సమంచేస్తారా..సమర్పిస్తారా..


Thu,November 7, 2019 04:22 AM

bangla-team

- నేడు బంగ్లాతో భారత్ రెండో టీ20
సిరీస్ కాపాడుకోవాలనే పట్టుదలతో టీమ్‌ఇండియా.. మ్యాచ్‌కు మహా ముప్పు

పొట్టి ఫార్మాట్‌లో బంగ్లా చేతిలో సిరీస్ పరాభవాన్ని తప్పించుకోవాలన్న కృతనిశ్చయంతో టీమ్‌ఇండియా రెండో టీ20లో అడుగుపెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఊహించని పరాజయం పలుకరించగా.. నేడు రాజ్‌కోట్ వేదికగా జరుగనున్న పోరులో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. గత మ్యాచ్ తప్పిదాలు పునరావృతం కాకూడదని ప్రణాళికలు రచిస్తున్నది. మరోవైపు సీనియర్లు షకీబ్, తమీమ్ లేకున్నా.. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు మహాతుపాను రూపంలో వరుణుడి ముప్పు పొంచి ఉన్నది. బుధవారం సాయంత్రం రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసింది. మరి టీమ్‌ఇండియాను వరుణుడు కరుణిస్తాడో.. లేక ఆశలపై నీళ్లు చల్లుతాడో చూడాలి.
panth
రాజ్‌కోట్: బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో పరాజయంతో షాక్‌కు గురైన టీమ్‌ఇండియా.. సిరీస్‌ను కాపాడుకునేందుకు తప్పక గెలువాల్సిన రెండో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరుజట్ల మధ్య ఇక్కడి సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలో రెండో టీ20 జరుగనుంది. ఢిల్లీలో కాలుష్యం మధ్య ఆదివారం జరిగిన తొలి పోరులో 7 వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లా.. భారత్‌పై పొట్టి ఫార్మాట్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, రాజ్‌కోట్‌లో సత్తా చాటి సిరీస్ ఆశలను నాగ్‌పూర్‌కు మోసుకెళ్లాలని టీమ్‌ఇండియా ఆటగాళ్లు పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి తొలిసారి భారత్‌పై సిరీస్ విజయాన్ని సాధించాలని మహ్ముదుల్లా సేన తహతహలాడుతుంటే.. బంగ్లా టైగర్స్‌ను ఒక్క విజయానికే పరిమితం చేసి తిరిగి పుంజుకోవాలని రోహిత్ అండ్ కో కసిమీద ఉన్నది. మ్యాచ్‌కు మహా తుపాను ముప్పు పొంచి ఉండడం భారత శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది.

ధవన్ పుంజుకుంటాడా..

తొలి మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలం కాగా, మరో ఓపెనర్ శిఖర్ ధవన్ (42 బంతుల్లో 41) ఓ మోస్తరుగా ఆడినా.. అతడి స్ట్రయిక్ రేట్‌పై, తడబాటుపై విమర్శలు వచ్చాయి. ధాటిగా ఆడాల్సిన సమయంలోనూ సింగిల్స్‌కే పరిమితమై.. మరో ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడని కొందరు మాజీలు అభిప్రాయపడ్డారు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సరైన ప్రదర్శన చేయకుంటే ధవన్ ఫామ్‌పై మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఈ తరుణంలో ధవన్ ఈ మ్యాచ్‌లో తప్పక దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. టెస్టు జట్టులో చోటు కోల్పోయిన కేఎల్ రాహుల్ సైతం ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ (13 బంతుల్లో 22) ఒక్కడే ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉసూరుమనిపించగా.. పంత్ (26 బంతుల్లో 27) తడబాటుతో బ్యాట్ ఝళిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్ మ్యాచ్ తుదిజట్టులోకి సంజూ శాంసన్, మనీశ్ పాండేల్లో ఒకరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బౌలింగ్‌పై ఆందోళన

బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌ను కట్టడి చేయలేక తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. ఇందులో మనవాళ్ల అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిచింది. కీలక సమయమైన 19వ ఓవర్‌లో భారత పేసర్ ఖలీల్ అహ్మద్ వరుసగా నాలుగు ఫోర్లు సమర్పించుకోవడం సహా 4 ఓవర్లలోనే 37 పరుగులు ఇచ్చి తీవ్రంగా నిరాశ పరిచాడు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, చాహల్ పరుగులు కట్టిడి చేసినా.. బంగ్లాను పడగొట్టడంలో విఫలమయ్యారు. పిచ్‌ను బట్టి బౌలర్ల ఎంపిక ఉంటుందన్న రోహిత్.. మార్పులు తప్పవని చెప్పకనే చెప్పాడు. ముఖ్యంగా ఖలీల్ స్థానంలో శార్దూల్ తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

జోరు మీద బంగ్లా

కీలక ఆటగాళ్ల గైర్హాజరీలోనూ బంగ్లాదేశ్ మంచి ఊపు మీద ఉంది. తొలి మ్యాచ్ హీరో ముష్ఫికర్ (60 నాటౌట్) మరోసారి విజృంభించాలని ఆ జట్టు కోరుకుంటున్నది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ అమినుల్ ఇస్లాం అదరగొడితే.. పేసర్ సైఫుల్ సైతం రాణించాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించి.. భారత్‌పై తొలిసారి పొట్టి ఫార్మాట్‌లో సిరీస్ ముచ్చట తీర్చుకోవాలని మహ్ముదుల్లా సేన పట్టుదలగా ఉంది.

సొంతగడ్డపై టీ20ల్లో తడబాటు

టెస్టులు, వన్డే ఫార్మాట్‌ల్లో స్వదేశంలో ఎదురులేని విజయాలు సాధిస్తున్న టీమ్‌ఇండియా.. టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గ రీతిలో ఆకట్టుకులేకపోతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. అలాగే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ పైచేయి సాధించలేకపోయింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తర్వాతి మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే మూడో టీ20లో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం చెంది సిరీస్‌ను సమంగా ముగించింది. తాజా సిరీస్‌లో.. బంగ్లా చేతిలో తొలి మ్యాచ్ ఓడి నిరాశాజనకంగా ప్రారంభించింది. మరి నేడు జరిగే రెండో మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధించి సిరీస్‌ను సమం చేస్తుందా.. లేక బంగ్లా టైగర్స్ పోరాటానికి ట్రోఫీ అప్పగిస్తుందా చూడాలి.
rohith

పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ శర్మ

ఆడనున్న వందో అంతర్జాతీయ మ్యాచ్ ఇది. టీ20ల్లో సెంచరీ మార్క్ చేరిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్ నిలువనున్నాడు.తొలి మ్యాచ్‌లో మా తప్పులను గుర్తించాం. వాటిని పునరావృతం కాకుండా చూడడం ముఖ్యం. మా బ్యాటింగ్ పటిష్ఠంగానే ఉంది. అయితే రాజ్‌కోట్ పిచ్‌ను విశ్లేషించి, అందుకు అనుగుణంగా తుదిజట్టులో మార్పులు ఉంటాయి. పిచ్‌ను బట్టే బౌలర్లను ఎంపిక చేస్తాం. ఢిల్లీ కంటే రాజ్‌కోట్ పిచ్ మెరుగ్గా ఉంటుందని ఆశిస్తున్నాం. - రోహిత్ శర్మ, భారత కెప్టెన్

maha
మహా ముప్పు
భారత్‌కు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌కు మహా తుపాను రూపంలో ముప్పు పొంచి ఉన్నది. మ్యాచ్ జరిగే గురువారమే తుపాను గుజరాత్ తీరం దాటే అవకాశం ఉండడంతో రాజ్‌కోట్‌లో వర్షం పడొచ్చు. ఒకవేళ మ్యాచ్ రద్దయితే మాత్రం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే. సిరీస్ గెలిచే అవకాశం లేకపోగా.. చివరి టీ20లో సిరీస్ సమం కోసం ఒత్తిడి మధ్య పోటీకి దిగాల్సి వస్తుంది. బుధవారం సాయంత్రం కూడా రాజ్‌కోట్‌లో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో.. మ్యాచ్ సమయానికి వరుణుడు కరుణించాలని టీమ్‌ఇండియా ఆకాంక్షిస్తున్నది.

Mahmudullah
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ సిరీస్‌లో విజయం సాధిస్తే బంగ్లాదేశ్ క్రికెట్‌కు పెద్ద ఊతంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో మేం ఇంకా మెరుగ్గా ఆడాలి. ఎందుకంటే ఏ ఫార్మాట్‌లో అయినా భారత్ అత్యుత్తమ జట్టు. తొలి బంతి నుంచే పైచేయి సాధించాలి. మొదటి నుంచి దూకుడుగా, సానుకూల దృక్పథంలో ఆడుతాం.- మహ్ముదుల్లా, బంగ్లా కెప్టెన్

జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, శాంసన్/కేఎల్ రాహుల్, అయ్యర్, పంత్, శివమ్ దూబే, కృనాల్, సుందర్, చాహల్, దీపక్, శార్దూల్/ ఖలీల్.
బంగ్లాదేశ్:మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్, సౌమ్య, నయీమ్/మిథున్, ముష్ఫికర్, మొసాద్దిక్, అఫిఫ్, అమీనుల్, ముస్తాఫిజుర్, అమీన్/అరాఫత్, షఫీయుల్ ఇస్లాం.

పిచ్, వాతావరణం
మహా తుపాను కారణంగా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సాయంత్రం కల్లా తుపాను బలహీన పడుతుందని,మ్యాచ్ సమయానికి భారీ వర్షం పడకపొవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది.

838

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles