అండ్రెస్కు అద్భుతః


Mon,September 9, 2019 01:24 AM

-యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన బియాంక..
-ఫైనల్లో సెరెనా విలియమ్స్‌పై జయభేరి..
-ఈ ఘనత సాధించిన తొలి కెనడా ప్లేయర్‌గా రికార్డు
-రూ.27.59 కోట్ల ప్రైజ్‌మనీ

అకుంఠిత దీక్ష ముందు అనుభవం తలవంచింది. హోరాహోరీ పోరు ఖాయం అనుకుంటే.. కెనడా టీనేజ్ సంచలనం వన్‌సైడ్ విక్టరీ కొట్టింది. ప్రత్యర్థి అనుభవమంత వయసులేని కెనడా యువ సంచలనం బియాంక అండ్రెస్కు యూఎస్ ఓపెన్ టైటిల్ ఎగురేసుకెళ్లింది. ఈ టోర్నీకి ముందు కనీసం గ్రాండ్‌స్లామ్ రెండో రౌండ్‌కు చేరిన రికార్డు కూడా లేని ఓ అనామక ప్లేయర్ చూస్తుండగానే.. అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. తద్వారా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి కెనడా ప్లేయర్‌గా రికార్డు సృష్టించడమే కాక.. రష్యా క్రీడాకారిణి మారియా షరపోవా (2006, యూఎస్ ఓపెన్)తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కింది.మాతృత్వపు మాధుర్యాన్ని రుచిచూశాక కూడా తనలో చేవతగ్గలేదని నిరూపించుకుంటున్న సెరెనా తుదిమెట్టుపై ఆకట్టుకోలేకపోయింది. తానాడిన గత మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనళ్ల మాదిరిగానే ఈసారి కూడా వరుస సెట్లలో ఓటమి పాలైంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన మార్గరెట్ కోర్ట్ (24) రికార్డును సమం చేయాలని రెండేండ్లుగా కంకణం కట్టుకొని కూర్చున్న సెరెనాకు మరోసారి నిరాశ తప్పలేదు. గతేడాది ఇక్కడే ఒసాకా చేతిలో ఖంగుతిన్న సెరెనా.. ఈసారి బియాంక చేతిలో పరాజయం పాలైంది. 1999లో సెరెనా తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సమయానికి ఇంకా భూమ్మీద అడుగుపెట్టని అండ్రెస్కు.. ఇప్పుడు తన అభిమాన తారను ఫైనల్లో మట్టికరిపించడం కొసమెరుపు.
Andreescu

న్యూయార్క్: సీజన్ ముగింపు టోర్నీ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో అమెరికా స్టార్ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌కు చుక్కెదురైంది. కెనడా యంగ్ తరంగ్ అండ్రెస్కూ రెచ్చిపోవడంతో.. వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోనూ సెరెనా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో టీనేజ్ సంచలనం బియాంక అండ్రెస్కు 6-3, 7-5తో 23 గ్రాండ్‌స్లామ్‌ల విజేత సెరెనాను వరుస సెట్లలో చిత్తుచేసి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఒడిసి పట్టింది. ఓ కెనడా ప్లేయర్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో బౌచార్డ్ (2014) వింబుల్డన్ ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాల రికార్డులో మార్గరెట్ కోర్ట్ (24, ఆస్ట్రేలియా)ను సమం చేయాలని రెండేండ్లుగా ప్రయత్నిస్తున్న సెరెనా (23 టైటిళ్లు)కు మరోసారి నిరాశ తప్పలేదు. 33వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన విలియమ్స్.. గత నాలుగు మేజర్ టోర్నీల్లోనూ తుదిమెట్టుపై తడబడింది. 2017 ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన అనంతరం రెండు వింబుల్డన్ ఫైనల్స్, రెండు యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లోనూ సెరెనా పరాజయం పాలైంది. అండ్రెస్కు నీకు అభినందనలు. నువ్వు సాధించిన ఘనతను చూసి దేశం గర్విస్తున్నదిఅని కెనడా ప్రధాని జస్టిన్ ట్విట్టర్ ద్వారా బియాంకను అభినందించడం.. ఆమె విజయం కెనడా యువతలో ఎంత ప్రభావం చూపుతుందనడానికి అద్దం పడుతున్నది. 26 వేల మంది ప్రేక్షకుల్లో దాదాపు 90 శాతం మంది.. లోకల్ స్టార్ సెరెనాకు మద్దతు తెలుపుతున్నా.. మొక్కవోని దీక్షతో పోరాడిన అండ్రెస్కు నయా చరిత్ర సృష్టించింది. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్లో నవోమీ ఒసాకా చేతిలో ఓడిన 37 ఏండ్ల సెరెనా విలియమ్స్‌కు ఇక్కడ వరుసగా ఇది రెండో పరాజయం. ఆ మ్యాచ్ అనంతరం అంపైర్‌తో వాగ్వాదానికి దిగి.. అపప్రదను మూటగట్టుకున్న సెరెనా ఈ సారి ఎలాంటి భేషజాలకు పోకుండా ప్రత్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించింది.

178 నుంచి టాప్-5లోకి..

ఈ ఏడాది యూఎస్ ఓపెన్ మెయిన్ డ్రాకు చేరడానికి ముందు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన 19 ఏండ్ల బియాంక.. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్న చందంగా చెలరేగింది. ఎదురులేని అటాకింగ్.. ధీటైన డిఫెన్స్‌తో విజృంభించిన అండ్రెస్కు అనుకున్నది సాధించింది. ఫైనల్ చేరే క్రమంలో దిగ్గజ క్రీడాకారిణులను చిత్తుచేసిన బియాంక.. తుదిపోరులో తన ఆరాధ్య క్రీడాకారిణి సెరెనాకు చెమటలు పట్టించింది. తొలి సెట్‌ను ఏకపక్షంగా చేజిక్కించుకున్న అండ్రెస్కు.. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా.. పట్టువదలకుండా విజయం సాధించింది. తద్వా రా స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా, 2004) తర్వాత పిన్న వయసులో యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. అండ్రెస్కుకు 3.85 మిలియన్ డాలర్ల (రూ. 27.59 కోట్లు) ప్రైజ్‌మనీ లభించగా.. నేడు విడుదలకానున్న ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంక్‌కు చేరనుంది.

ఎదురులేని ఆటతీరుతో..

మ్యాచ్ మొత్తంలో సెరెనా 9 ఏస్‌లు సంధిస్తే.. బియాంక 5 మాత్రమే కొట్టింది. అయితే విలియమ్స్ 8 డబుల్ ఫాల్ట్స్ చేస్తే.. అండ్రెస్కు కేవలం 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. సెరెనా 8 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో మూడింటిని సద్వినియోగం చేసుకుంటే.. అండ్రెస్కు పదమూడింట 6 నెగ్గింది. మొదటి సెట్‌లో బియాంక 4-2తో ఉన్న దశలో వరుసగా ఐదు బ్రేక్ పాయింట్లు కాచుకున్న సెరెనా తిరిగి పుంజుకునేందుకు యత్నించినా.. బియాంక గట్టిగా పోరాడింది. ఇక అదే ఊపులో సెట్‌ను సొంతం చేసుకున్న బియాంక.. రెండో సెట్‌లో 5-1తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. మరికాసేపట్లోనే మ్యాచ్ ముగుస్తుందనుకుంటున్న దశలో సెరెనా చక్కటి పోరాటంతో మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చింది. 17 పాయింట్లలో 14 పాయింట్లు నెగ్గిన విలియమ్స్ స్కోరును 5-5తో సమం చేసి మంచి ఊపులో కనిపించింది. అయినా బియాంక వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి 7-5తో మ్యాచ్‌ను సొంతం చేసుకొని సగర్వంగా టైటిల్‌ను ముద్దాడింది.

మూడేండ్ల కల నెరవేరిన వేళ..

ఈ స్థాయిలో నేను ఓడిపోదల్చుకోలేదు. అందుకే ప్రతీ మ్యాచ్‌లో నా అత్యుత్తమ ఆటతీరు కనబర్చేందుకు యత్నించా.. అదే నన్ను ఈ స్థానంలో నిలబెట్టిందిసెరెనాను ఓడించిన అనంతరం బియాంక నోటి వెంట వచ్చిన మాటలివి. ఈ మాటలు ఆమెలోని విజయకాంక్షకు అద్దంపడతాయి. ఇప్పటి వరకు కనీసం గ్రాండ్‌స్లామ్ టోర్నీ రెండో రౌండ్‌కు చేరని ఓ టీనేజ్ అమ్మాయి. ఏకంగా 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఖాతాలో వేసుకున్న టెన్నిస్ లెజెండ్‌ను ఓడించడం అంటే మామూలు మాటలా.. కానీ బియాంక అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది. గత సీజన్‌ను 178వ ర్యాంకుతో ముగించిన అండ్రెస్కు ఈ సీజన్ ఆరంభం నుంచే అద్భుతాలు చేసింది. ఈ ఏడాది టాప్-10 క్రీడాకారిణులతో 8 సార్లు తలపడ్డ బియాంక అందులో ఒక్కరి చేతిలో కూడా పరాజయం పాలవలేదు.బియాంక తల్లిదండ్రులు రొమేనియా నుంచి వలస వచ్చి కెనడాలో స్థిరపడ్డారు. జూనియర్ స్థాయిలో అండ్రెస్కు విజయాలను చూసి పొంగిపోయిన వాళ్లు ఇంకా ముందుకెళ్లాలని ప్రోత్సహించారు. అయితే మూడేండ్ల క్రితం (16 ఏండ్ల వయసులో) ఆరెంజ్ బౌల్‌టైటిల్ నెగ్గే వరకు బియాంక ఆటపై పెద్దగా ఇష్టం కనబర్చలేదు. కానీ ఆ విజయం ఆమెలో ఆత్మవిశ్వాసం నింపింది. ఈ టోర్నమెంట్ నెగ్గగలిగానంటే.. గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవొచ్చుఅనే ఆలోచన ఆ క్షణంలోనే పుట్టింది. ఇక అక్కడి నుంచి ప్రయత్నాలు ముమ్మరం చేసిన అండ్రెస్కు చూస్తుండగానే తనలక్ష్యం వైపు వడివడిగా అడుగులు వేసింది. 1997లో యూఎస్ ఓపెన్ అరంగేట్రంలోనే ఫైనల్ చేరిన వీనస్ విలియమ్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్న బియాంక మూడేండ్ల క్రితం కన్న కలను శనివారం నిజం చేసుకుంది. టెన్నిస్ క్రీడ గురించి కాస్తో కూస్తో తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ ఆటలో కంటికి, చేతికి ఉండే సమన్వయం గురించి తెలిసే ఉంటుంది. సరిగ్గా అక్కడే వందకు వంద పాయింట్లు కొట్టేసిన అండ్రెస్కు టోర్నీ మొత్తంలో ఎక్కడా ఒత్తిడికి లోనుకాలేదు. క్వార్టర్స్ వరకు టైటిల్ కంటెండర్‌గా కనిపించని బియాంక సెమీస్‌లో బెన్‌కిక్‌తో పోరులో అసమాన పోరాటంతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఫైనల్లోనూ అదే జోరు కనబరుస్తూ.. సెరెనాను మట్టికరిపించింది.
Andreescu1

-గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి కెనడా క్రీడాకారిణిగా అండ్రెస్కు రికార్డుల్లోకెక్కింది.
-ఈ సీజన్‌లో టాప్-10 క్రీడాకారిణులతో తలపడ్డ ఎనిమిది సార్లు బియాంక అండ్రెస్కునే విజయం వరించింది.

నా ఆనందాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. ఈ క్షణం కోసం నేను ఎంతో కష్టపడ్డా. నేనెప్పటి నుంచో కలలు కన్న సీజన్ ఇది. చాలా గొప్పగా సాగింది. టెన్నిస్ లెజెండ్ సెరెనాపై గెలువడం మరిచిపోలేని అనుభూతి. ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పక్కనపెట్టి ఒక్కో గేమ్‌పై దృష్టి సారించుకుంటూ ఇక్కడి వరకు వచ్చా. ఏడాది క్రితం యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరుతానని కూడా నేను ఊహించలేదు. నా కఠోర శ్రమకు ఫలితం దక్కిందనుకుంటున్నా. గడ్డు పరిస్థితులే మనిషిని మరింత రాటుదేల్చుతాయని నేను నమ్ముతా. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ముందే ఊహించా. ఆ ఊహే ఈ రోజు కార్యరూపం దాల్చింది.
- అండ్రెస్కు

అండ్రెస్కు నమ్మశక్యం కాని రీతిలో ఆడింది. ఆమె ఆట చూసి గర్విస్తున్నా. ఏ మాటకామాట చెప్పుకోవాలంటే టోర్నమెంట్ మొత్తంలో ఈ మ్యాచ్‌లోనే నేను చెత్తగా ఆడా. బియాంక అద్భుతంగా ఆడింది. ఆమె రిటర్న్‌లు నాపై ఒత్తిడి పెంచాయి. కానీ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో నా ఆటతీరు సమర్థనీయం కాదు. దీనికన్నా నేను బాగా ఆడగలను. ప్రొఫెషనల్ ప్లేయర్‌గా పరాజయాలను పక్కనపెట్టి ముందుకు సాగాలనుకుంటున్నా. నేను మార్గరెట్ రికార్డును ఛేదించాలనే ఉద్దేశంతో బరిలో దిగడం లేదు. గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకే ఆడుతున్నా.
- సెరెనా

236

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles