సత్తా చాటేందుకు..


Sun,August 11, 2019 02:26 AM

-గెలుపే లక్ష్యంగా భారత్
-వరుణుడు కరుణించాలని ఆకాంక్ష
-నేడు విండీస్‌తో భారత్ రెండో వన్డే

సిరీస్‌లో తొలి వన్డే వర్షార్పణం తర్వాత... అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఎంతో మథనం.. ఎన్నో కసరత్తుల తర్వాత తొలి మ్యాచ్‌లో జట్టు కూర్పు చేసినా... ఆ ఆలోచనలపై వరుణుడు నీళ్లు చల్లగా.. నేడు జరిగే రెండో వన్డే కోసం తాజా ప్రణాళికలతో రెడీ అయింది. ఆటగాళ్లను పరీక్షించాలన్న ప్రయత్నానికి ఈసారైనా వర్షం అడ్డుతగలకూడదని కోహ్లీసేన ఆశిస్తున్నది. పరిస్థితులను బట్టి స్వల్ప మార్పులు మినహా తొలి వన్డేకు ఎంపికైన తుది జట్టే ఖరారయ్యే అవకాశం ఉంది. అరంగేట్రం కోసం నవ్‌దీప్ సైనీ ఎదురుచూస్తుంటే.. తొలి మ్యాచ్‌లో వరుణుడు దెబ్బతీసినా ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటేందుకు అవకాశమొస్తుందని శ్రేయస్ అయ్యర్ నిరీక్షిస్తున్నాడు. వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేందుకు క్రిస్ గేల్ అత్యంత సమీపంలో ఉన్నాడు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : విండీస్‌తో తొలి వన్డేలో వినూత్న ప్రణాళికలను అమలు చేయాలనుకున్న ప్రయత్నానికి వరుణుడు గండికొట్టినా... అదే ఉత్సాహంతో రెండో పోరులో అడుగుపెట్టేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో భారత్ ఆదివారం తలపడనుంది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విధంగానే వన్డేల్లోనూ సత్తా చాటాలని కోహ్లీసేన కృత నిశ్చయంతో ఉంది. గురువారం గయానాలోని ప్రావిడెన్స్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయగా... 13 ఓవర్లు ముగిసే సరికి వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో ఆ పోరు రద్దయిన విషయం తెలిసిందే. తమ వ్యూహాలు అమలు చేసేందుకు వరుణుడు రెండో వన్డేలోనైనా సహకరించాలని కోహ్లీసేన కోరుకుంటున్నది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి ముందడుగేయాని పట్టుదలతో ఉంది. పరిస్థితులను బట్టి తుది జట్టు కూర్పులోనూ ఒకటి, రెండు మినహా పెద్దమార్పులేమీ ఉండే అవకాశాలు లేవు. నాలుగో స్థానంలో శ్రేయస్ రానుండడం ఖాయంగా కనిపిస్తుండగా.. సైనీ అరంగేట్రంపై ఆసక్తి నెలకొంది. ఇక వెస్టిండీస్ మాత్రం ఈ సిరీస్‌లో సత్తా చాటి గేల్‌కు ఘన వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. హిట్టర్లే ప్రధాన బలంగా బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. టీ20 పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఆశిస్తున్నది.
Kohli

అయ్యర్ ఆరాటం

విండీస్‌తో టీ20సిరీస్‌కు ఎంపికైనా.. ఒక్క మ్యాచ్‌లోనూ యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే తొలి వన్డేలో అవకాశమొచ్చినా వరుణుడు బ్యాట్‌పట్టుకోనివ్వలేదు. రెండో వన్డేలోనూ అతడికి తప్పక అవకాశం దక్కనుండడంతో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టి ప్రశ్నార్థకంగా ఉన్న మిడిల్‌ఆర్డర్‌లో శాశ్వతంగా పాగా వేసేందుకు మార్గం సుగమం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌ను మేనేజ్‌మెంట్ బెంచ్‌కే పరిమితం చేయగా.. నాలుగో స్థానంలో అయ్యర్ రాగా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఖాయంగా కనిపిస్తున్నది. రోహిత్, ధావన్‌కు రిజర్వ్ ఓపెనర్‌గానే రాహుల్‌ను ఇకపై పరిగణించే అవకాశం ఉంది. విండీస్-ఏతో జరిగిన అనధికార వన్డే సిరీస్‌లో భారత్-ఏ తరఫున రెండు అర్ధసెంచరీలతో అయ్యర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే.

ఖలీలా... సైనీయా..

వెస్టిండీస్‌తో తొలి వన్డేలో అరంగేట్రం చేస్తాడని అందరూ అంచనా వేసిన యువపేసర్ నవ్‌దీప్ సైనీకి ఆ మ్యాచ్‌లో అవకాశం దక్కలేదు. భువనేశ్వర్ కుమార్ తుదిజట్టులో ఉండడంతో అతడికి నిరాశతప్పలేదు. అయితే తొలి మ్యాచ్‌లో చోటు దక్కించున్న లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ అంతగా ఆకట్టుకోకపోగా మూడు ఓవర్లకు 27పరుగులు ఇచ్చేశాడు. విండీస్ ఓపెనర్ లూయిస్‌కు పదేపదే షార్ట్‌పిచ్ బంతులు సంధిస్తూ మూల్యం చెల్లించుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ... సైనీ, ఖలీల్‌ల్లో ఎవరివైపు మొగ్గు చూపుతాడనేది ఆసక్తికరంగా మారింది.

జాదవ్ నిరూపించుకుంటాడా..

ప్రపంచకప్‌లో విఫలమైనా... అనూహ్యంగా విండీస్ పర్యటనలో కేదార్ జాదవ్‌కు చోటు దక్కింది. తన ప్రతిభ, హిట్టింగ్ సామర్థ్యంపై రేగిన విమర్శలు, అనుమానాలను పటాపంచలు చేయాలని అతడు పట్టుదలగా ఉన్నాడు. ఎలాగైనా పూర్వఫామ్‌ను తెచ్చుకొని జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలని భావిస్తున్న అతడిని తొలి మ్యాచ్ రద్దు నిరాశపరించింది. అందునా అతడి స్థానం కోసం శుభ్‌మన్ గిల్ లాంటి యువ టాలెంటెడ్ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. కేదార్ సైడ్‌ఆర్మ్ స్పిన్ బౌలింగ్ జట్టుకు ఉపయోగపడతుందని భావించినా.. జట్టులో జడేజా సహా చాహల్, కుల్దీప్‌లో ఎవరో ఒకరు ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో జాదవ్ అవసరం జట్టుకు ఎంత వరకు ఉన్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. అయితే నిరూపించుకునే అవకాశాన్ని జాదవ్‌కు ఇచ్చేందుకే టీమ్‌ఇండియా యాజమాన్యం మొగ్గు చూపే అవకాశముంది.

గేల్ ఈసారైనా..

13 పరుగులు చేస్తే విండీస్ తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచే అరుదైన రికార్డు ముంగిట కరీబియన్ విధ్వంస బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్(31 బంతుల్లో 4) తొలి వన్డేలో బోల్తాకొట్టాడు. ముఖ్యంగా అతడి స్లోబ్యాటింగ్ తీవ్రంగా నిరాశపరిచింది. అయితే మిగిలిన రెండు వన్డేల్లో చెలరేగి రికార్డు సృష్టించడం సహా కెరీర్ చరమాంకంలోనూ సత్తా తగ్గలేదని చెప్పి... తన చివరి వన్డే సిరీస్‌కు అదిరే ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు టెస్టు సిరీస్‌తో కెరీర్‌ను ముగిద్దామనుకున్న ఈ కరీబియన్ వీరుడికి సెలెక్టర్లు ఆ అవకాశమివ్వకపోవడంతో ఈ వన్డే సిరీసే గేల్‌కు చివరదయ్యే అవకాశముంది.
Gayle

విండీస్‌కు కుల్దీప్ గండం

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఎప్పటి నుంచో భారత స్పిన్నర్ కుల్దీప్‌ను అంచనా వేయడంలో విఫలమవుతూనే ఉన్నారు. కెరీర్‌లో ఇప్పటి వరకు కరీబియన్ జట్టుపై 10 వన్డేలు ఆడిన కుల్దీప్.. మొత్తం 19వికెట్లు తీశాడు. 4.50 ఎకానమీతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్‌ను గెలవాలంటే మాత్రం కుల్దీప్‌ను కరీబియన్ బ్యాట్స్‌మెన్ దీటుగా ఎదుర్కొకతప్పదు. మరోవైపు వెస్టిండీస్‌కు నాణ్యమైన స్పిన్నర్ కొరత ఉంది. ఇది టీమ్‌ఇండియాకు కలిసిరానుంది. అయితే రోచ్, కాట్రెల్‌తో ఆతిథ్య జట్టు పేస్ దళం బలంగానే ఉంది.

గేల్‌కు చుక్కెదురు

స్వదేశంలో భారత్‌తో టెస్టు సిరీస్ ఆడిన అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌కు ఆ దేశ బోర్డు మొండిచేయి చూపింది. ఈనెల 22 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శనివారం 13 మందితో కూడిన జట్టు ను ప్రకటించిన బోర్డు అందులో గేల్‌కు చోటివ్వలేదు. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఇదే తన చివరి అంతర్జాతీయ టోర్నీ కావొచ్చన్న గేల్ ఆ తర్వాత మనసు మార్చుకొని స్వదేశంలో భారత్‌తో ఆడాక ఆటకు వీడ్కోలు పలకాలనుకుంటున్నట్లు తన మనసులో మాట బయటపెట్టాడు. అందుకు తగ్గట్లే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గేల్‌ను ఎంపిక చేసినా.. టెస్టులకు మాత్రం అతడిని పరిగణించలేదు. ఐదేండ్ల క్రితం చివరి టెస్టు ఆడిన గేల్‌ను ఎంపిక చేసి యువ ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదనుకున్న బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ రాకీమ్ కార్న్‌వాల్ తొలిసారి వెస్టిండీస్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.140 కేజీల బరు వు, ఆరున్నర అడుగుల ఎత్తుతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టిన 26 ఏండ్ల రాకీమ్ టెస్టుల్లోనూ ఆకట్టుకుంటాడని బోర్డు విశ్వాసం వ్యక్తం చేసింది. బౌలింగ్ లైనప్‌లో వైవిధ్యం తేవడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో పరుగులు చేయగల సత్తా రాకీమ్‌లో ఉంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడు మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడుఅని సెలక్షన్ కమిటీ చీఫ్ రాబర్ట్ హైనెస్ తెలిపాడు.

-విండీస్‌పై మరో 19 పరుగులు చేస్తే ఆ దేశంపై అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లీ(1912, 33ఇన్నింగ్స్) రికార్డు సృష్టిస్తాడు. పాక్ మాజీ ఆటగాడు జావెద్ మియాందాద్(1930,64ఇన్నింగ్స్)ను వెనక్కి నెట్టేస్తాడు.

-పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో అడిన గత ఆరు మ్యాచ్‌ల్లోనూ టీమ్‌ఇండియానే విజయం వరిచింది.
-విండీస్ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు గేల్(10,397) చేయాల్సిన పరుగులు. ఈ మ్యాచ్‌లో 9రన్స్ చేస్తే లారా(10,405)ను ఈ జమైకా వీరుడు అధిగమిస్తాడు.
-క్రిస్ గేల్‌కు ఇది 300వ వన్డే మ్యాచ్. బ్రియాన్ లారా(299)ను వెనక్కి నెట్టి విండీస్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన బ్యాట్స్‌మెన్‌గా గేల్ రికార్డు సృష్టించనున్నాడు.

పిచ్, వాతావరణం

పేస్ కంటే స్పిన్‌కు పిచ్ ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. వర్షం ముప్పు తక్కువగానే ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది.

జట్లు అంచనా

భారత్: కోహ్లీ(కెప్టెన్), రోహిత్, ధవన్, శ్రేయస్ అయ్యర్, కేదార్, పంత్(వికెట్ కీపర్), జడేజా, భువనేశ్వర్, షమీ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్
వెస్టిండీస్: హోల్డర్(కెప్టెన్), క్రిస్ గేల్, ఎవిన్ లూయి స్, హోప్(వికెట్ కీపర్), హెట్‌మైర్, పూరన్, చేస్, అలెన్, బ్రాత్‌వైట్, కీమర్ రోచ్, కాట్రెల్

666

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles