కళ తప్పుతున్నదా..!


Wed,June 12, 2019 01:29 AM

ఏమైందీ విశ్వసమరానికి.. ఓ వైపు వర్షాలు.. మరో వైపు గాయాలు. అసలే వన్డేలపై ఆసక్తి తగ్గుతున్న తరుణంలో ఏమిటీ విధి వైపరిత్యం.
World-Cup
టోర్నీ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్ డెల్ స్టెయిన్ గాయంతో దూరమైతే.. అతని బాటలోనే పేసర్ లుంగి ఎంగ్డీ కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే మరో బౌలర్ నోర్టే సేవలు కోల్పోయిన సఫారీలను వరుణుడు కూడా కరుణించలేదు. మొదటి మూడు మ్యాచ్‌లు ఓడిన సఫారీలకు వెస్టిండీస్‌తో నాలుగో మ్యాచ్‌లో వర్షం రూపంలో బలమైన ఎదురుదెబ్బ తగిలింది. ఈ తంతు కేవలం సఫారీలకే పరిమితం కాలేదు. శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్.. ఆఫ్ఘనిస్థాన్ కీపర్ అహ్మద్ షహజాద్.. ఆస్ట్రేలియా పేసర్ జే రిచర్డ్‌సన్, ఆల్‌రౌండర్ స్టొయినిస్.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్.. విండీస్ డేంజర్ మ్యాన్ ఆండ్రీ రస్సెల్.. ఇలా గాయపడ్డవారి జాబితా చాంతాడంత ఉంది. తాజాగా ఓపెనర్ శిఖర్ ధవన్ వేలి గాయం టీమ్ ఇండియాను కలవరపాటుకు గురిచేస్తున్నది. పొట్టి క్రికెట్ మాయలో పోటీ క్రికెట్ వెనుకబడిపోతున్న సమయాన ప్రపంచకప్‌తోనైనా వన్డేలకు జవసత్వాలు నింపుదామంటే వాతావరణం కారణంగా అదీ సాధ్యపడేలాలేదు.

World-Cup2
రెండు దశాబ్దాల తర్వాత ప్రపంచకప్ నిర్వహించే చాన్స్ దక్కించుకున్న ఇంగ్లండ్.. అద్వితీయ ఆతిథ్యంతో ఆకట్టుకోవాలని టోర్నీని వేసవికాలంలో ప్లాన్ చేసింది. గత నాలుగు ప్రపంచకప్‌లు ఏప్రిల్ నెలాఖరులోగానే ముగిస్తే.. ఇంగ్లండ్ మాత్రం అందుకు భిన్నంగా స్థానిక వాతావరణం ప్రకారం ఎండాకాలం ప్రారంభమయ్యాక మే నెలాఖరున మెగాటోర్నీ మొదలెట్టింది. వాస్తవానికి ఇంగ్లండ్‌లో ఇది మాంచి ఎండాకాలం. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడాల్సిన సమయం. కానీ అందుకు విరుద్ధంగా భారీ వర్షాలు దంచి కొడుతుండటంతో నిర్వాహకులు సైతం నిశ్చేష్ఠులవుతున్నారు. ఆరంభంలోనే ఏకపక్ష మ్యాచ్‌లతో మెగాటోర్నీ పెద్దగా ఆసక్తి పుట్టించలేకపోగా.. హాట్ ఫేవరెట్ టీమ్‌ఇండియా వారం తర్వాత బరిలో దిగి రెండు మంచి మ్యాచ్‌లు ఆడి కాస్త వేడి పుట్టించిందో లేదో ఇప్పుడు వాతావరణం రూపంలో ఎదురుదెబ్బ పడింది.
World-Cup3

రెండు వారాల్లో మూడు రద్దు

బ్రిస్టల్ వేదికగా జరిగిన పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు అడ్డుపడ్డ వరణుడు ఆట రద్దయ్యేంతవరకు శాంతించలేదు. మెగాటోర్నీలో ఓ మ్యాచ్ రద్దుకావడం పెద్ద విషయం కాదని వదిలేసేలోపే.. ఐసీసీ టోర్నమెంట్లలో దురదృష్టం జేబులో పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు. సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్‌తో సోమవారం జరగాల్సిన మ్యాచ్ కూడా వాన కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. ఫలితంగా దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ఖాతా తెరవనైతే తెరిచింది కానీ.. సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న సఫారీలు కేవలం ఒక్క పాయింటే సాధించారు. ఇక్కడి నుంచి ముందుకెళ్లాలంటే మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలిచి తీరాల్సిందే. తాజాగా మంగళవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్‌కు ఈ ఇబ్బందే ఎదురైంది. కనీసం టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రైద్దెంది. వరణుడు లంక మ్యాచ్‌ను అడ్డుకోవడం టోర్నీలో ఇది రెండోసారి కాగా.. రెండు సార్లు వేదిక బ్రిస్టలే.

కోహ్లీసేనకూ వర్షం ముప్పే

టాంటన్ వేదికగా బుధవారం జరగాల్సిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు మెండుగా ఉంటే.. గురువారం భారత్, న్యూజిలాండ్ తలపడనున్న నాటింగ్‌హమ్ (ట్రెంట్‌బ్రిడ్జ్)లో కుండపోతకు ఆస్కారమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే నాటింగ్‌హమ్‌లో పసుపు రంగు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరో వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. వర్షం తెరిపినిచ్చినా 10 డిగ్రీల ఉష్ణోగ్రతే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మరో రెండు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యే సూచనలున్నాయి.
World-Cup1

వరుణుడే విజేత

బ్రిస్టల్: ప్రపంచకప్‌లో వరుణుడి జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మెగాటోర్నీలో వరుసగా రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య మంగళవారం మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే ముగిసింది. మూడు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో బరిలోకి దిగాలనుకున్న లంక, బంగ్లా ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. ఎడతెరిపి లేని వర్షంతో ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో పలుమార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ దక్కింది.

World-Cup4

753

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles