సెమీస్‌లో సాత్విక్ జోడీ


Sat,November 9, 2019 12:07 AM

-క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ను చిత్తుచేసిన భారత ద్వయం..
- చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

satwik
ఫుజౌ (చైనా): జోరు మీదున్న భారత డబుల్స్ ద్వయం రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 టోర్నీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 9వ సీడ్ సాత్విక్ జోడీ 21-19, 21-15తో 3వ సీడ్ చైనా జంట లి జున్ హుయ్-లియూ యూ చెన్‌పై అలవోకగా గెలిచింది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో చెలరేగి ఆడిన భారత జంట వరుస గేమ్‌ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది. శనివారం జరుగనున్న సెమీఫైనల్లో టాప్‌సీడ్, ప్రపంచ నంబర్ వన్ మార్కస్ ఫెర్నాల్డీ-కెవిన్ సంజయ (ఇండోనేషియా)జంటతో.. సాత్విక్ ద్వయం తలపడనుంది. గత నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఫెర్నాల్టీ జంట చేతిలో ఓడిన సాత్విక్ జోడీ రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

దుమ్మురేపిన సాత్విక్-చిరాగ్

స్టార్ షట్లర్లంతా వెనుదిరిగిన చైనా ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ దుమ్మురేపారు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా ఒత్తిడికి లోను కాకుండా ఎదురు నిలిచిన భారత జంట.. గేమ్‌ను తమ పేరిట రాసుకుంది. ఇక రెండో గేమ్‌లో పుంజుకున్న చైనా జోడీ దూకుడుగా ఆడుతూ భయపెట్టింది. దీంతో పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. 15-15తో ఉన్న సమయంలో విజృంభించిన సాత్విక్ జోడీ ప్రత్యర్థిని అనవసర తప్పిదాలు చేసే విధంగా పురిగొల్పి వరుసగా 6 పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఆగస్టులో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన భారత జోడీ.. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఫైనల్లో తమను ఓడించిన ఇండోనేషియా జోడీని ఈ సారి సెమీస్‌లోనే చిత్తు చేయాలని కృతనిశ్చయంతో ఉంది.

170

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles