జేకేఎల్‌ఎఫ్‌పై నిషేధం


Sat,March 23, 2019 02:48 AM

Yasin Malik led JKLF banned under anti terror law

-ఉగ్రమూకలకు, వేర్పాటువాదులకుఊతమివ్వడంపై కేంద్రం కన్నెర్ర
-యూఏపీఏ నిబంధనల ప్రకారం వేటు
న్యూఢిల్లీ, మార్చి 22: కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకెఎల్‌ఎఫ్ (జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఉగ్రవాదంతో సతమతమవుతున్న జమ్ముకశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయాలన్న ప్రయత్నాలకు ఊతమిస్తున్నందుకు ఆ సంస్థపై నిషేధం విధించినట్టు ఢిల్లీలో అధికారులు వెల్లడించారు. దేశ భద్రతపై శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశానంతరం జేకేఎల్‌ఎఫ్‌పై ఈ చర్య చేపట్టారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీ ఏ)లోని వివిధ నిబంధనల కింద ఆ సంస్థను నిషేధించారు. ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలను కలిగివున్న జేకేఎల్‌ఎఫ్.. జమ్ముకశ్మీర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాదానికి, అతివాదానికి ఊతమిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడినట్టు అధికారులు తెలిపారు.

ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించరాదన్న విధానంలో భాగంగా ప్రభుత్వం జేకేఎల్‌ఎఫ్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా చెప్పారు. కశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాలను ముందుండి నడిపిస్తున్న జేకేఎల్‌ఎఫ్‌కు 1989లో జరిగిన కశ్మీరీ పండిట్ల హత్యల్లో ప్రమేయం ఉన్నదని, కశ్మీర్‌లోయ నుంచి జనం భారీగా వలస వెళ్లేందుకు ఈ హత్యలు దారితీశాయని ఆయన గుర్తుచేశారు. దేశానికి ముప్పుగా పరిణమించిన వేర్పాటువాద గ్రూపులను, వాటి కార్యకలాపాలను అణచివేయాలన్న విధానాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన చెప్పారు. జేకేఎల్‌ఎఫ్ కార్యకర్తలు దేశ ప్రాదేశిక సమగ్రతకు విఘాతం కలిగించే కార్యక్రమాలకు పాల్పడుతుండటం ఆ సంస్థను నిషేధించడానికి మరో కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జమ్ములోని కోట్ బల్వాల్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్..

మూడు దశాబ్దాల క్రితం జరిగిన రుబయా సయీద్ (కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె) కిడ్నాప్ కేసుతోపాటు, శ్రీనగర్‌లో నలుగురు ఐఏఎఫ్ (భారత వాయుసేన) సిబ్బందిని కాల్చిచంపిన కేసులో విచారణను ఎదుర్కోనున్నట్టు తెలుస్తున్నది. పాకిస్థాన్ జాతీయుడైన అమానుల్లాఖాన్ 1970 తొలినాళ్లలో బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో జేకేఎల్‌ఎఫ్‌ను ఏర్పాటుచేశాడు. 1971లో జేకేఎల్‌ఎఫ్ సభ్యుడొకరు శ్రీనగర్ నుంచి జమ్ముకు వెళ్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడంతో ఆ సంస్థ ప్రాచుర్యంలోకి వచ్చింది. జేకేఎల్‌ఎఫ్‌పై జమ్ముకశ్మీర్ పోలీసులు 37 కేసులు నమోదు చేసినట్టు గౌబా తెలిపారు. 1984లో బ్రిటన్‌లో నియమితుడైన భారత దౌత్యాధికారి రవీంద్ర మాత్రే కిడ్నాప్, హత్య కేసులో కూడా జేకేఎల్‌ఎఫ్ ప్రమేయం ఉన్నది. ఈ హత్య జరిగిన వారం రోజుల తర్వాత మరణశిక్షకు గురైన జేకేఎల్‌ఎఫ్ కార్యకర్త మక్బూల్ భట్‌ను భారత ప్రభుత్వం ఉరితీసింది. జమ్ముకశ్మీర్‌లో ఈ నెల నిషేధించిన సంస్థల్లో జేకేఎల్‌ఎఫ్ రెండవది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం జమాతే ఇస్లామీ జమ్ముకశ్మీర్ సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్‌లోని పలువురు వేర్పాటువాదులకు భద్రతను ఉపసంహరించిన ప్రభుత్వం ఇకమీదట కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తుందని గౌబా తెలిపారు.

ఓపెన్ ఎయిర్ జైలుగా కశ్మీర్: మెహబూబా ముఫ్తీ

జేకేఎల్‌ఎఫ్‌ను నిషేధంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇటువంటి చర్యలతో కశ్మీర్ ఓపెన్ ఎయిర్ జైలుగా మారుతుందని ఆమె అన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకునే క్రమంలో యాసిన్ మాలిక్ చాలా కాలం నుంచి హింసాకాండను ఖండిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నాటి ప్రధాని వాజపేయి ప్రారంభించిన చర్చల్లో యాసిన్ మాలిక్‌ను భాగస్వామిగా పరిగణించారు. ఇప్పుడు జేకేఎల్‌ఎఫ్‌పై నిషేధం విధించి ప్రభుత్వం సాధించేది ఏమిటి? అని మెహబూబా ప్రశ్నించారు.

252
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles