మందిరం పూర్తికి ఐదేండ్లు!

Mon,November 11, 2019 02:58 AM

- వీహెచ్‌పీ నమూనా ప్రకారం ఇంతకాలం పట్టవచ్చు
- వీహెచ్‌పీ కార్యశాలలో ఇప్పటికే సిద్ధంగా సగం నిర్మాణాలు

అయోధ్య: సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక రామాలయ నిర్మాణంపైనే హిందువుల దృష్టి కేంద్రీకృతమైంది. రామ మందిర నిర్మాణం పూర్తికావడానికి పట్టే సమయంపై చర్చ సాగుతున్నది. మరోవైపు, రామ మందిరాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) 1984 నుంచే అయోధ్యలో పనులు ప్రారంభించింది, విరాళాల్ని సేకరించింది. పనులు కొంతవరకు పూర్తయ్యాయి. వీహెచ్‌పీ ఆలయ నమూనా ప్రకారం.. రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే మరో ఐదేండ్ల సమయం పడుతుందని, ఈ నిర్మాణం కోసం 250 మంది నిపుణులైన శిల్పులు నిరాటంకంగా పనిచేయాల్సి ఉంటుందని మందిరం పనిప్రదేశం పర్యవేక్షకుడు అన్నుబాయ్‌ సోంపురా తెలిపారు. 1990 నుంచి ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున వీహెచ్‌పీ కార్యశాలలో రామమందిరం పనులు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకూ సగం నిర్మాణ పనులు మాత్రమే పూర్తయ్యాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు కష్టపడితే ఆలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు పూర్తయ్యాయి. మందిరానికి కావాల్సిన మొత్తం 212 పిల్లర్లకు గానూ 106 పిల్లర్లే సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం ఇవి ఆలయం పని ప్రదేశంలో ఉన్నాయి. వీహెచ్‌పీ కార్యశాలలోని ప్రముఖ శిల్పి రజినీకాంత్‌ సోంపురా గత జూలైలో మరణించారు. ప్రస్తుతం వీహెచ్‌పీ కార్యశాలలో శిల్పులు ఎవరూ లేరు. ‘ప్రస్తుతం పని ప్రదేశంలో కూలీలెవరూ లేరు. మందిరం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిస్తే.. మాకు కనీసం 250 మంది శిల్పుల అవసరం ఉంటుంది.

ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఐదేండ్ల సమయం పడుతుంది’ అని అన్నుబాయ్‌ సోంపురా అన్నారు. ఇప్పటికైతే ఆలయం గర్భగుడి గోడలు, గుడిలో దైవం, గుడి తలుపుల ఫ్రేములతో పాటు సగం ఫిల్లర్లు సిద్ధంగా ఉన్నాయని, మరో 106 ఫిల్లర్లతో పాటు ఆలయ శిఖరం, పైకప్పు నిర్మించాల్సి ఉన్నదని ఆయన చెప్పారు. ్ర1984లో ఆలయం నిర్మాణం కోసం వీహెచ్‌పీ ఆధ్వర్యంలో పునాది వేశారని, మందిరం నిర్మాణం కోసం భక్తుల నుంచి కనీసం ఒక్క రూపాయి 25 పైసల చొప్పున విరాళాలు సేకరించగా.. నిర్మాణం కోసం మొత్తం రూ. 8 కోట్లు సమకూరాయని వీహెచ్‌పీ కార్యాలయం అధికారులు తెలిపారు. మందిరం నిర్మాణం పనులు మొదలైన కొత్తలో 150 మంది శిల్పులు, వందలాది మంది కార్మికులతో పనులు వేగంగా జరిగాయని, రాజస్థాన్‌ నుంచి తీసుకొచ్చిన రాళ్లతో కూలీలు నిర్మాణం పనుల్ని కొనసాగించారని.. అయితే, పదేండ్ల తర్వాత శిల్పులు, కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతూ పని నత్తనడకన సాగిందని వీహెచ్‌పీ ప్రముఖుడు శరద్‌ శర్మ పేర్కొన్నారు.

1738
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles