అయినా ముద్దే


Sun,September 22, 2019 12:39 AM

-ఫైనల్లో ఓడి రజతం దక్కించుకున్న అమిత్ పంగల్
-ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్

భారత బాక్సింగ్ చరిత్రలో నూతన అధ్యాయం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యువ బాక్సర్ అమిత్ పంగల్ రజతం దక్కించుకున్నాడు. తుదిపోరులో కాస్త తడబడ్డా.. చరిత్రలో మాత్రం చిరకాలం నిలిచిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెగాటోర్నీలో ఇప్పటి వరకు మనవాళ్లు ఐదు మెడల్స్ నెగ్గినా.. అవన్నీ కంచు పతకాలే కాగా.. తాజాగా అమిత్ రజతంతో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకుంది. ఫైనల్లో ఓడినా బలమైన పంచ్‌లు విసిరిన పంగల్.. టోక్యో ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేపుతుండటం సానుకూలాంశం.
ఎకతెరీన్‌బర్గ్ (రష్యా): చరిత్రను తిరగరాస్తూ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన భారత బాక్సర్ అమిత్ పంగల్ తుదిమెట్టుపై తడబడ్డాడు. వరుస పంచ్‌లతో సత్తాచాటినా.. ప్రత్యర్థి మెరుగైన ప్రదర్శన చేయడంతో ఫైనల్లో ఓడి రజతం దక్కించుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 52 కేజీల ఫైనల్లో రెండో సీడ్ అమిత్ 0-5తో ఒలింపిక్ చాంపియన్ శఖోబిదీన్ జొయ్‌రోవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మెగాటోర్నీ చరిత్రలో ఓ భారత బాక్సర్ రజత పతకం నెగ్గడం ఇదే తొలిసారి. అంతేకాక ఈ వేదికపై రెండు పతకాలు నెగ్గడం కూడా ఇదే ప్రథమం. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు విజేందర్ సింగ్ (2009), వికాస్ కృష్ణన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురీ (2017) కాంస్యా లు గెలువగా.. తాజా టోర్నీలో అమిత్ రజతం, మనీశ్ కౌశిక్ (63 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నారు. దీంతో పాటు వీరిద్దరూ టోక్యో (2020) ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించిన విషయం తెలిసిందే.
Amit

చివర్లో జోరు పెంచినా..

మెరుగైన ప్రత్యర్థితో పోరులో ఆసియా చాంపియన్ అమిత్ శాయశక్తులా కృషిచేశాడు. ఎత్తులో తనకంటే ఎక్కువున్న ప్రత్యర్థిపై ఎక్కువసార్లు పైచేయి సాధించేందుకు ప్రయత్నించాడు. అయితే పంచ్‌ల్లో కచ్చితత్వం లోపించడంతో పంగల్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అమిత్ శక్తికి మించి కష్టపడ్డాడు. మేము అనుకున్నాదానికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. ఇక అతడు పంచ్‌ల్లో వేగం పెంచాల్సిన సమయం వచ్చేసిందిఅని జాతీయ కోచ్ కట్టప్ప అన్నాడంటే.. అతడి ఆటతీరు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మహామహులకు సాధ్యం కాని రీతిలో వరుస విజయాలతో ఫైనల్ చేరిన హర్యానాకు చెందిన అమిత్ తుదిపోరులో ఓడినా.. రజతంతో భారత బాక్సింగ్‌కు కొత్త ఊపిరిలూదాడు. భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) కృషికి ఫలితం దక్కినైట్లెంది. సరికొత్త ప్రణాళికలతో బాక్సర్లకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం కలిసొచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు ఈ ఫలితం ఉత్సాహాన్నిచ్చిందిఅని బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ పేర్కొన్నారు. తొలి రౌండ్‌లో ఇరువురు బాక్సర్లు ఆచితూచి పంచ్‌లు విసురుకోగా.. రెండో రౌండ్‌లో ప్రతర్థి దవడ భాగాన్ని లక్ష్యంగా చేసుకొని అమిత్ పంగల్ విరుచుకుపడ్డాడు. అయితే అందులో ఎక్కువ శాతం పంచ్ లు గురితప్పడంతో పాయింట్లు సాధించలేకపోయాడు. దీంతో న్యాయ నిర్ణేతలు శఖోబిదీన్ జొయ్‌రోవ్‌ను విజేతగా ప్రకటించారు.

-నా కెరీర్‌లో ఇదే అతిపెద్ద పతకం. దీన్ని దేశానికే అంకితమిస్తున్నా. శఖోబిదీన్ ఈ కేటగిరీలో నాకంటే ఎక్కువ కాలం నుంచి పోటీ పడుతున్నాడు. అది అతడికి కలిసొచ్చిందని భావిస్తున్నా. అయినా నా పంచ్‌ల్లో తగినంత బలం లేదనిపించింది.
ఈ సారి అతడితో తలపడితే.. కచ్చితంగా విజయం సాధిస్తా.
- అమిత్ పంగల్

-ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన తొలి బాక్సర్‌గా అమిత్ చరిత్రకెక్కాడు.

268

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles