర్కొన్నారు. దీంతో సభికులంతా పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ శాస్త్రసాంకేతికత సత్తాకు గగన్‌యాన్ ప్రాజెక్టు ఓ నిదర్శనంగా నిలుస్తుందని, అందుకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నామని శివన్ తెలిపారు.

ఏడున్నరేండ్లు పనిచేయనున్న ఆర్బిటార్

చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన ఆర్బిటార్, దానిలోని ఎనిమిది పేలోడ్లు చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఆర్బిటార్ తీసిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని, అవి భవిష్యత్ పరిశోధనలకు గొప్పగా ఉపయోగపడుతాయని తెలిపారు. ఆర్బిటార్ ఏడున్నరేండ్లపాటు సేవలందిస్తుందని స్పష్టం చేశారు. సాఫ్ట్ ల్యాండింగ్ మినహా ఈ మిషన్‌లో వినియోగించిన అన్ని పరికరాలు, సాంకేతికత వందశాతం కచ్చితత్వంతో పనిచేశాయని చెప్పారు. ఇది విజయం కాదా? అని ప్రశ్నించారు. విక్రమ్ ల్యాండర్ ఉపరితలంపై దిగే సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తామని చెప్పారు. విక్రమ్‌తో సంబంధాలు ఇప్పటివరకు పునరుద్ధరణ కాలేదు. త్వరలో ఏదైనా సమాచారం వస్తే కావాల్సిన చర్యలన్నింటినీ తీసుకుంటాం అని పేర్కొన్నారు.

isro-Sivan

వైఫల్యాలను పాఠాలుగా మార్చుకోండి

విద్యార్థులు తమకు ఎదురయ్యే వైఫల్యాలను పాఠాలుగా మార్చుకోవాలని ఇస్రో చైర్మన్ సూచించారు. ఎడిసన్ బల్బ్‌ను కనుగొనే క్రమంలో ఎన్నిసార్లు విఫలమయ్యారో గుర్తుకుతెచ్చుకోండి. ఇస్రో సైతం రాకెట్ ప్రయోగాల్లో ఎన్నో వైఫల్యాలను చూసింది. కానీ మేము వాటిని ఆటంకాలుగా భావించలేదు. పాఠాలుగా మార్చుకొని మళ్లీ ప్రయత్నించాం అని పేర్కొన్నారు. శాటిలైట్లను అధిక సంఖ్యలో అంతరిక్షంలోకి పంపడంలో ఇప్పుడు ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నామని చెప్పారు. ఇదంతా గత 50 ఏండ్లలోనే జరిగిందన్నారు. గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని సొంత లక్ష్యంతో ముందుకు సాగాలని, అంతేతప్ప వారిని అనుకరించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని స్పష్టంచేశారు. దేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా పేదరికం, అనారోగ్యం, పారిశుద్ధ్య లేమి, సురక్షిత నీరు అందకపోవడం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, వీటికి పరిష్కారాలు చూపడానికి విద్యార్థులు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలే ఉండాలన్న గాంధీజీ మాటలను ఉదహరించారు. కార్యక్రమంలో భాగంగా 32 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ, 105 మందికి ఎంటెక్, 67 మందికి ఎమ్మెస్సీ, 152 మందికి బీటెక్ పట్టాలను అందించారు.

పునరుద్ధరణకు తీవ్ర యత్నాలు: శివన్

విక్రమ్ కథ దాదాపు ముగిసినట్టే: ఇస్రో వర్గాలు
చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని శివన్ పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్‌లో తాము నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 98 శాతం సాధించామన్నారు. విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆర్బిటార్ చాలా బాగా పనిచేస్తున్నదని, చంద్రుడిపై ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు. చంద్రయాన్-2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటోది పరిశోధనలు, రెండోది సాంకేతికత. సాంకేతికత కోణంలో ఆలోచించినప్పుడు మిషన్ దాదాపు పూర్తిగా విజయవంతమైనట్టే అని పేర్కొన్నారు. అయితే ఇస్రోవర్గాలు మాత్రం విక్రమ్ కథ దాదాపు ముగిసినట్టేనని చెప్పాయి. దాని జీవితకాలం 14 రోజులేనని, శనివారం సాయంత్రంతో ఆ గడువు ముగిసిందని వెల్లడించాయి. చంద్రుడిపై రాత్రి (ల్యూనార్ నైట్) ప్రారంభమైతే సూర్యకాంతి పడదని, ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల వరకు పడిపోతాయని పేర్కొన్నాయి. ఆ పరిస్థితుల్లో విక్రమ్ పనిచేయదని స్పష్టం చేశారు.

676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles