తాహిర్ తిప్పేశాడు


Mon,April 15, 2019 02:47 AM

-4 వికెట్లు తీసిన స్పిన్నర్
-కోల్‌కతాపై చెన్నై విజయం
-లిన్ పోరాటం వృథా

tahir
కోల్‌కతా: ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉన్నది. వేదికలు మారినా.. ప్రత్యర్థులు మారినా ఫలితాలు మాత్రం ధోనీసేనకే అనుకూలంగా వస్తున్నాయి. తాహిర్ స్పిన్ (4/27)కు తోడు.. లక్ష్య ఛేదనలో సురేశ్ రైనా (42 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. నైట్‌రైడర్స్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు వాట్సన్ (6), డుఫ్లెసిస్ (16 బంతుల్లో 24; 5 ఫోర్లు) విఫలమైనా.. రైనా యాంకర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఓ ఎండ్‌లో స్థిరంగా ఆడుతూ కోల్‌కతా స్పిన్ త్రయాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆరంభం నుంచి కీలక భాగస్వామ్యాలతో జట్టును గెలిపించాడు. రాయుడు (5) మరోసారి నిరాశపర్చాడు. మిడిలార్డర్‌లో జాదవ్ (20), ధోనీ (16) ఓ మాదిరిగా ఆడారు. ధోనీతో కలిసి ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేసిన రైనా.. చివర్లో జడేజా (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) సహకారంతో జట్టును గెలిపించాడు. 16 ఓవర్లలో 121 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ ఇద్దరు అవసరమైనప్పుడల్లా ఫోర్లు కొడుతూ రన్‌రేట్‌ను కాపాడారు.

ఈ క్రమంలో ఆరో వికెట్‌కు 41 పరుగులు జతకావడంతో చెన్నై ఏడో విజయాన్ని నమోదు చేసింది.

లిన్ మెరుపులు..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. క్రిస్‌లిన్ (51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) ఒక్కడే ఆడాడు. ఓపెనర్‌గా వచ్చి దాదాపు 15 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి భారీ సిక్సర్లతో పరుగుల వరద పారించాడు. తొలి ఓవర్‌లో రెండు ఫోర్లతో బాదుడు మొదలుపెట్టిన లిన్.. మూడో ఓవర్‌లో 4, 6, 4తో రెచ్చిపోయాడు. ఓవర్‌కు ఒకటి, రెండు చొప్పున బాదడంతో రన్‌రేట్ సునామీలా పరుగెత్తింది. ఐదో ఓవర్‌లో నరైన్ (2) ఔట్‌కావడంతో తొలి వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పవర్‌ప్లేలో కోల్‌కతా 49/1 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌లో తొలి సిక్సర్‌తో దూకుడు పెంచిన లిన్.. 36 బంతుల్లో ఫీఫ్టీ మార్క్‌ను చేరినా స్పిన్నర్ల రాకతో పరుగుల వేగం తగ్గింది. రానా (21) ఫర్వాలేదనిపించడంతో పదో ఓవర్‌కు కోల్‌కతా 77 పరుగులకు చేరింది. కానీ 11వ ఓవర్‌లో తాహిర్.. కేకేఆర్‌కు డబుల్ ఝలక్ ఇచ్చాడు. మూడు బంతుల తేడాలో రానా, ఉతప్ప (0)ను ఔట్ చేశాడు. ఓ ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడినా.. రెండో ఎండ్‌లో మాత్రం లిన్ ఎక్కడా తగ్గలేదు. జడేజా వేసిన 14వ ఓవర్‌లో వరుసగా 6, 6, 6, 4తో 23 పరుగులు రాబట్టాడు. అయితే 15వ ఓవర్‌లో తాహిర్ మళ్లీ ఝలక్ ఇచ్చాడు. ఐదు బంతుల తేడాలో సెంచరీ దిశగా సాగుతున్న లిన్, డేంజర్ మ్యాన్ రస్సెల్ (10)ను ఔట్ చేసి కట్టడి చేశాడు. అప్పటికే రస్సెల్ ఓ సిక్స్, ఫోర్ బాదేశాడు. లిన్.. రానాతో రెండో వికెట్‌కు 41... కార్తీక్ (18)తో నాలుగో వికెట్‌కు 42 పరుగులు జత చేశాడు. చివర్లో కార్తీక్ అండతో గిల్ (15), చావ్లా (4 నాటౌట్) వేగంగా ఆడటంతో కోల్‌కతా పోటీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

స్కోరు బోర్డు

కోల్‌కతా నైట్‌రైడర్స్: లిన్ (సి) ఠాకూర్ (బి) తాహిర్ 82, నరైన్ (సి) డుఫ్లెసిస్ (బి) సాంట్నెర్ 2, రానా (సి) డుఫ్లెసిస్ (బి) తాహిర్ 21, ఉతప్ప (సి) డుఫ్లెసిస్ (బి) తాహిర్ 0, కార్తీక్ (సి) డుఫ్లెసిస్ (బి) ఠాకూర్ 18, రస్సెల్ (సి) (సబ్) షోరే (బి) తాహిర్ 10, గిల్ (సి) జడేజా (బి) ఠాకూర్ 15, చావ్లా నాటౌట్ 4, కుల్దీప్ రనౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 161/8. వికెట్లపతనం: 1-38, 2-79, 3-80, 4-122, 5-132, 6-150, 7-161, 8-161. బౌలింగ్: చాహర్ 4-0-36-0, ఠాకూర్ 4-0-18-2, సాంట్నెర్ 4-0-30-1, జడేజా 4-0-49-0, తాహిర్ 4-0-27-4.

చెన్నై సూపర్‌కింగ్స్: వాట్సన్ ఎల్బీ (బి) గుర్నే 6, డుఫ్లెసిస్ (బి) నరైన్ 24, రైనా నాటౌట్ 58, రాయుడు (సి) ఉతప్ప (బి) చావ్లా 5, జాదవ్ ఎల్బీ (బి) చావ్లా 20, ధోనీ ఎల్బీ (బి) నరైన్ 16, జడేజా నాటౌట్ 31, ఎక్స్‌ట్రాలు: 2, మొత్తం: 19.4 ఓవర్లలో 162/5. వికెట్లపతనం: 1-29, 2-44, 3-61, 4-81, 5-121. బౌలింగ్: ప్రసిద్ధ్ కృష్ణ 4-0-30-0, గుర్నే 4-0-37-1, రస్సెల్ 1-0-16-0, నరైన్ 4-1-19-2, కుల్దీప్ 3-0-28-0, చావ్లా 3.4-0-32-2.

270
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles