యాషెస్‌లో ‘హై’డ్రామా


Mon,August 19, 2019 04:03 AM

ఫలితం తేలకుండానే ముగిసిన రెండో టెస్టు.. స్టోక్స్ సెంచరీ.. రాణించిన ఆర్చర్
stokes
లండన్: ఇటీవల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో అద్భుత పోరాటంతో జట్టును విజయపథంలో నిలిపిన ఇంగ్లండ్ ఆటగాళ్లు బెన్‌స్టోక్స్ (115; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), జొఫ్రా ఆర్చర్ (3/32) యాషెస్ రెండో టెస్టులోనూ తమ జట్టును గెలిపించేందుకు శతవిధాల కృషిచేశారు. ఒకరు బ్యాటింగ్‌లో సెంచరీతో శివాలెత్తితే.. మరొకరు బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. వర్షం కారణంగా నాలుగు రోజుల ఆటే సాధ్యమైన ఈ మ్యాచ్.. అనూహ్య మలుపులు తిరుగుతూ చివరకు డ్రాగా ముగిసింది. ప్రత్యర్థి ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచి డిక్లేర్ చేసిన ఇంగ్లండ్ అనంతరం బౌలింగ్‌లో విజృంభించింది. 267 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలో దిగిన ఆస్ట్రేలియా ఆదివారం ఆట ముగిసే సమయానికి 47.3 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది.

కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోదిగిన లబ్‌షేన్ (59) అర్ధశతకంతో చెలరేగగా.. హెడ్ (42 నాటౌట్) రాణించాడు. ఇప్పటికే బౌన్సర్‌తో స్టీవ్ స్మిత్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేసిన ఆర్చర్.. అతడి స్థానంలో సబిస్టిట్యూట్‌గా వచ్చిన లబ్‌షేన్‌కు కూడా దడపుట్టించాడు. అయిదే గ్రిల్ ఉండటంతో బతికిపోయిన లబ్‌షేన్ చక్కటి పోరాటంతో ఇంగ్లిష్ జట్టుకు విజయావకాశాలను దూరం చేశాడు. లీచ్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 96/4తో చివరిదైన ఐదోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్టోక్స్ సెంచరీకి తోడు బట్లర్ (31), బెయిర్‌స్టో (30) వేగంగా ఆడటంతో 258/5 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 258 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 250కి ఆలౌటైంది. ఇంగ్లిష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 258/5 వద్ద డిక్లేర్ చేస్తే.. కంగారూలు చివరకు 6 వికెట్లకు 154 పరుగులు చేయగలిగారు.

తొలిసారి కాంకషన్ సబ్‌స్టిట్యూట్

క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లబ్‌షేన్ రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఇంగ్లండ్ పేసర్ ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడ్డ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానంలో అతడు ఈ మ్యాచ్‌లో ఆడాడు. స్మిత్ గాయపడ్డ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనల మేరకు ఆసీస్ సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా.. అందుకు అంగీకారం లభించింది. సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ మాత్రమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది.

1256

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles