HomeSports News

ఇంగ్లండ్ జై రూట్

Published: Sat,June 15, 2019 02:34 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన జో
-మెరిసిన ఆర్చర్, వుడ్
-రాణించిన బెయిర్‌స్టో, వోక్స్
-వెస్టిండీస్‌కు రెండో పరాజయం

ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట కత్తిలాంటి బౌలింగ్‌తో కరీబియన్లకు కళ్లెం వేసిన ఆతిథ్య జట్టు.. ఆ తర్వాత ఓ మోస్తరు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిని మింగేసిన వరుణుడు ఈ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం కలిగించకపోవడం సానుకూల అంశమైతే.. విండీస్ వీధుల్లో బౌలింగ్ నేర్చుకున్న బార్బడోస్ ఆటగాడు జొఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బంతులతో తన మాజీ సహచరులపై విరుచుకుపడటం విశేషం.

సౌతాంప్టన్: హాట్ ఫేవరెట్ హోదాతో ప్రపంచకప్ బరిలో దిగిన ఆతిథ్య ఇంగ్లండ్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో సమిష్టిగా సత్తాచాటి మెగాటోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసి పాయిం ట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇంగ్లిష్ పేసర్లు మార్క్ వుడ్ (3/18), జొఫ్రా ఆర్చర్ (3/30) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 44.4 ఓవర్లో 212 పరుగులకు ఆలౌటైంది. నికోలస్ పూరన్ (63; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయగా.. హెట్‌మైర్ (39), గేల్ (36; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బార్బడోస్ ఆటగాడు ఆర్చర్ కరీబియన్లను ఆటాడుకున్నాడు. బుల్లెట్‌లాంటి బంతులతో తన మాజీ సహచరులను బెంబేలెత్తించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 33.1 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. జో రూట్ (94 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు) అజేయ సెంచరీతో ఆదరగొట్టగా.. బెయిర్‌స్టో (45; 7 ఫోర్లు), వోక్స్ (40; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. టోర్నీలో రెండో సెంచరీ చేసిన రూట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
root

అలవోకగా..

సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు మరింత సాధారణంగా మార్చేశారు. గాయం కారణంగా జాసన్ రాయ్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో అతడి స్థానంలో బెయిర్‌స్టోతో కలిసి జో రూట్ ఓపెనర్‌గా వచ్చాడు. వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 62 రన్స్ చేసింది. తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించాక బెయిర్‌స్టో ఔటయ్యాడు. అశ్చర్యకరంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వోక్స్.. రూట్‌కు చక్కటి సహకారం అందించాడు. విండీస్ బౌలర్లు ఏ దశలోనూ ఈ జోడీని ఇబ్బందిపెట్టలేకపోయారు. ఈ క్రమంలో రూట్ 93 బంతుల్లో టోర్నీలో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 14 పరుగుల దూరంలో వోక్స్ వెనుదిరిగినా.. స్టోక్స్ (10 నాటౌట్)తో కలిసి రూట్ లాంఛనాన్ని ముగించాడు. విండీస్ బౌలర్లలో గాబ్రియల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం విశేషం.

ఆర్చర్, వుడ్.. వెరీ గుడ్

హిట్టింగ్‌కు అలవాటుపడిన కరీబియన్‌లు భారీ ఇన్నింగ్స్‌లపై కాకుండా భారీ షాట్లపై దృష్టిపెట్టడంతో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హోల్డర్ సేనకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వోక్స్ వేసిన సూపర్ యార్కర్‌కు లెవీస్ (2) పెవిలియన్ బాటపట్టాడు. దీంతో విండీస్ 3 ఓవర్లలో 4 పరుగులే చేసి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో నెమ్మదిగా ఆడుతున్న హోప్ (11)తో కలిసి గేల్ స్కోరు పెంచే బాధ్యత భుజానవేసుకున్నాడు. ఫలితంగా విండీస్12 ఓవర్లలో 47/1తో మెరుగైన స్థితికి చేరింది. అయితే మూడు బంతుల వ్యవధిలో గేల్, హోప్ వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్లు కరీబియన్లను కష్టాల్లోకి నెట్టారు. ఈ దశలో పూరన్, హెట్‌మైర్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. దీంతో విండీస్ 23 ఓవర్లలో సెంచరీ మార్క్ దాటింది. నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించాక హెట్‌మైర్ ఔటయ్యాడు. విండీస్ ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. కెప్టెన్ హోల్డర్ (9) నిరాశ పర్చగా.. కొన్ని భారీ షాట్లతో జోరు కనబర్చిన డేంజర్ మ్యాన్ రస్సెల్ (16 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) మరో బిగ్‌హిట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. అంతకుముందే క్యాచ్ మిస్ కావడంతో లైఫ్ దక్కినా రస్సెల్ దాన్ని వినియోగించుకోలేక పోయాడు. ఈ దశలో ఆర్చర్ వరుస బంతుల్లో పూరన్, కాట్రెల్ (0)ను పెవిలియన్ పంపాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా చక్కటి షాట్లతో అలరించిన పూరన్.. వన్డేల్లో తొలి అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక ఆర్చర్ వేసిన షార్ట్ పిచ్ బంతికి పెవిలియన్ బాటపట్టగా.. బ్రాత్‌వైట్ (14) అతడిని అనుసరించాడు. గాబ్రియల్ (0) వికెట్ తీసిన వుడ్ విండీస్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 2 వికెట్లు పడగొట్టగా.. వోక్స్, ప్లంకెట్‌కు చెరో వికెట్ దక్కింది.

గాయాలే గాయాలు..

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించినా.. ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు గాయాల పాలవడం మాత్రం ఆ జట్టును కలవరపాటుకు గురిచేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు ఓపెనర్ జాసన్‌రాయ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో బ్యాటింగ్‌కు రాకుండా డ్రెస్సింగ్‌రూమ్‌కే పరిమితమయ్యారు. రాయ్ స్థానంలో ఓపెనింగ్‌కు వచ్చిన రూట్ సెంచరీతో ఆకట్టుకోవడంతో అతడి లోటు పెద్దగా కనిపించలేదు. మోర్గాన్ మైదానం వీడటంతో చివరి ఓవర్లలో బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మరోవైపు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రస్సెల్ కూడా పూర్తి ఫిట్‌గా లేకుండానే మ్యాచ్ ఆడినట్లు కనిపించింది.

ఇది కూడా మరో మ్యాచ్‌లాంటిదే. కానీ, నా స్నేహితులకు ప్రత్యర్థిగా ఆడటం చాలా కొత్తగా ఉంది. మిగతా బౌలర్లు సహకారం అందించడం వల్లే విండీస్‌ను కట్టడి చేయగలిగాం. లేకుంటే ఇంకా భారీ స్కోరు నమోదయ్యేదే.
- ఆర్చర్, ఇంగ్లండ్ బౌలర్

గేల్ మరో ఘనత

వెస్టిండీస్ విధ్వంసక వీరుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా గేల్ అగ్రస్థానానికి చేరాడు. ఇంగ్లండ్‌పై 36 వన్డేలు ఆడిన గేల్ 1632 పరుగులు చేశాడు. కుమార సంగక్కర (శ్రీలంక; 44 మ్యాచ్‌ల్లో 1625) రెండో స్థానంలో ఉన్నాడు.

స్కోరు బోర్డువెస్టిండీస్: గేల్ (సి) బెయిర్‌స్టో (బి) ప్లంకెట్ 36, లెవీస్ 9బి) వోక్స్ 2, హోప్ (ఎల్బీ) వుడ్ 11, పూరన్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 63, హెట్‌మైర్ (సి అండ్ బి) రూట్ 39, హోల్డర్ (సి అండ్ బి) రూట్ 9, రస్సెల్ (సి) వోక్స్ (బి) వుడ్ 21, బ్రాత్‌వైట్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 14, కాట్రెల్ (ఎల్బీ) ఆర్చర్ 0, థామస్ (నాటౌట్) 0, గాబ్రియల్ (బి) వుడ్ 0, ఎక్స్‌ట్రాలు: 17, మొత్తం: 44.4 ఓవర్లలో 212 ఆలౌట్. వికెట్ల పతనం: 1-4, 2-54, 3-55, 4-144, 5-1156, 6-188, 7-202, 8-202, 9-211, 10-212, బౌలింగ్: వోక్స్ 5-2-16-1, ఆర్చర్ 9-1-30-3, ప్లంకెట్ 5-0-30-1, వుడ్ 6.4-0-18-3, స్టోక్స్ 4-0-25-0, రషీద్ 10-0-61-0, రూట్ 5-0-27-2.

ఇంగ్లండ్: బెయిర్‌స్టో (సి) బ్రాత్‌వైట్ (బి) గాబ్రియల్ 45, రూట్ (నాటౌట్) 100, వోక్స్ (సి) (సబ్) అలెన్ (బి) గాబ్రియల్ 40, స్టోక్స్ (నాటౌట్) 10, ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 33.1 ఓవర్లలో 213/2. వికెట్ల పతనం: 1-95, 2-199, బౌలింగ్: కాట్రెల్ 3-0-17-0, థామస్ 6-0-43-0, గాబ్రియల్ 7-0-49-2, రస్సెల్ 2-0-14-0, హోల్డర్ 5.1-0-31-0, బ్రాత్‌వైట్ 5-0-35-0, గేల్ 5-0-22-0.

669

Recent News