దస్ కా దమ్


Wed,May 15, 2019 08:51 AM

వన్డే విశ్వసమరంలో పాల్గొనే జట్ల సంఖ్య 10. దశకంఠుడు రావణుడిలా అన్ని జట్లు వేటికవే సాటి.ఒకటి బ్యాటింగ్‌లో ఉత్తమమైతే.. మరోటి ఒత్తిడిని చిత్తుచేయడంలో ఘనాపాటి.ఒకటి బౌలింగ్‌తో అల్లాడిస్తే.. ఇంకొకటి ఫీల్డింగ్‌తో మెరిపించగలదు.అపార అనుభవం ఉన్న జట్లతో పాటు.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న టీమ్‌లకూ చక్కటి చాన్స్.సోది సమరాలకు.. బోరింగ్ మ్యాచ్‌లకు సెలవు చెబుతూ.. 46 రోజుల పాటు సాగే ప్రపంచకప్ కోసం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రభాగాన ఉన్న 10 జట్లను మాత్రమే మెగాటోర్నీకి ఎంపిక చేసింది. దీంతో ప్రతీ మ్యాచ్ రసవత్తరమే.. 27 ఏండ్ల తర్వాత మళ్లీ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోర్నీలో ఒక్కో జట్టు మిగిలిన అన్ని జట్లతో తలపడాల్సిందే. అంటే గ్రూప్‌లు, జోన్‌లు కాకుండా ఓపెన్ అన్నమాట.. అందరూ అందరిని ఢీకొట్టాల్సిందే. మరి ఆ జట్లేవో తెలుసుకోవాలికదా.. వాటి బలాబలాలేంటి అవి ఎందులో గొప్ప.. ఎందులో దిబ్బ ఇలాంటివి రేపటి నుంచి చదవబోయేముందు ఈ రోజు వాటి పరిచయాలు చూద్దాం పదండి..
cup

ఆస్ట్రేలియా

క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అయినా.. ఎక్కువ ఆధిపత్యం చెలాయించిన దేశం మాత్రం ఆస్ట్రేలియానే. గత పాతికేండ్లలో కంగారూలే ఐదుసార్లు ట్రోఫీని చేజిక్కించుకున్నారంటే ఈ టోర్నీలో వారి ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగనున్న ఆసీస్‌ను ఎప్పుడు తక్కువ అంచనావేయడానికి లేదు. ఏ క్షణానైనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని విజయం వైపు దూసుకెళ్లడంలో కంగారూలను మించినవారు లేరంటే అతిశయోక్తి కాదేమో.
Australia

పాకిస్థాన్


Pakistan
అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్‌ను నమ్మడానికి లేదు. తనదైన రోజున ఎంతటి గొప్ప జట్టునైనా తుత్తునియలు చేయగలిగే బలం, బలగం పాక్ సొంతం. అదే లెక్కన అనామక జట్టు చేతిలో అనూహ్యంగా ఓడటం కూడా దాయాదికే సాధ్యం. 1992లో చివరి సారి రౌండ్‌రాబిన్ పద్ధతిలో జరిగిన వరల్డ్ కప్పును పాక్‌కు అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం దేశ ప్రధానిగా జట్టుకు విలువైన సలహాలు ఇచ్చి ఇంగ్లండ్ ైఫ్లెట్ ఎక్కిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

శ్రీలంక


Sri-Lanka
ప్రస్తుతం బరిలో ఉన్న 10 జట్లలో కాస్త వెనుకంజలో ఉన్న జట్టు శ్రీలంకనే అనాలేమో. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లను వెతికిపట్టడంలో లంక బోర్డు విఫలమైందనే చెప్పుకోవాలి. నాలుగేండ్లుగా వన్డే ఆడని ఆటగాడికి వరల్డ్‌కప్ పగ్గాలు అప్పజెప్పారంటేనే ఆ దేశ క్రికెట్ పరిస్థితేంటో తెలుస్తున్నది. అంతర్గత కుమ్ములాటలు, ఫిక్సింగ్ ఆరోపణలు, ప్లేయర్ల తీరుతెన్నులు ఇలా సవాలక్ష సవాళ్లతో ఇబ్బంది పడుతున్న లంక.. ఇటీవల టెస్టుల్లో దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను ఒడించడం కాస్త ఉపశమనం ఇచ్చే అంశం.

బంగ్లాదేశ్

ఒకప్పుడు ఒకటీ, అరా సంచలనాలకే పరిమితమైన బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలకడగా రాణిస్తూ వస్తున్నది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విండీస్, శ్రీలంకను వెనక్కినెట్టి 7వ స్థానంలో ఉన్న బంగ్లా పులులు ఎప్పుడూ ప్రమాదకరమే. మంచి బ్యాటింగ్ లైనప్‌కు, వైవిధ్యంతో కూడిన బౌలింగ్ విభాగం ఉండటం బంగ్లా బలం. కావాల్సినన్ని స్పిన్ ప్రత్యామ్నాయాలు ఉన్న బంగ్లాకు ఒత్తిడిని అధిగమించడమే పెద్ద సమస్య. 2007 ప్రపంచకప్‌లో బంగ్లా చేతిలో పరాజయంతోనే భారత్ లీగ్‌దశలోనే వెనుదిరిగిందనే విషయం గుర్తుండే ఉంటుంది.

వెస్టిండీస్

వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభించిన తొలినాళ్లలో ఏకచత్రాధిపత్యంతో ఏలిన విండీస్ ప్రస్తుతం కల తప్పిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు విండీస్ బరిలో దిగుతుందంటేనే భయపడే రోజుల నుంచి.. మామూలు జట్టే మట్టికరిపించొచ్చు అనే భావనకు చేరింది. అయితే సీనియర్ ప్లేయర్లు క్రిస్ గేల్, విధ్వంసక వీరుడు రస్సెల్‌కు జట్టులో చోటివ్వడంతో ప్రస్తుతం జట్టు బలంగానే కనిపిస్తున్నది. ఎవరికివారే యయునాతీరే అనే చందంలో ఉండే కరీబియన్ వీరులు ఏకతాటిపైకి వచ్చి పోరాడితే తిరుగుండదు. కానీ, అలా ఏకం చేసే నాయకుడు కనిపించడం లేదు. గేల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన బోర్డు ఆ దిశగా ఆలోచిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవేమో.

న్యూజిలాండ్

పొరాటపటిమకు, సమిష్టితత్వానికి పెట్టింది పేరైనా న్యూజిలాండ్‌ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. క్రితం సారి ఫైనల్ వరకు వచ్చి చివరి మెట్టుపై బోల్తా కొట్టిన న్యూజిలాండ్ ఈ సారి ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సన్నాహాలు మొదలెట్టింది. బలమైన బ్యాటింగ్‌కు సూపర్ ఫాస్ట్ బౌలింగ్ అండగా ఉండటం కివీస్‌కు కలిసొచ్చే అంశం. ఫీల్డింగ్‌లో బ్లాక్‌క్యాప్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఆఫ్ఘనిస్థాన్


Afghanistan
చివరగా నయా సంచలనం ఆఫ్ఘనిస్థాన్ విషయానికి వస్తే.. క్రికెట్ ఆడటమే సాధ్యం కాని పరిస్థితుల నుంచి తమకూ ఓ జట్టుందని నిరూపించుకుంటూ వరల్డ్‌కప్ వరకు చేరిందంటేనే ఆ జట్టు విజయం సాధించినట్లు లెక్క. నిత్యం బాంబుల మోతలు, తుపాకీ చప్పుళ్లతో దద్దరిల్లే అల్లకల్లోల దేశం నుంచి ఓ జట్టు విశ్వసమరానికి అర్హత సాధించడం ఏ ప్రపంచకప్ నెగ్గడం కన్నా తక్కువ కాదు. తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న బ్యాట్స్‌మెన్‌కుతోడు మిస్టరీ స్పిన్నర్లు చెలరేగితే ఆఫ్ఘనిస్థాన్ అనూహ్య ఫలితాలు రాబట్టడం పెద్ద కష్టంకాదు. పెద్ద జట్లు కూడా ఆఫ్ఘన్‌తో అప్రమత్తంగా ఉండక తప్పదు.

భారత్


India
క్రికెట్‌ను ఓ మతంలా భావించే దేశంలో విశ్వసమరానికి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈసారి కప్ గెలుచుకుంటుందనే అంచనాలు ఉన్న జట్లలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ముందు వరుసలో ఉందనేది జగమెరిగిన సత్యం. బలమైన బ్యాటింగ్ లైనప్.. బౌలింగ్‌లో వైవిధ్యంతో పాటు నిఖార్సైన ఆల్‌రౌండర్‌లతో భారత్ పటిష్ఠంగా కనిపిస్తున్నది. ఈ టోర్నీ ఆరంభమయ్యాక మూడో దఫాలో ఇంగ్లండ్ గడ్డపైనే తొలిసారి ట్రోఫీని ముద్దాడిన కపిల్‌సేనను ఆదర్శంగా తీసుకుంటూ.. చెలరేగిపోయి ఇంగ్లిష్ వీధుల్లో తీన్మార్‌ఆడాలని భారత్ భావిస్తున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రత్యర్థుల దృష్ట్యా సెమీస్ చేరడం ఖాయమే అయినా.. టోర్నీలో మిగతా జట్లు ఏం తక్కువ తినలేదు కాబట్టి అప్రమత్తంగా ఉండకుంటే ప్రమాదాలు తప్పకపోవచ్చు.

దక్షిణాఫ్రికా

ఐసీసీ టోర్నమెంట్‌లలో అదృష్టం కలిసిరాని జట్టేదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికానే. 1991లో పునరాగమనం అనంతరం ఎన్ని సార్లు ప్రయత్నించినా దగ్గరివరకు రాగలిగారే తప్ప వరల్డ్ కప్ ట్రోఫీని చేజిక్కుంచుకున్న సందర్భాలు మాత్రం సున్నా. కొన్ని సార్లు వరుణుడు అవకాశాలను దెబ్బతిస్తే.. మరికొన్ని సార్లు జట్టు సభ్యులే చాన్స్‌లు చేజార్చుకొని మూల్యం చెల్లించుకున్నారు. పాత జ్ఞాపకాలను పక్కనపెట్టి ప్రస్తుతం ఉన్న వనరులతో ముందడుగు వేయాలని సఫారీలు కృతనిశ్చయంతో ఉన్నారు. మైదానంలో పాదరసంలా కదలే ఫీల్డర్లు ఉండటం డుప్లెసిస్ సేనకు అదనపు బలం.

ఇంగ్లండ్

మొన్నటి దాక సంప్రదాయ క్రికెట్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తూ.. తెల్ల బంతిని అంతగా పట్టించుకోని క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్.. ప్రస్తుతం బలమైన జట్టుతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంతో ప్రపంచకప్‌నకు రెడీ అయింది. రెండు దశాబ్దాల తర్వాత సొంతగడ్డపై జరుగనున్న వరల్డ్‌కప్‌ను ఇప్పటికైనా ముద్దాడాలని తహతహలాడుతున్నది. సొంత మైదానాల్లో బరిలోదిగనుండటం వారికి కచ్చితంగా కలిసొచ్చే అంశమే. బలమైన హిట్టర్లతో కూడిన బ్యాటింగ్ లైనప్‌తో సెమీస్ చేరడం ఖాయమే అనిపిస్తున్నా.. పెద్ద మ్యాచ్ లు ఆడిన అనుభవం అంతగా లేని మోర్గన్ సేన అక్కడి నుంచి ముందుకు సాగడం సులువు కాకపోవచ్చు.

901

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles