కర్ణాటకదే ముస్తాక్ అలీ ట్రోఫీ


Fri,March 15, 2019 12:38 AM

-ఫైనల్లో మహారాష్ట్రపై 8 వికెట్ల తేడాతో గెలుపు
-మయాంక్ విజృంభణ

karnataka
ఇండోర్: బౌలర్ల సమిష్టి కృషికి తోడు.. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 85 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో కర్ణాటక.. ముస్తాక్ అలీ ట్రోఫీని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. నౌషద్ షేక్ (41 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠీ (32 బంతుల్లో 30; 3 ఫోర్లు), అంకిత్ బావ్నే (25 బంతుల్లో 29; 4 ఫోర్లు) రాణించారు. రాహుల్, రుత్‌రాజ్ గైక్వాడ్ (12) తొలి వికెట్‌కు 35 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే పేసర్ అభిమన్యు మిథున్ (2/24) చెలరేగి గైక్వాడ్‌ను ఔట్ చేయడంతో పరుగుల వేగం మందగించింది. వరుస విరామాల్లో విజయ్ జోల్ (8), త్రిపాఠి కూడా వెనుదిరగడంతో మహారాష్ట్ర 55 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నౌషద్, బావ్నే మెల్లగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు.

లక్ష్య ఛేదనలో కర్ణాటక 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రోహన్ కడమ్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మయాంక్ అర్ధసెంచరీలతో దుమ్మురేపారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ శరత్ (2) ఔటైనా.. ఈ ఇద్దరు మహారాష్ట్ర బౌలర్లను ఉతికి ఆరేశారు. తొలి ఐదు ఓవర్లలో 45/1 స్కోరు చేసిన ఈ జోడీ.. రెండో వికెట్‌కు 92 పరుగులు జత చేసింది. ఓ దశలో 12 ఓవర్లలో 106/1 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన కర్ణాటక గెలువడానికి మరో 50 పరుగులు చేయాల్సిన దశలో రోహన్ వికెట్‌ను కోల్పోయింది. అయినా ఏమాత్రం నిరాశ చెందని మయాంక్.. కరుణ్ నాయర్ (8 నాటౌట్) అండతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. మయాంక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

469

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles