వారెవ్వా ఇంగ్లండ్


Fri,July 12, 2019 03:13 AM

-27 ఏండ్ల తర్వాత ఫైనల్‌కు
-సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఘనవిజయం
-మెరిసిన వోక్స్, రషీద్, రాయ్.. లార్డ్స్‌లో కివీస్‌తో బిగ్‌ఫైట్
ఐదు దశాబ్దాల ప్రపంచకప్ చరిత్రలో తొలి 5 టోర్నీల్లో మూడుసార్లు ఫైనల్ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఇంగ్లండ్.. 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా ఓడించి ఫైనల్ ఫైట్‌కు దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్లో భారత బ్యాటింగ్‌ను తలపించిన ఆసీస్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఎనిమిదోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరాలనుకున్న కంగారూల కలలను చిదిమేస్తూ.. బౌలింగ్‌లో వోక్స్, రషీద్ విజృంభిస్తే.. బ్యాటింగ్‌లో జాసెన్ రాయ్ ఆసీస్ పేసర్లతో చెడుగుడాడుకున్నాడు. ఫలితంగా మరో 108 బంతులు మిగిలుండగానే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ సొంతగడ్డపై సగర్వంగా తుదిపోరుకు చేరింది. ఫైనల్లో తలపడే రెండు జట్లూ ఇప్పటి వరకు కప్పు కొట్టకపోవడంతో.. కొత్త చాంపియన్‌ను చూసే అవకాశం దక్కనుంది. బ్యాటింగే బలంగా దూసుకొచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ మక్కా లార్డ్స్‌లో ఆదివారం జరిగే ఫైనల్లో నాణ్యమైన పేస్ వనరులున్న న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఇంకేముంది ఇక చలో లార్డ్స్..
woakes
బర్మింగ్‌హామ్: ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా పోరాటం కూడా సెమీఫైనల్లోనే ముగిసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య ఇంగ్లండ్ 27 ఏండ్ల తర్వాత విశ్వసమరం తుదిపోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి ఫైనల్ చేరింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (119 బంతుల్లో 85; 6 ఫోర్లు), ఒంటరి పోరాటం చేయగా.. అలెక్స్ కారీ (46; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, వోక్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (65 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగితే.. రూట్ (46 బంతుల్లో 49 నాటౌట్; 8 ఫోర్లు), మోర్గాన్ (39 బంతుల్లో 45 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. వోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో ఆతిథ్య ఇంగ్లండ్ తలపడనుంది.

jason-roy

రెచ్చిపోయిన రాయ్

లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో ఎలాంటి తడబాటుకు గురికాని ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ఛేజ్ చేసింది. ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో (34; 5 ఫోర్లు) ఆరంభంలో ఆచితూచి ఆడినా.. కుదురుకున్నాక స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. స్టార్క్ బౌలింగ్‌లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో బాదుడు మొదలు పెట్టిన రాయ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. పరుగులు కట్టడి చేసేందుకు ఆసీస్ కెప్టెన్ ఫించ్ స్పిన్నర్ లియాన్‌ను రంగంలోకి దింపితే.. రాయ్ 6,4తో అతడికి స్వాగతం పలికాడు. మరి కాసేపటికే స్టార్క్ బౌలింగ్‌లో మరో 2 బౌండ్రీలు బాది 50 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో బెయిర్ స్టో కూడా బ్యాట్‌కు పనిచెప్పడంతో.. ఇంగ్లండ్ చూస్తుండగానే సెంచరీ మార్క్ దాటింది.

ప్రమాదకరంగా మారిన జోడీని విడదీసేందుకు ఫించ్.. స్మిత్‌కు బంతినిస్తే రాయ్ హ్యాట్రిక్ సిక్సర్లతో పండుగ చేసుకున్నాడు. తొలి బంతిని లాంగాన్ మీదుగా తరలించిన రాయ్.. రెండోదాన్ని బౌలర్ తలమీదుగా గీత దాటించాడు. ఇక మూడో బంతైతే.. ఏకంగా గ్రౌండ్ బయట పడటం విశేషం. తొలి వికెట్‌కు 124 జోడించాక బెయిర్ స్టో వెనుదిరిగాడు. కాసేపటికే అంపైర్ తప్పుడు నిర్ణయానికి రాయ్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. బంతి బ్యాట్‌కు తాకకపోయినా అంపైర్ ఔటివ్వడం.. అప్పటికే రివ్యూ కోల్పోవడంతో రాయ్ అసంతృప్తితో మైదానం వీడాడు. అర్ధశతకానికి 50 బంతులు తీసుకున్న రాయ్ ఆ తర్వాత 15 బంతుల్లోనే 35 పరుగులు చేయడం విశేషం. అప్పటికి విజయానికి 77 పరుగులు కావాల్సి ఉండగా.. కెప్టెన్ మోర్గాన్, రూట్ మిగిలిన లాంఛనం పూర్తి చేశారు.

అతనొక్కడే..

ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరు చేయగలిగిందంటే స్మిత్ పోరాటం వల్లే. 14/3తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌కు స్మిత్ అనితర సాధ్యమైన ఆటతో పోరాడే స్కోరు సాధించి పెట్టాడు. మెగాటోర్నీలో జోరు మీదున్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్‌తో సెమీస్‌లో కోహ్లీ ఔటైన విధానాన్ని తలపిస్తూ.. ఆర్చర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే బౌండ్రీతో ఖాతా తెరిచిన డేవిడ్ వార్నర్ (9) కూడా ఫించ్ వెంట నడిచాడు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడిన హ్యాండ్స్‌కోంబ్ (4) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఫలితంగా పవర్ ప్లే ముగిసేసరికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 27 పరుగులే చేసింది. ఈ దశలో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ జోడీ సాధికారికంగా ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. భారీ షాట్లకు పోకుండా ఒకటీ, రెండు పరుగులతో స్కోరు బోర్డును నెమ్మదిగా కదిలించింది.

25వ ఓవర్లోగానీ కంగారూల స్కోరు 100 దాటలేదు. నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యం నమోదైన దశలో స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్‌లో కారీతో పాటు స్టొయినిస్ (0)ను ఔట్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం రెట్టింపు చేశాడు. కొన్ని చక్కటి షాట్లతో అలరించిన మ్యాక్స్‌వెల్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్) పెవిలియన్ చేరేందుకు తొందరపడ్డాడు. మరో ఎండ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేయగలిగే ఆటగాడు లేకపోవడంతో స్మిత్ స్ట్రయికింగ్ ఎక్కువగా తన వద్దే ఉంచుకున్నా భారీ షాట్లు ఆడలేకపోయాడు. 15 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయాడు. ఆఖర్లో స్టార్క్ (29; 1 ఫోర్, 1 సిక్స్) దాటిగా ఆడటంతో 45వ ఓవర్లో ఆసీస్ 200 మార్క్ దాటింది. కాసేపటికి వరుస బంతుల్లో స్మిత్, స్టార్క్ ఔటవడంతో కంగారూల ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. జొఫ్రా ఆర్చర్ (2/32) తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

cary

రక్తం కారుతున్నా ..

ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆర్చర్ వేసిన 8వ ఓవర్ చివరి బంతి అలెక్స్ కారీ హెల్మెట్ నుంచి దూసుకుంటూ అతడి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. సుమారు గంటకు 140 కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి హెల్మెట్ గ్రిల్ దాటి అతడికి తాకడంతో చర్మం చీలి రక్తం కారింది. అప్పటికే 19/3తో కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా.. కారీ సేవలు కోల్పోయేలానే కనిపించింది. కానీ మైదానంలోనే ప్రథమ చికిత్స తీసుకున్న అతడు తిరిగి బ్యాటింగ్ కొనసాగించి గొప్ప స్ఫూర్తి చాటాడు. అతని పోరాటం ఒకప్పుడు (విండీ స్‌పై, 2002లో)విరిగిన దవడతోనే బౌలింగ్ చేసిన కుంబ్లేను గుర్తు చేసింది.

1

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు (27) తీసిన బౌలర్‌గా స్టార్క్ అగ్రస్థానానికి చేరాడు. ఆసీస్ దిగ్గజం మెక్‌గ్రాత్ 2007 టోర్నీలో 26 వికెట్లు పడగొట్టాడు.

4

ప్రపంచకప్ ఫైనల్ చేరడం ఇంగ్లండ్‌కు ఇది నాలుగోసారి. గతంలో మూడుసార్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది.

* ఈ రోజు మా ఆటతీరు బాలేదు. తొలి పవర్ ప్లేలో 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం దెబ్బ కొట్టింది. క్రితంసారి ఇంగ్లండ్‌లో పర్యటించిన దానికంటే ప్రస్తుతం మెరుగైనే ప్రదర్శన చేశాం. ఓవరాల్‌గా ఈ టోర్నీలో చాలా సానుకూల అంశాలను గుర్తించాం.
-ఫించ్, ఆసీస్ కెప్టెన్

* తొలి పది ఓవర్లలో వోక్స్ చాలా ప్రమాదకర బౌలర్, ఆర్చర్ కూడా ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు రాయ్, బెయిర్‌స్టో అదరగొట్టారు. 2015తో పోల్చుకుంటే మేం చాలా మెరుగయ్యాం. ఆటగాళ్లంతా లార్డ్స్‌లోనూ ఇదే ఆటతీరు కనబర్చాలని కోరుకుంటున్నా.
- మోర్గాన్, ఇంగ్లండ్ కెప్టెన్

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా: వార్నర్ (సి) బెయిర్‌స్టో (బి) వోక్స్ 9, ఫించ్ (ఎల్బీ) ఆర్చర్ 0, స్మిత్ (రనౌట్/బట్లర్) 85, హ్యాండ్స్‌కోంబ్ (బి) వోక్స్ 4, కారీ (సి) (సబ్) విన్స్ (బి) రషీద్ 46, స్టొయినిస్ (ఎల్బీ) రషీద్ 0, మ్యాక్స్‌వెల్ (సి) మోర్గాన్ (బి) ఆర్చర్ 22, కమ్మిన్స్ (సి) రూట్ (బి) రషీద్ 6, స్టార్క్ (సి) బట్లర్ (బి) వోక్స్ 29, బెరెన్‌డార్ఫ్ (బి) వుడ్ 1, లియాన్ (నాటౌట్) 5, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 49 ఓవర్లలో 223 ఆలౌట్. వికెట్ల పతనం: 1-4, 2-10, 3-14, 4-117, 5-118, 6-157, 7-166, 8-217, 9-217, 10-223, బౌలింగ్: వోక్స్ 8-0-20-3, ఆర్చర్ 10-0-32-2, స్టోక్స్ 4-0-22-0, వుడ్ 9-0-45-1, ప్లంకెట్ 8-0-44-0, రషీద్ 10-0-54-3.

ఇంగ్లండ్: రాయ్ (సి) కారీ (బి) కమ్మిన్స్ 85, బెయిర్‌స్టో (ఎల్బీ) స్టార్క్ 34, రూట్ (నాటౌట్) 49, మోర్గాన్ (నాటౌట్) 45, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 32.1 ఓవర్లలో 226/2. వికెట్ల పతనం: 1-124, 2-147, బౌలింగ్: బెరెన్‌డార్ఫ్ 8.1-2-38-0, స్టార్క్ 9-0-70-1, కమ్మిన్స్ 7-0-34-1, లియాన్ 5-0-49-0, స్మిత్ 1-0-21-0, స్టొయినిస్ 2-0-13-0.

runs-wickets

875

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles