రెండు నిమిషాల ఫోన్‌ కోసం..రెండుగంటల వేచిచూపులు


Wed,August 14, 2019 01:54 AM

Waiting for phone 2 hours in queue and 2 minutes of talk

-సమాచార వ్యవస్థపై ఆంక్షలతో కశ్మీర్‌ ప్రజల అవస్థలు
-దశల వారీగా ఆంక్షలు సడలిస్తామన్న కేంద్రం

శ్రీనగర్‌, ఆగస్టు 13: దాదాపు రెండు గంటల పాటు క్యూ లైన్‌లో పడిగాపులు కాస్తే.. కేవలం రెండే రెండు నిమిషాలు ఫోన్‌లో మాట్లాడే పరిస్థితి.. ఎంత చెప్పాల్సి ఉన్నా, ఎంత అత్యవసర సందేశమైనా జాగ్రత్తగా ఆ రెండు మూడు నిమిషాల్లోనే ముగించాలి. కశ్మీర్‌ వెలుపల ఉన్న తమ కుటుంబ సభ్యులు, ఆప్తులతో మాట్లాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్‌ బూత్‌ల వద్ద పడిగాపులు కాస్తున్న కశ్మీర్‌ ప్రజల దీనావస్థ ఇది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జమ్ముకశ్మీర్‌లో కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 5 నుంచి అక్కడ సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఫోన్లు, ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. న్యూస్‌ చానళ్లను రద్దుచేశారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

శ్రీనగర్‌లోని డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన టెలిఫోన్‌ బూత్‌ వద్ద మురఫా భట్‌ అనే మహిళ ఢిల్లీలో ఉన్న తన సోదరికి ఫోన్‌ చేసేందుకు ఏడాది వయసున్న తన కుమారుడిని ఎత్తుకుని దాదాపు రెండు గంటలపాటు క్యూలైన్‌లో నిల్చున్నారు. ఫోన్‌ మాట్లాడిన తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘ఇటీవల మా నాన్నకు ఢిల్లీలో బైపాస్‌ సర్జరీ జరిగింది. కొద్ది రోజుల కిందట ఆయనను తీసుకుని ఇక్కడకు వచ్చాం. అయితే మందులు అయిపోవచ్చాయి. దీంతో ఢిల్లీలో ఉన్న మా సోదరికి అత్యవసరంగా ఫోన్‌ చేయాల్సి వచ్చింది’ అని ఆమె వివరించారు. ‘వదంతులు, తప్పుడు వార్తలను వ్యాప్తిచేసేందుకు ఫోన్‌ ఓ పనిముట్టుగా మారింది. నగర శివారులో కాల్పులు చోటుచేసుకున్నాయని ఇటీవల ఓ అంతర్జాతీయ చానల్‌ ఓ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది. అయితే ఎలాంటి కాల్పులు జరుగలేదు. మొబైల్స్‌ గనుక ఉండుంటే, ఈ తరహా తప్పుడు వార్తలు కశ్మీర్‌లోయలో నిప్పురాజేసేవి’ అని ఓ అధికారి తెలిపారు.

ప్రాణనష్టాన్ని నిరోధించేందుకే ఆంక్షలు: కేంద్రం

ప్రాణనష్టాన్ని నిరోధించేందుకే కశ్మీర్‌లోయలో ఆంక్షలు విధించినట్లు కేంద్ర హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు మంగళవారం తెలిపారు. స్థానిక అధికారుల నివేదికల అనంతరం ఆంక్షలను దశలవారీగా తొలిగిస్తామని వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అరెస్ట్‌ చేసిన మాజీ సీఎంలు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఇతర రాజకీయ నేతలను క్షేత్రస్థాయి పరిస్థితులను అనుసరించి విడుదల చేస్తామని చెప్పారు. కాగా, జమ్ముకశ్మీర్‌, లడఖ్‌లోని వివిధ జిల్లాల్లో స్వాతంత్య్ర దినోత్సవ రిహార్సల్స్‌ పూర్తయిన తర్వాత ఆంక్షలు మరింత సడలించే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కన్సల్‌ తెలిపారు. కాగా, ఈనెల 9న శ్రీనగర్‌ శివారులో దుండగులు భద్రతాబలగాలపై రాళ్లు రువ్వడంతోనే అలజడి రేగిందని, అయితే ఆందోళనకారులపై ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చలేదని కేంద్ర హోం శాఖ మంగళవారం తెలిపింది.

1374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles