ఇంగ్లండ్, విండీస్ అమీతుమీ


Fri,June 14, 2019 02:51 AM

-నేడు ఇరు జట్ల మధ్య పోరు
-ప్రపంచకప్‌లో..
-ఆడిన మ్యాచ్‌లు 6
-ఇంగ్లండ్ గెలిచినవి 5
-వెస్టిండీస్ గెలిచినవి 1

morgan-holder
సౌతాంప్టన్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వన్డే సిరీస్‌లో హోరాహోరీగా తలపడి.. పరుగుల వరద పారించిన ఇంగ్లండ్-వెస్టిండీస్ జట్లు ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం తలపడనున్నాయి. భీకరమైన విండీస్ పేస్ కు.. బలమైన ఇంగ్లిష్ బ్యాటింగ్‌కు మధ్య రోస్‌బౌల్ స్టేడియం వేదికగా పోరు జరుగనుంది. రసవత్తరంగా సాగే ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.

గాడిలో పడిన ఇంగ్లండ్..

పాక్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారిగా బంగ్లాదేశ్‌పై జూలు విదిల్చింది. మొదట బ్యాటింగ్ చేసి 386 పరుగుల భారీ స్కోరు చేయడంతో పాటు బంగ్లాను 280కే ఆలౌట్ చేసింది. రాయ్ ఏకంగా 153 పరుగులు చేశాడు. బంగ్లాపై ప్రదర్శనను విండీస్‌పై పునరావృతం చేయాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. 3 మ్యాచ్‌ల్లోనూ 300కు పైగా స్కోర్లు నమోదు చేసిన ఇంగ్లండ్ పేసర్లతో పటిష్టంగా ఉన్న విండీస్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

విండీస్‌కు బౌలింగ్‌కు పరీక్షే..

ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న వెస్టిండీస్ పేసర్లకు ఇంగ్లండ్‌తో మ్యాచ్ పరీక్షే. మొదటి నుంచి దూకుడుగా ఆడే ఓపెనర్లు.. సంయమనంతో మ్యాచ్‌ను నడిపించే మిడిల్‌ఆర్డర్.. విధ్వంసం సృష్టించగలిగే లోయర్‌ఆర్డర్ ఉన్న ఇంగ్లిష్ జట్టును కట్టడి చేయడం సవాలే. టోర్నీలో రెండు మ్యాచ్‌ల్లోనూ విండీస్ పేసర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు. బ్యాటింగ్‌లో బిగ్ హిట్టర్లు గేల్, హోప్, పూరన్, హిట్మైర్‌లు కీలకం కానున్నారు. గాయంతో బాధ పడుతున్న రసెల్ కూడా జట్టులో ఉంటే రెండు విభాగాలకు మరింత బలం చేకూరుతుంది.

వరుణుడి ఆటంకం తప్పదా

ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికే టోర్నీ లో నాలుగు మ్యాచ్‌లు రద్దుకాగా... ఈ పోరు జరిగే సౌతాంప్టన్‌లోనూ గురువారం భారీ వర్షం పడింది. దీంతో విండీస్ ప్లేయర్లు ఇండోర్‌లోనే ప్రాక్టీస్ చేశారు.

408

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles