రెండో స్థానంలో బెంగాల్


Thu,September 12, 2019 05:05 AM

-యు ముంబాపై విజయం
-ప్రొ కబడ్డీ లీగ్ 7వ సీజన్

pkl
కోల్‌కతా: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్ వారియర్స్ జోరు కనబరుస్తున్నది. బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 29-26తో యు ముంబా పై గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. వారియర్స్ తరఫున సుఖేశ్ హెగ్డే 8, మణిందర్ 7 పాయింట్లు సాధించారు. ముంబా నుంచి అర్జున్ దేశ్వాల్ (15 పాయింట్లు) సూపర్-10తో మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు. ప్రస్తుతం లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ 8 విజయాలు, 4 పరాజయాలు, 3 డ్రాలతో 53 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలువగా.. 15 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు ఒక డ్రాతో యు ముంబా (43 పాయింట్లు) పట్టికలో ఐదో ప్లేస్‌లో ఉంది. అర్జున్ విజృంభణతో రైడింగ్‌లో ముందంజలో నిలిచిన యు ముంబా.. ట్యాక్లింగ్‌లో వెనుకబడి మ్యాచ్‌ను కోల్పోయింది. తొలి కూతలోనే అర్జున్ సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు సాధించడంతో ముంబై జట్టు శుభారంభం వేసింది.

కాసేపటికే తేరుకున్న బెంగాల్ కూడా ఖాతా తెరిచి 3-3తో స్కోరు సమం చేసింది. ఆరంభంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే జోరు పెంచిన బెంగాల్ వరుస పాయింట్లు సాధించి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 16-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తిరిగి పుంజుకున్న యు ముంబా ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడటంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి బెంగాల్ 16-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో కూడా పట్టు నిలుపుకున్న బెంగాల్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మరో రెండు నిమిషాల్లో పోరు ముగుస్తుందనగా.. ఒక పాయింట్ మాత్రమే వెనుకంజలో ఉన్న ముంబై మ్యాచ్‌ను డ్రా చేసుకునేలా కనిపించింది. కానీ, అప్పటి వరకు ఆకట్టుకున్న రైడర్ అర్జున్ ప్రత్యర్థి కోర్టులో సూపర్ ట్యాకిల్ కావడంతో యు ముంబాకు ఓటమి తప్పలేదు. హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 32-32తో డ్రాగా ముగిసింది.

526

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles