దీపక్ ధమాకా


Sun,September 22, 2019 12:45 AM

-ఫైనల్ చేరిన కుస్తీవీరుడు
-టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు
-నాన్ ఒలింపిక్ కోటా సెమీస్‌లో రాహుల్ ఓటమి
-ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్

పసిడి నెగ్గిన అనుభవమున్న సుశీల్ కుమార్ ఫస్ట్ రౌండ్‌లోనే వెనుదిరిగినా.. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన ప్రపంచ నంబర్‌వన్ బజరంగ్ పునియా రెఫరీ తప్పిదాలకు మూల్యం చెల్లించుకున్నా.. యువ రెజ్లర్ దీపక్ పునియా విజృంభించడంతో ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఓ మల్లయోధుడు పసిడి పోరుకు అర్హత సాధించాడు. జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి సంచలనాలు రేపిన 20 ఏండ్ల దీపక్ మెగాటోర్నీలో అడుగుపెట్టిన తొలిసారే అదరగొట్టాడు. టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ టికెట్ ఖరారు చేసుకొని ఔరా అనిపించాడు.
Deepak
నూర్ సుల్తాన్ (కజకిస్థాన్): జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన భారత యువ రెజ్లర్ దీపక్ పునియా.. నెల రోజులు తిరిగేసరికి సీనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ ప్రకంపనలు రేపాడు. వరుస విజయాలతో దుమ్మురేపిన దీపక్ పసిడి పతక పోరుకు అర్హత సాధించడంతో పాటు టోక్యో (2020) ఒలింపిక్స్ బెర్త్ పట్టేశాడు. 86 కేజీల సెమీఫైనల్లో పూర్తి ఆధిపత్యం కనబర్చిన దీపక్ 8-2తో స్టీఫెన్ రిచ్‌ముత్ (స్విట్జర్లాండ్)పై నెగ్గి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రియో ఒలింపిక్స్ (2016), ఆసియా చాంపియన్ (2018) హసన్ యజ్దాని (ఇరాన్)తో దీపక్ తలపడనున్నాడు. ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం సుశీల్ కుమార్ (2010) మాత్రమే ఈ వేదికపై స్వర్ణం నెగ్గాడు. గోల్డ్ సాధించడం పక్కా అనుకున్న బజరంగ్ పునియా రిఫరీ వివాదాస్పద నిర్ణయాలతో కాంస్యానికే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు మెగాటోర్నీలో అత్యధికంగా మూడు (2013లో) పతకాలు సాధించిన మన రెజ్లర్లు.. ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పర్చారు. పురుషుల విభాగంలో ఇప్పటికే బజరంగ్, రవి దహియా కాంస్యాలు చేజిక్కించుకోగా.. మహిళల విభాగంలో వినేశ్ కంచు కైవసం చేసుకుంది. తాజా గా దీపక్‌కు కనీసం రజతం ఖాయ మవడంతో పతకాల సంఖ్య నాలుగుకు చేరనుంది. నాన్ ఒలింపిక్ కోటా 61 కేజీల విభాగంలో భారత మరో రెజ్లర్ రాహుల్ అవారె సెమీస్‌లో ఓడి కాంస్య పోరుకు చేరాడు.

కంచు పోరుకు రాహుల్

నాన్ ఒలింపిక్ కేటగిరీలో సత్తా చాటిన రాహుల్ అవారె సెమీఫైనల్లో 6-10తో బెకా లోమ్జే (జార్జియా) చేతి లో ఓడిపోయాడు. సెమీ స్ చేరే క్రమంలో కజకిస్థాన్ బాక్సర్‌ను ఓడించిన రాహు ల్.. ఆదివారం కాంస్యం కోసం పోటీ పడనున్నాడు. మరో భారత రెజ్లర్ జితేందర్ (79 కేజీలు) క్వార్టర్‌ఫైనల్లో తైమురాజ్ చేతిలో ఓడగా.. మౌసమ్ ఖత్రి (97 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

దుమ్మురేపినచిన్నోడు

తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన 20 ఏండ్ల దీపక్.. అఖాడాల్లో తలపండిన మల్లయోధుడి రేంజ్‌లో విజృంభించాడు. నెల రోజుల క్రితం ఎస్తోనియా వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన పునియా.. అంచనాలకు మించి రాణిస్తూ సీనియర్ విభాగంలోనూ పసిడి చేజిక్కించుకునేందుకు అడుగుదూరంలో నిలిచాడు. బజరంగ్ ఉదంతం అనంతరం స్థానిక రెజ్లర్లపై గెలువాలంటే ప్రత్యర్థిని పట్టేయడంతో పాటు రిఫరీలను మెప్పించాలని అనుభవమైన తరుణంలో.. అదిరిపోయే ఆటతో తుదిపోరుకు అర్హత సాధించాడు. తొలిరౌండ్‌లో 8-7తో లోకల్ రెజ్లర్ అదిలెత్‌పై నెగ్గిన దీపక్.. రెండో రౌండ్‌లో 6-0తో బఖాదుర్ (తజకిస్థాన్)ను చిత్తుచేసి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. చక్కటి డిఫెన్స్‌తో పాటు అవసరమైనప్పుడు మాత్రమే అటాకింగ్ చేస్తూ.. స్టామినాను అట్టిపెట్టుకున్న దీపక్ బుద్ధిబలం ప్రదర్శించాడు. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో దీపక్ 7-6తో కార్లోస్ మెండెజ్ (కొలంబియా)పై గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టడంతోనే టోక్యో టికెట్ ఖరారు చేసుకున్నాడు. బౌట్ మరో నిమిషంలో ముగుస్తుందనగా 3-6తో వెనుకంజలో ఉన్న దీపక్.. చక్కటి మూవ్‌తో నాలుగు పాయింట్లు సాధించి విజేతగా నిలువడం విశేషం. ఇక సెమీస్‌లో ఎదురులేని ఆటతీరు కనబర్చిన పునియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకున్నాడు. బౌట్ ఆరంభంలోనే ప్రత్యర్థిని రింగ్ నుంచి బయటకు పంపిన దీపక్ 1-0తో ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో చక్కటి హోల్డ్‌తో మూడు పాయింట్లు సాధించి 4-0తో ఆధిక్యాన్ని పెంచుకున్నాడు. అనంతరం ప్రత్యర్థి రెండు పాయింట్లు సాధించినా.. పునియా మరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకొని 8-2తో ఫైనల్ చేరాడు.

-ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన మూడో రెజ్లర్‌గా దీపక్ పునియా రికార్డులకెక్కాడు.

బరిలోదిగక ముందే పతకంతో పాటు ఒలింపిక్ కోటా సాధిస్తానని అనుకున్నా. సీనియర్లు సుశీల్, బజరంగ్‌ను ఆదర్శంగా తీసుకునే ఈ స్థాయికి వచ్చా. కజకిస్థాన్ రెజ్లర్‌తో తలపడే సమయంలో ఆందోళనకు గురయ్యా. గతంలోనూ అతడి చేతిలో
పరాజయం పాలయ్యా. అదీకాక బజరంగ్ బౌట్‌లో జరిగింది గుర్తొచ్చి కంగారు పడ్డాను.
- దీపక్ పునియా

312

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles