ఫించ్ శతక్కొట్టుడు


Sun,June 16, 2019 03:11 AM

- లంకపై ఆసీస్ ఘన విజయం
finch
లండన్: మెగాటోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకెళుతున్నది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సొంతం చేసుకున్న కంగారూలు సెమీఫైనల్ బెర్తుకు చేరువయ్యారు. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 335 పరుగుల లక్ష్యఛేదనలో స్టార్క్(4/55), రిచర్డ్‌సన్(3/47), కమ్మిన్స్(2/38) పేస్ ధాటికి లంక 45.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు దిముత్ కరుణరత్నె(97), కుశాల్ పెరెర(52) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. కంగారూల బౌలింగ్‌ను సాధికారికంగా ఎదుర్కొంటూ లంకకు మెరుగైన శుభారంభాన్ని అందించారు. మైదానం నలువైపులా బౌండరీలతో చెలరేగుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. మంచి ఫామ్‌మీదున్న కరుణరత్నె చూడచక్కని షాట్లతో అలరించాడు. వీరిద్దరి ఆట చూస్తే లక్ష్యాన్ని అలవోకగా అధిగమిస్తుందా అనిపించింది.

కానీ పోరాటానికి పెట్టింది పేరైన ఆసీస్ పుంజుకుని పోటీలోకి వచ్చింది. ఆసీస్ పేసర్ల విజృంభణతో ఓపెనర్లు మినహా ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో లంక ఓటమి వైపు నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్..కెప్టెన్ ఫించ్(132 బంతుల్లో 153, 15ఫోర్లు, 5సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు స్మిత్(59 బంతుల్లో 73, 7ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 334/7 స్కోరు చేసింది. ఉడాన(2/57), డిసిల్వా(2/40) రెండేసి వికెట్లు తీశారు. వార్నర్, ఫించ్ ఇద్దరు దూకుడైన ఆటతీరుతో లంక బౌలర్లను ఆటాడుకున్నారు. ఫించ్ తనదైన శైలిలో చెలరేగుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో 14వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ ఫించ్‌కు స్మిత్ జత కలువడంతో ఓ దశలో భారీ స్కోరు అందుకుంటుదనుకున్న ఆసీస్.. ఆఖర్లో వికెట్లు కోల్పోయింది. సెంచరీతో రాణించిన ఫించ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 334/7(ఫించ్ 153, స్మిత్ 73, ఉడాన 2/57, డిసిల్వా 2/40), శ్రీలంక: 45.5 ఓవర్లలో 247 ఆలౌట్(కరుణరత్నె 97, కుశాల్ పెరెర 52, స్టార్క్ 4/55, రిచర్డ్‌సన్ 3/47)

378

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles