క్లీన్‌స్వీప్‌పై కన్ను


Sun,September 22, 2019 12:33 AM

-సిరీస్ నెగ్గాలని టీమ్‌ఇండియా..
-సమం చేయాలని డికాక్ సేన తహతహ
-భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20
-రాత్రి 7.00 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో

ఆర్నెళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ ఆడుతున్న టీమ్‌ఇండియా.. తొలి మ్యాచ్‌లోఅలవోకగా గెలిచి మంచి జోరు మీదుంది. చివరి మ్యాచ్‌లోనూ అదే ఆధిపత్యం కొనసాగించి సిరీస్ చేజిక్కించుకోవాలని భావిస్తుంటే.. ప్రత్యర్థి మాత్రం పరువు నిలుపుకునేందుకు పరితపిస్తున్నది. కొత్త ముఖాలతో భారత్ గడ్డపై అడుగుపెట్టిన సఫారీలు వైట్‌వాష్ నుంచి బయట పడాలంటే ఈ మ్యాచ్ తప్పక నెగ్గాల్సిందే. బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలుండటం ఆటగాళ్లతో పాటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. వాతావరణం సహకరిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఇరు జట్లు పరుగుల వరద పారించాలని భావిస్తున్నాయి.
Kohli
బెంగళూరు: ఏడాది ముందు నుంచే పొట్టి ప్రపంచకప్ సన్నాహాలు మొదలెట్టిన టీమ్‌ఇండియా.. హోమ్‌సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో నెగ్గిన కోహ్లీసేన సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఇక మిగిలిన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేసి టెస్టు సమరానికి ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావిస్తున్నది. మొహాలీలో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత్.. చిన్నస్వామిలో సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేడు బెంగళూరు వేదికగా పొట్టి సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగనుంది. కాగా.. మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించే అవకాశాలుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నది. సీనియర్లు అందుబాటులో లేకున్నా.. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన మన యువ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. ఇదే జోరు ఇక్కడా కొనసాగిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పకపోవచ్చు. మన జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్‌పై ఒత్తిడి పెరుగుతున్నది. గత 10 టీ20ల్లోనూ పంత్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం కలువరపెడుతున్నది. అతడు వికెట్ విలువ తెలుసుకుంటే మంచిదని ఇప్పటికే సీనియర్లు, మాజీలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరోసారి అతడిపై అందరిదృష్టి నిలువనుంది. మరోవైపు కొత్త కుర్రాళ్లతో భారత గడ్డపై అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా.. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సారథి డికాక్ మంచి ఇన్నింగ్స్ ఆడినా.. విరాట్ సేనను అడ్డుకోగలిగేంత టార్గెట్ ఇవ్వడంలో సఫారీలు విఫలమయ్యారు. ప్రమాదకర పేసర్ కగిసో రబాడ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెడుతున్నది. అయితే ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు బ్రేక్ వేసి సిరీస్ సమం చేయాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది.

అదొక్కటే సమస్య

బ్యాటింగ్‌లో టాప్ త్రీ ఫామ్‌లో ఉండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. వీరు సమిష్టిగా రాణిస్తే.. చిన్న బౌండరీలు ఉన్న చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద ఖాయమే. కరీబియన్ టూర్‌లో టచ్ దొరక్క ఇబ్బంది పడ్డ ఓపెనర్ శిఖర్ ధవన్ గత మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్‌తో అలరించాడు. రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజులో నిలువకపోయినా.. ఉన్నంతసేపు చక్కటి షాట్లు ఆడాడు. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అజేయ అర్ధశతకం తో చివరి వరకు క్రీజులో నిలిచి జట్టు ను విజయతీరాలకు చేర్చాడు. ఐపీఎల్లో ఇక్కడ లెక్కకు మిక్కి లి మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న విరాట్‌ను ఆపడం ప్రత్యర్థికి శక్తికి మించిన పనే అనొచ్చు. ఎటొచ్చి ఇబ్బందంతా.. రిషబ్ పంత్ షాట్ సెలెక్షన్ గురించే. తన వికెట్ విలువ తెలుసుకోకుండా చెత్త షాట్లతో మూల్యం చెల్లించుకుంటున్న ఈ చిచ్చరపిడుగు ఈ మ్యాచ్‌లోనైనా మెరిపిస్తాడా చూడాలి. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ రూపంలో తెలివైన బ్యాట్స్‌మన్ ఉండటం టీమ్‌ఇండియాకు అదనపు ప్రయోజనం చేకూర్చుతున్నది. పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్న అయ్యర్ ఇదే నిలకడ కొనసాగిస్తే.. జట్టులో చోటు సుస్థిరం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్లు హార్దిక్, కృనాల్, జడేజాకు గత మ్యాచ్ లో బ్యాటింగ్ అవకాశం రాకున్నా.. బౌలింగ్‌లో ఫర్వాలేదనిపించారు. అయితే రాహుల్ చాహర్ కోసం కృనాల్‌ను తప్పిస్తారా చూ డాలి. వాషింగ్టన్ సుందర్ కొత్త బంతితో ఆకట్టుకుంటున్నాడు. పేసర్ల విషయానికొస్తే.. దీపక్ చాహర్, సైనీ సీనియర్లు లేని లోటు కనబడకుండా చూసుకుంటున్నారు. మొహాలీలో ఓ వైపు పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు పడగొట్టిన దీపక్ అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. అదనపు పేసర్‌ను ఆడించాలనుకుంటే.. ఖలీల్ అహ్మద్‌కు చాన్స్ దక్కొచ్చు.

మిల్లర్ రాణిస్తేనే..!

కెప్టెన్సీ తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అని సిరీస్‌కు ముందు అన్న దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ క్వింటన్ డికాక్ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు. అతడు క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్‌లో సఫారీలు మెరుగ్గానే కనిపించారు. అయితే మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నిలకడ తెచ్చే బ్యాట్స్‌మన్ లేకపోవడం ప్రొటీస్ జట్టులో లోటుగా కనిపిస్తున్నది. బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్న డికాక్.. తొలిమ్యాచ్‌లో సారథిగా తడబడ్డాడు. భారత బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడుతున్న సమయంలో స్పిన్నర్లను రంగంలోకి దించకుండా పేసర్లనే కొనసాగించి మూల్యం చెల్లించుకున్నాడు. టెస్టు ఆటగాడిగా ముద్రపడ్డ బవుమా పొట్టి ఫార్మాట్‌లో అరంగేట్రంతోనే చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే అతడు స్ట్రయిక్‌రేట్‌పై కూడా దృష్టి సారిస్తే మంచింది. భారత గడ్డపై అపార అనుభవం ఉన్న మిల్లర్ విజృంభించాల్సిన అవసరముంది.

తుది జట్లు(అంచనా)

zభారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, అయ్యర్, పంత్, హార్దిక్, కృనాల్/రాహుల్ చాహర్, జడేజా, సుందర్, దీపక్ చాహర్, సైనీ.
దక్షిణాఫ్రికా: డికాక్ (కెప్టెన్), హెండ్రిక్స్, డసెన్, బవుమా, మిల్లర్, ఫెలుక్వాయో, ప్రిటోరియస్, జోర్న్ ఫార్చూన్, రబాడ, జూనియర్ డాలా, షంసీ.

426

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles