ఏఎన్-32 విమానం శకలాలు లభ్యం


Wed,June 12, 2019 02:07 AM

Wreckage of An-32 aircraft spotted in Arunachal Pradesh

-అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలో గుర్తించిన వాయుసేన సిబ్బంది
-గల్లంతైన 13 మంది కోసం కొనసాగుతున్న గాలింపు

న్యూఢిల్లీ: ఈ నెల 3న అదృశ్యమైన భారత వాయుసేనకు చెందిన విమానం ఏఎన్-32 ప్రమాదం బారినపడినట్లు వెల్లడైంది. ఈ మేరకు విమానం శకలాలను మంగళవారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాకు చెందిన పాయుమ్ సర్కిల్ ప్రాంతంలో వాయుసేన సిబ్బంది గుర్తించారు. సముద్రమట్టానికి దాదాపు 12వేల అడుగుల ఎత్తులో ఈ శకలాలు కనిపించాయి. అయితే ఇందులో ప్రయాణించిన 13 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతున్నది. ఈ నెల 3న అసోంలోని జోర్హట్ నుంచి అరుణాచల్‌లోని మెచుకా ప్రాంతానికి బయలుదేరిన ఈ విమానం గాలిలోకి ఎగిరిన కొద్ది సేపటికే గల్లంతయ్యింది. దీని ఆచూకీని కనుగొనడానికి వాయుసేనకు చెందిన సుఖోయ్-30, ఎంఐ-17 యుద్ధ విమానాలతోపాటు సైనికులు, వాయుసేన సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇస్రో సాయాన్ని కూడా తీసుకున్నారు. మంగళవారం గాలింపు సందర్భంగా ఎంఐ-17 విమానంలోని సిబ్బంది ఏఎన్-32 శకలాలను గుర్తించారు. అయితే ప్రమాదానికి గురైన విమానం జోర్హట్ నుంచి బయలుదేరినప్పుడు అందులో 13 మంది ఉన్నారు. ప్రస్తుతం వారి ఆచూకీ లభించకపోవడంతో చనిపోయినట్లు భావిస్తున్నప్పటికీ గాలింపును ముమ్మరం చేశారు. కాగా విమానం శకలాలు దొరికిన విషయం తెలిసిన వెంటనే అందులో ప్రయాణించిన సిబ్బంది బంధువులు జోర్హట్‌కు చేరుకున్నారు. తమ వారి ఆచూకీపై వాకబు చేశారు. మరోవైపు ప్రమాదాల వల్ల ఈ ఏడాది భారత వాయుసేన ఇప్పటి వరకు 10 విమానాలను కోల్పోయింది. ఈ విమాన ప్రమాదాలు కూడా ఎక్కువగా ఫిబ్రవరి నెలలో జరుగడం గమనార్హం. వాయుసేన కోల్పోయిన విమానాల్లో మిరేజ్ 2000, మిగ్-27, జాగ్వార్, ఏన్-32 తదితరాలు ఉన్నాయి.

310
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles