స్మిత్‌xస్టోక్స్


Thu,September 12, 2019 05:08 AM

-నేటి నుంచి యాషెస్ చివరి టెస్టు
-18 ఏండ్ల తర్వాత సిరీస్ నెగ్గాలని ఆసీస్
-పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్
-మ. 3.30 నుంచి సోనీ సిక్స్‌లో..

smith
లండన్: యాషెస్ సిరీస్ చివరి అంకానికి చేరింది. 18 ఏండ్ల నుంచి ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ నెగ్గాలని తహతహలాడుతున్న కంగారూల కల నెరవేరే సమయం వచ్చేసింది. ప్రస్తుతం 4 టెస్టులు పూర్తైన సిరీస్‌లో ఆస్ట్రేలియా 2 మ్యాచ్‌లు నెగ్గి ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్ ఓ టెస్టు గెలువగా.. మరొకటి డ్రాగా ముగిసింది. చివరిదైన ఐదో టెస్టు గురువారం ప్రారంభం కానుంది. 2001 నుంచి ఇంగ్లండ్‌లో సిరీస్ సాధించాలని భావిస్తున్న ఆసీస్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 3-1తో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తుంటే.. చివరి టెస్టులోనైనా నెగ్గి ట్రోఫీ దక్కకపోయినా.. 2-2తో సిరీస్ సమం చేయాలని రూట్ బృందం కృతనిశ్చయంతో ఉంది. సిరీస్‌లో కేవలం 5 ఇన్నింగ్స్‌లే ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 134.20 సగటుతో 671 పరుగులు చేసి అద్వితీయ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతడినొక్కడిని ఆపితే కంగారూలను నిలువరిచడం పెద్ద కష్టం కాదని ఇటీవలే వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఇంగ్లిష్ జట్టు భావిస్తున్నది. 2014 నుంచి సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోని ఇంగ్లండ్‌కు ఇప్పుడు ఆ ప్రమాదం తప్పకపోయినా.. చివరి మ్యాచ్‌లో నెగ్గి గౌరవప్రదంగా ఎండ్‌కార్డ్ వేయాలని చూస్తున్నది.

అతనొక్కడే!

విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరల్డ్‌కప్‌లో భారీగా పరుగులు సాధించిన వార్నర్ ఈ టూర్‌లో కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమై 9.87 సగటుతో 79 పరుగులు మాత్రమే చేశాడు. భారీ స్కోర్లు పక్కనపెట్టి.. ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎదుర్కునేందుకే నానా తంటాలు పడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు అతడి బౌలింగ్‌లోనే ఔటైన వార్నర్ చివరి టెస్టులోనైనా తనదైన ముద్రవేయాలనుకుంటున్నాడు. ఇక మరో ఓపెనర్ హారిస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వీరిద్దరూ విఫలమవుతుండటంతో తొలి సెషన్ కంటే ముందే స్మిత్ క్రీజులోకి రావాల్సి వస్తున్నది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గని స్మిత్ సిరీస్‌లో మూడు సెంచరీలు.. రెండు అర్ధసెంచరీలతో తన విలువ చాటుకున్నాడు.

ఈ సిరీస్‌లో అతడి అత్యల్ప స్కోరు 82 అంటేనే అతడు ఎంత భీకర ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఉస్మాన్ ఖవాజకు తుదిజట్టులో చోటు కష్టమైపోయింది. రెండో టెస్టులో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అదరగొట్టిన లబుషేన్ మంచి ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నా.. మిడిలార్డర్‌లో వెడ్, హెడ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ హెడ్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను బరిలో దించనుంది. కెప్టెన్ పైన్ ఫర్వాలేదనిపిస్తున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, కమిన్స్, హజిల్‌వుడ్ జోరుమీదుండటం ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.

stockes

రూట్‌కు చివరిచాన్స్!

సిరీస్‌లో ఇంగ్లండ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండు నెలల క్రితం వన్డే ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచిన జట్టు ప్రతిష్ఠాత్మక సిరీస్‌లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ముఖ్యంగా కెప్టెన్ జో రూట్ వైఫల్యం జట్టును కలవరపెడుతున్నది. ఈ సిరీస్‌లో మూడుసార్లు డకౌటై చెత్త రికార్డు తన పేరిట రాసుకున్న రూట్ చివరి టెస్టులోనూ ఇదే తీరు కొనసాగిస్తే.. అతడిపై వేటు పడే అవకాశాలు పుష్కలం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇరగదీస్తున్న జాసన్ రాయ్ (13.75 సగటు)ను టెస్టులకు ఎంపిక చేస్తే.. అతడూ న్యాయం చేయలేకపోతున్నాడు. ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడ ఆడించిన ఫలితం మాత్రం శూన్యం. ఈ మ్యాచ్‌లో అతడిని పక్కనపెట్టి స్యామ్ కరన్‌ను ఆడించనున్నారు. అరివీరభయంకరులుగా గుర్తింపు పొందిన బెయిర్‌స్టో (25.42 సగటు), బట్లర్ (16.25 సగటు) ఏ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు.

ఎటొచ్చి జట్టు భారం మొత్తం ఆల్‌రౌండర్ స్టోక్స్‌పైనే పడుతున్నది. అందుకు తగ్గట్లే అతడు 354 పరుగులతో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగుల జాబితా టాప్‌లో ఉన్నాడు. ఓపెనర్ బర్న్స్ కొన్ని చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడినా.. అతడిలో నిలకడ లోపించింది. మరో ఓపెనర్ డెన్లీ మెడపై కూడా కత్తి వేలాడుతున్నది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ అండర్సన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. అతడి స్థానంలో వచ్చిన ఆర్చర్ ఆకట్టుకుంటున్నా.. ఆ స్థాయిలో మెరిపించలేకపోతున్నాడు. బ్రాడ్ నిలకడగా వికెట్లు తీస్తున్నా సహచరుడి గైర్హాజరీలో అవి మరుగునపడిపోతున్నాయి. ఐదో టెస్టులో స్టోక్స్ బౌలింగ్ చేయడంపై అనుమానాలు ఉన్నా.. స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే అతడిని తుదిజట్టులో కొనసాగించనున్నారు. ఓవర్టన్ స్థానంలో మరో పేస్ ఆల్‌రౌండర్ క్రిస్‌వోక్స్ తుదిజట్టులో ఆడనున్నాడు. ఇరు జట్లు స్పిన్నర్లు లియాన్, లీచ్ తమ పని తాము చేస్తున్నారు.

576

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles