లక్ష్మికి అరుదైన గౌరవం


Wed,May 15, 2019 08:37 AM

laxmi
- ఐసీసీ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు

దుబాయ్: ఐసీసీ కొత్త పుంతలు తొక్కుతున్నది. లింగ వివక్షకు తావులేకుండా ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ అతివలకు పెద్దపీట వేస్తున్నది. పురుషుల క్రికెట్ మ్యాచ్‌కు బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అంపైర్‌గా క్లారీ పొలోసక్(ఆస్ట్రేలియా) ఇప్పటికే రికార్డు నెలకొల్పగా తాజాగా భారత్‌కు చెందిన జీఎస్ లక్ష్మి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రిఫరీల ప్యానెల్లో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో లక్ష్మి రిఫరీగా వ్యవహరించే అవకాశం వెంటనే అమల్లోకి రానున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 ఏండ్ల లక్ష్మి తన సొంత రాష్ట్రం ఆంధ్రతో పాటు బీహార్, ఈస్ట్‌జోన్, రైల్వేస్, సౌత్ జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహించింది. కుడిచేతి బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ మీడియం బౌలింగ్‌తో చిరస్మరణీయ విజయాల్లో కీలకమైంది.

క్రికెటర్‌గానే కాకుండా 2008-09 మహిళల దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలిసారి మ్యాచ్ రిఫరీగా లక్ష్మి బాధ్యతలు నిర్వర్తించింది. దీనికి తోడు మూడు అంతర్జాతీయ వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు రిఫరీగా విధులు చేపట్టింది. ఐసీసీ అంతర్జాతీయ ప్యానెల్ చేత రిఫరీగా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మరింత ఎత్తుకు ఎదిగేందుకు ఇది దోహదపడుతుంది. భారత్‌లో క్రికెటర్‌గా, మ్యాచ్ రిఫరీగా నాకు సుదీర్ఘ అనుభవముంది. అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఇది నాకు బాగా ఉపయోగపడుతుంది అని లక్ష్మి ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఐసీసీ అంపైర్ల అభివృద్ధి ప్యానెల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలియోస్ షెరిదాన్‌కు చోటు దక్కింది. దీంతో ప్యానెల్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు పెరిగింది. జెండర్‌తో సంబంధం లేకుండా ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని ఐసీసీ సీనియర్ మేనేజర్ అడ్రియన్ గ్రిఫిత్ అంది.

491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles