HomeSports News

భారత్-పాక్ సంగ్రామం

Published: Sun,June 16, 2019 03:38 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-విశ్వవేదికపై తలపడనున్న చిరకాల ప్రత్యర్థులు
-అజేయ రికార్డును కొనసాగించాలని కోహ్లీ సేన..
-చరిత్ర తిరగ రాయాలని సర్ఫరాజ్ బృందం తహతహ

Kohli
మాంచెస్టర్: రోజు కూలీ నుంచి.. రాష్ట్రపతి వరకు, గల్లీ పోరగాళ్ల నుంచి.. ఢిల్లీ పౌరుల దాకా ఒళ్లంతా కండ్లు చేసుకొని ఎదురుచూసే మహాసంగ్రామానికి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఏకపక్ష విజయాలతో చప్పగా సాగుతున్న ప్రపంచకప్‌నకు వన్నెతెచ్చే హై ఓల్టేజ్ మ్యాచ్.. భారత్, పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమైంది. విశ్వకప్ వేదికగా చిరకాల ప్రత్యర్థిని ఎదురుపడ్డ ప్రతిసారి చిత్తు చేసిన చరిత్ర ఒకరిదైతే.. దాన్ని తిరగరాయడమే పనిగా పెట్టుకొని పావులు కదుపుతున్న కసి మరొకరిది. నరాలు తెగే ఉత్కంఠ సన్నివేశాలకు.. రోమాలు నిక్క బొడుచుకునే ఉద్వేగ భరిత దృశ్యాలకు దాయాదుల సమరం వేదిక కానుంది.

ఇక్కడ గెలిచినోడు రాకింగ్.. ఓడినోడు బ్యాకింగ్, ఆడినోడు హీరో.. ఆడనోడు జీరో. గెలిపిస్తే పూల వర్షం.. ఓడగొడితే రాళ్ల వర్షం. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు 22 గజాల పిచ్‌పై 22 మంది తలపడే మహాసంగ్రామం. యావత్ క్రికెట్ జగత్తు ఆసక్తిగా.. ఆత్రుతగా ఎదురుచూస్తున్న అసలు సిసలు సమరం. పైకి చూసేందుకు కేవలం మరో మ్యాచ్‌లానే కనిపిస్తున్నా.. కోట్ల మంది ఆశలను మోస్తున్న ఆటగాళ్లకు మాత్రం ఒత్తిడిలో ప్రపంచ యుద్ధానికి ఏమాత్రం తీసిపోదు.
Kohli1
శతకోటి మంది ఆశీర్వచనాలు వెంట ఉన్న విరాట్ సేనను విజయం వరించాలని ఆశిద్దాం.

విశ్వవేదికపై అత్యంత ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం ఇక్కడి ఓల్డ్ ట్రఫర్డ్ పిచ్‌పై చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. సామాజిక మాధ్యమాలు మోతెక్కిస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు హోరెత్తిస్తున్నాయి. మాజీలు తమ జ్ఞాపకాలను తాజా చేసుకుంటుంటే.. విశ్లేషకులు భూతద్దాలు చేతబట్టి బలాబలాల గురించి పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రపంచకప్ నెగ్గకపోయినా ఫర్వాలేదు.. భారత్‌పై గెలిస్తే అదే చాలని పాకిస్థానీలు భావిస్తున్నారుఇవి మీరో నేనో అన్న మాటలు కావు పాక్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఇంజమాముల్ హక్ నోటి నుంచి జాలువారిన ఆణిముత్యా లు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పాకిస్థాన్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజేంటో చెప్పడానికి. ఇది ఇరు దేశాల మధ్య యుద్ధం కాదు.. మామూలు మ్యాచ్‌లాగే చూడండిఅని పాక్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్ అంటున్నా.. వాస్తవం మాత్రం అందు కు భిన్నంగా కనిపిస్తున్నది.
sarfaraz
ప్రపంచకప్ వేదికగా పాకిస్థాన్ చేతిలో ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడని భారత్ అదే రికార్డు కొనసాగించాలని చూస్తుంటే.. ఎలాగైనా చరిత్ర తిరగరాయాలని సర్ఫరాజ్ సేన ఆకాంక్షిస్తున్నది. అసలు సిసలు పోరుకు వరుణుడు అడ్డంకి కలిగించొద్దని భారత్, పాక్‌తో పాటు యావత్ ప్రపంచ క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.

అనిశ్చితే అదనపు బలంగా..

తమదైన రోజున ఎంతటి జట్టునైనా మట్టికరిపించే పాకిస్థాన్.. నిలకడలేమే ప్రధాన బలంగా బరిలో దిగనుంది. గత 13 మ్యాచ్‌ల్లో పన్నెండింట ఓడిన పాక్ గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ ప్రపంచకప్ హాట్ ఫేవరెట్, ఆతిథ్య ఇంగ్లండ్‌పై కావడం వారి అనిశ్చితికి నిదర్శనంగా నిలుస్తున్నది. ప్రతిసారి బౌలింగ్ ప్రధాన బలంగా బరిలో దిగే పాకిస్థాన్ ఈసారి ఇమామ్, ఫఖర్, బాబర్, హఫీజ్, సర్ఫరాజ్, మాలిక్‌తో బ్యాటింగ్ కూడా పటిష్ఠంగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని చెలరేగిపోవాలని ఆ దేశ మాజీలంతా సూచిస్తన్న వేళ పాక్ పరాక్రమం చూపాలని భావిస్తున్నది. టాపార్డర్‌లో 50కి పైగా సగటు ఉన్న ఇమామ్, ఫఖర్, బాబర్.. భారత పేస్ ప్రధానాస్త్రం బుమ్రాను ఎదుర్కునేదానిపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
manchestor
ఇప్పటికే పాకిస్థాన్ కోహ్లీగా గుర్తింపు పొందిన బాబర్ ఆజమ్ టాపార్డర్‌లో కీలకం కానున్నాడు. యూట్యూబ్‌లో విరాట్ బ్యాటింగ్ వీడియోలు చూసి మెళకువలు నేర్చుకుంటున్నానంటున్న బాబర్ వాటిని ఏ మేరకు ఆచరణలో పెడతాడో చూడాలి. బౌలింగ్‌లో ఆమిర్ తురుపుముక్క కాగా.. వహాబ్ రియాజ్, షాహిన్ షా అఫ్రిది కూడా ప్రమాదకరమే.

సై అంటున్న కోహ్లీ అండ్ కో..

బలమైన బ్యాటింగ్ ఆర్డర్, చక్కటి పేస్ బౌలింగ్, ఆల్‌రౌండర్ల అండదండలతో టీమ్‌ఇండియా పటిష్ఠంగా కనిపిస్తున్నది. ధవన్ గైర్హాజరీలో రోహిత్ శర్మతో పాటు ఓపెనర్‌గా రానున్న లోకేశ్ రాహుల్‌పై ఒత్తిడి అధికంగా ఉంటుందనడంలో సందేహం లేదు. గత ప్రపంచకప్‌లో పాక్‌పై సెంచరీతో అదరగొట్టిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలువాల్సిన అవసరం ఉంది. ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో సీనియర్ దినేశ్ కార్తీక్ వైపు మొగ్గుచూపుతారా.. లేక బౌలింగ్ చేయగలిగే విజయ్ శంకర్‌ను ఆడిస్తారా చూడాలి. మిడిలార్డర్‌లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. పాక్‌పై మంచి బౌలింగ్ రికార్డు ఉన్న కేదార్ జాదవ్ బ్యాట్‌తోనూ రాణిస్తే భారత్‌కు తిరుగుండదు.

బౌలింగ్‌లో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రానే కీలకం కానుండగా.. మణికట్టు మాయగాళ్లు కుల్దీప్, చహల్ ఎలా రాణిస్తారనేది కీలకం. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన భారత్.. ఆ తర్వాత ఆఫ్ స్పిన్నర్లను పక్కన పెట్టి కుల్చా జోడీని రంగంలోకి దించింది. మధ్య ఓవర్లలో ప్రభావం చూపే వీరిద్దరూ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగాలని భావిస్తున్నారు. పేస్‌కు సహకరించే పిచ్‌పై షమీని తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలనూ కొట్టిపారేయలేం. నిప్పులు చెరిగే బంతులతో అదరగొడుతున్న పాక్ పేసర్ మొహమ్మద్ ఆమిర్‌ను మనవాళ్లు ఎలా ఆడతారనేది అతిపెద్ద సమస్య. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ సెంచరీ.. మరో అర్ధసెంచరీతో ఫామ్‌లో కనిపిస్తున్న హిట్‌మ్యాన్ మరోసారి హిైట్టెతే.. పాక్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ఆమిర్‌పై దూకుడే మంత్రంగా బ్యాటింగ్ చేయండిఅని క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇచ్చిన సలహా పాటిస్తే భారీ స్కోరు ఖాయమే.

ఫేవరెట్ మత్తులో బరిలో దిగితే భారత్‌కే ప్రమాదం. చాంపియన్స్ ట్రోఫీలో అదే కొంపముంచింది. ఉదాసీనతకు తావులేకుండా
జాగ్రత్తగా ఆడాలి. పాకిస్థాన్‌ను అంచనా వేయడం ఎప్పుడైనా కష్టమే. వారు ప్రమాదకర ప్రత్యర్థులు.. తేలికగా తీసుకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు.
Kohli2
- సౌరభ్ గంగూలీ, భారత మాజీ కెప్టెన్

భారత్ టాపార్డర్ బలంగా ఉంది. మిడిలార్డర్‌లో కాస్త ఇబ్బంది కనిపిస్తున్నది. పాక్ బౌలర్లు దాన్ని సొమ్ము చేసుకోవాలి. ఈ మ్యాచ్‌లో ఆమిర్ కీలకం కానున్నాడు. బాబర్ ఆజమ్ మంచి బ్యాట్స్‌మన్.. అతడిని కోహ్లీతో పోల్చకుండా ఫ్రీగా ఆడే చాన్సివ్వాలి.
-వసీమ్ అక్రమ్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్

ఈ ఒక్క మ్యాచ్‌తో జీవితం అంతం కాదు. మంచి ప్రదర్శన చేసినా, చేయకున్నా ఏమీ ముగిసిపోదు. ఎప్పట్లాగే ఈ పోరు కూడా నిర్ణీత సమయంలో మొదలై నిర్దేశిత సమయంలో ముగుస్తుంది. సుదీర్ఘంగా సాగే టోర్నీలో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. జట్టు సభ్యులెవరూ ఒత్తిడి దరిచేరనివ్వడం లేదు. ప్రతీ ఒక్కరు బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వాతావరణం ఎవరి చేతుల్లోనూ లేదు. దేనికైనా మానసికంగా సిద్ధంగా ఉన్నాం. టీఆర్పీలు పెంచడం కోసమో వార్తల్లో కేంద్ర బిందువుగా నిలిచేందుకో నేనేమి మాట్లాడను. ఏ బౌలరైనా నేను చూసేది బంతి రంగే. అది తెల్లదా, ఎర్రదా అనేదే నాకు ముఖ్యం. అభిమానులతో పోలిస్తే.. ఆటగాళ్ల ఆలోచన తీరు భిన్నంగా ఉంటుంది.
- విరాట్ కోహ్లీ, భారత కెప్టెన్

1ఇరు జట్ల మధ్య మాంచెస్టర్‌లో ఒకే మ్యాచ్ జరగ్గా అందులో టీమ్‌ఇండియానే విజయం వరించింది. 1999 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది.

తుది జట్లు (అంచనా)

భారత్: రోహిత్, రాహుల్, కోహ్లీ (కెప్టెన్), శంకర్/కార్తీక్, ధోనీ, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్/షమీ, బుమ్రా.
పాకిస్థాన్: ఇమామ్, ఫఖర్, బాబర్, హఫీజ్, సర్ఫరాజ్ (కెప్టెన్), సోహైల్, మాలిక్/ఇమాద్, షాదాబ్, రియాజ్, ఆమిర్, షాహీన్.

1157

Recent News