అష్టముఖ పోరు


Sat,March 23, 2019 02:39 AM

-నేటి నుంచి ఐపీఎల్-12
-బరిలో హేమాహేమీలు
-ఆటగాళ్లకు ప్రపంచకప్ భయం

దేశం మొత్తం ఎన్నికల వేడి.. సాయంత్రానికి క్రికెట్ హడావుడి..రాబోయే రెండు నెలలు ఎక్కడ చూసినా ఇదే వాడి.. వేడి!ఒకే ఒక్క షాట్.. మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తుంది.. ఒకే ఒక్క వికెట్.. జట్టు తలరాతను మారుస్తుంది!విధ్వంసానికి విలువ పెరుగుతుంది..విజృంభణకు విజయం దక్కుతుంది..అనామకులు అందలం ఎక్కడానికి క్షణం పడితే.. అంచనాలు తారుమారు కావడానికి అరక్షణం కూడా పట్టదు..కొడితే హీరోలు.. పడితే జీరోలు.. సిక్సర్ల జడివానలో.. వికెట్ల ప్రళయ జాతరలో మేను విరిగే విన్యాసాలకు.. కండ్లు చెదిరే క్యాచ్‌లకు. పండుగను మించిన సంబురాలకు.. యుద్ధాన్ని మించిన ఆవేశావేశాలకు... ఊపిరిబిగపట్టే క్షణాలకు.. ఉత్కంఠ రేపే సన్నివేశాలకు సమయం ఆసన్నమైంది..!గత 11 ఏండ్లుగా ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్దులను చేస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-12కు వేళయింది. నేడు చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే తొలి మ్యాచ్‌తో ధనాధన్‌కు తెరలేవనుంది.

న్యూఢిల్లీ: బుమ్రా యార్కర్‌ని అడ్డుకునేందుకు ధోనీ ఏం వ్యూహం రచిస్తాడు? కుల్దీప్ గూగ్లీని విరాట్ ఎలా కౌంటర్ చేస్తాడు? మిస్టర్ 360కి చెక్ పెట్టే బౌలర్ ఎవరు? అశ్విన్ కొత్త అస్ర్తాలు పని చేస్తాయా? విదేశీ వీరులు మెరుపులు మెరిపిస్తారా? భారీ ధర పలికిన కుర్రాళ్లు కుమ్మేసేందుకు రెడీగా ఉన్నారా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వార్షిక క్రికెట్ పండుగ ఐపీఎల్-12కు రంగం సిద్ధమైంది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లీగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఐపీఎల్ ముగిసిన రెండున్నర వారాల తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌నకు తెరలేవనుంది. 2011, 2015లో ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్ రావడంతో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ ఇప్పుడు ఎవరైనా కీలక ఆటగాళ్లు గాయాలబారిన పడితే కోలుకునే సమయం కూడా లేదు. దీంతో వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్‌లో ఆడాలనే ఆశలకు ఇక్కడితోనే తెరపడుతుంది. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరుగుతాయి. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్నాయి.
Khohli

ఆటగాళ్లపై ఒత్తిడి..


కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలి. అదే సమయంలో దేశ ప్రతిష్ఠతో ముడిపడి ఉన్న ప్రపంచకప్‌లోనూ తమ జాతీయ జట్లను గెలిపించాల్సిన బాధ్యత కూడా ఉంది. దీంతో ఒకేసారి రెండు కీలక టోర్నీల్లో పాల్గొనాల్సి రావడంతో ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటివరకు ముగిసిన 11 సీజన్లలో దేనికదే ప్రత్యేకతను సంతరించుకున్నా.. వాటిని మించిన ఉత్కంఠ 12వ సీజన్‌పై నెలకొంది. దీనికితోడు పనిభారం ఆంశం ఇప్పుడు అతిపెద్ద చర్చగా మారింది. పని భారాన్ని ఒత్తిడిగా భావించే ఆటగాళ్లు ధనాధన్‌లో మెరుపులు చూపిస్తారా? వేచి చూడాలి. ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల మానియాతో ఊగిపోతున్నది. దీనికి తోడుగా క్రికెట్ ఫీవర్ మొదలుకాబోతున్నది. మొత్తానికి అటు ఎలక్షన్.. ఇటు ఐపీఎల్.. అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేయబోతున్నాయి.

వారసత్వం ఎవరిదో..


ఐపీఎల్‌లో ఫేవరెట్లను ఊహించడం కష్టమే అయినా.. ఈ లీగ్‌తో ధోనీకి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎక్కడో జార్ఖండ్‌లో పుట్టిన మహీ.. కేవలం ఐపీఎల్ కారణంగా చెన్నైని తన రెండో స్థిర నివాసంగా మార్చుకున్నాడు. మూడు టైటిల్స్‌తో కొత్త వారసత్వాన్ని సృష్టించాడు. మళ్లీ ఎల్లో జెర్సీలో మహీ ఏం మాయా చేస్తాడోనని తమిళ్ తంబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోహ్లీ బ్యాట్స్‌మన్‌గా నిరూపించు కోవాల్సింది లేకపోయినా.. గత 8 ఏండ్లుగా ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఒక్కసారి కూడా టైటిల్‌ను నెగ్గలేకపోయాడు. మరి ఈసారైనా ఆ ముచ్చట తీరుస్తాడా? ప్రస్తుతం విరాట్ మనసులో 90 శాతం ప్రపంచకప్ గురించిన ఆలోచనలే ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి వాటిని అధిగమించి ఆర్‌సీబీని విజేతగా నిలుపుతాడా? ఐపీఎల్‌లో మిగతా ఏడు జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్‌కు డిమాండ్ ఎక్కువ. దీనికితోడు రోహిత్ శర్మ మూడు టైటిల్స్‌తో సూపర్ సారథిగా మారిపోయాడు. నాలుగోసారి కూడా టైటిల్‌ను సాధించి అటు ఫ్రాంచైజీని, ఇటు సూపర్ కెప్టెన్ పేరును సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇదే సమయంలో హార్దిక్, బుమ్రాలపై పనిభారాన్ని ఎలా పర్యవేక్షిస్తాడో కూడా చూడాల్సిన అవసరం ఉంది. 2015 ప్రపంచకప్‌లో ఆడిన రహానే ఉన్నట్లుండి వన్డేలకే దూరమయ్యాడు.
Rahane

కారణాలు తెలియక పోయినా ఇప్పుడు రాజస్థాన్ జట్టు కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లీగ్‌లో రాణిస్తే మళ్లీ టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల జట్టులోకి తలుపులు తెరుచుకుంటాయని ఆశిస్తున్నా డు. టెస్ట్‌లకే పరిమితమైన అశ్విన్‌కు వన్డే, టీ20ల్లో దాదాపుగా చోటు దక్కనట్లే. కాబట్టి వరల్డ్‌కప్ బస్‌లో ఇతనికి సీటు లేదన్నది వాస్తవం. కనీసం పంజాబ్ జట్టుకు టైటిల్ అందించైనా సంతృప్తి చెందుతాడో చూడాలి. శ్రేయాస్ అయ్యర్ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నాడు. భవిష్యత్‌కు బంగారు బాటలు పడాలంటే ఈ లీగ్‌లో ముందుండి జట్టును నడిపించా ల్సిన అవసరంచాలా ఉంది. దినేశ్ కార్తీక్ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు. రిషబ్ పంత్ వైఫల్యంతో అతనికి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నా ఆ దిశగా సంకేతాలు రావడం లేదు. దీంతో ఐపీఎల్‌లో తన సత్తా చూపెట్టాలని భావిస్తున్నాడు. అదే సమయంలో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

విదేశీ వ్యూహాలు..


ఐపీఎల్‌లో ఏకైక విదేశీ కెప్టెన్‌గా ఉన్న విలియ మ్సన్.. సన్‌రైజర్స్‌కు మళ్లీ టైటిల్ అందించాలని భావిస్తున్నాడు. హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్ రాకతో విలియమ్సన్‌పై ఒత్తిడి చాలా వరకు తగ్గింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం వార్నర్‌పైనే ఉంది. ఎందుకంటే బాల్ టాంపరింగ్ తర్వాత అతను ఆడబోతున్న తొలి టోర్నీ కావడంతో మైదానంలో అతని ప్రవర్తనపై అనేక అనుమానాలు తలెత్తే అవకాశాలున్నాయి. జాగ్రత్తగా ఆడితే ఆసీస్ జాతీయ జట్టులోకి తిరిగి రావొచ్చు. భారత కెప్టెన్లతో పోలిస్తే విదేశీ ఆటగాళ్ల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ కార్డుగా ఉన్న ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను విలియమ్సన్ ఉపయోగిం చుకునే తీరుపైనే హైదరాబాద్ విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం అన్ని జట్లలో రాజస్థాన్ రాయల్స్ పేపర్ మీద సమతూకంగా కనిపిస్తున్నది. ముంబై, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే ఈ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను దురదృష్టం వీడుతుందో లేదో చెప్పడం కష్టంగా మారింది. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నా.. బౌలింగ్‌తోనే అసలు ఇబ్బందులు.

గేల్ మెరుస్తాడా!


ఐపీఎల్‌లో ఎక్కువగా ఇష్టపడే ఇద్దరు క్రికెటర్లలో ఒకరు గేల్ అయితే మరొకరు మిస్టర్ 360 డివిలియర్స్. వీళ్లిద్దరు క్రీజులో ఉంటే ఎదురుగా ఎంత మేటి బౌలరైనా చేష్టలుడిగిపోవాల్సిందే. ఈ ఐపీఎల్‌కు ఈ ఇద్దరు స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. ఎందుకంటే వరల్డ్‌కప్ తర్వాత గేల్ వన్డేలకు గుడ్‌బై చెబుతున్నాడు. దీంతో ఈ లీగ్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనికి తోడు ప్రస్తుతం ఈ కరీబియన్ అజానుబాహుడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డివిలియర్స్ నిలబడితే నీళ్లు తాగినంత సులువుగా బౌండరీల మోత మోగుతుంది. బెంగళూరు ఈసారి అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది. మ్యాక్స్‌వెల్, మిల్లర్, డికాక్, బెయిర్‌స్టో, బట్లర్ ఆటను కూడా ఓసారి తిలకిం చాల్సిందే. దేశవాళీ కుర్రాళ్లలో శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి, పారస్ బర్మన్, ప్రభా సిమ్రాన్ ఎలా ఆడుతారో చూడాలి. మొత్తానికి రాబోయే ఏడు వారాలు మెరు పులతో కూడిన పసందైన క్రికెట్ విందు ను ఆస్వాదించేందుకు సిద్ధంకండి.
Gayle

బోణీ ఎవరిదో?


ఓవైపు వెటరన్లు.. మరోవైపు కుర్రాళ్లు.. నాలుగో టైటిల్ కోసం ఒకరి వేట.. తొలి టైటిల్ కల నెరవేర్చేకునేందుకు మరొకరి ఆట. . వెరసీ శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు బెంగళూరు సిద్ధమైంది. డాడీస్ ఆర్మీ అంటూ హేళన చేసినా.. గతేడాది టైటిల్ గెలిచి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ధోనీసేన ఈ లీగ్ కోసం కొత్త ప్రణాళికలు రచిస్తున్నది. జట్టులో చాలా మంది 35 ఏండ్లకు పైబడి ఉన్నా.. వాళ్లతోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నాడు. వాట్సన్, బ్రావో, డుఫ్లెసిస్, రాయుడు, జాదవ్ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. తాహిర్, కర్ణ్ శర్మ, మోహిత్ శర్మ బౌలింగ్‌లో మెరిస్తే ఆర్‌సీబీకి కష్టాలు తప్పవు. మరోవైపు స్టార్లతో కూడిన బెంగళూరు తొలి మ్యాచ్ నుంచి విజయాల బాట పట్టాలని చూస్తున్నది. పేరుకు పెద్ద ఫ్రాంచైజీ హోదా ఉన్నా.. ఆటలో మాత్రం అదృష్టం వెనక్కి తన్నుతూనే ఉన్నది. కోహ్లీ, డివిలియర్స్ బ్యాటింగ్‌లో కీలకంకాగా, పేసర్ ఉమేశ్ యాదవ్ టీమ్‌ఇండియాలో చోటే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఎవరు బౌలింగ్ బాగా చేస్తే వాళ్లనే విజయం వరించనుంది.

910

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles