సిరీస్ లక్ష్యంగా..


Wed,August 14, 2019 02:03 AM

india

- నేడు భారత్, వెస్టిండీస్ మూడో వన్డే
- సిరీస్ నెగ్గాలని టీమ్‌ఇండియా ఆరాటం
- పరువు దక్కించుకోవాలని విండీస్ పోరాటం


టీ20 సిరీస్ సొంతమైంది. వన్డే సిరీస్‌లోనూ అధిక్యంలో ఉన్నాం. ఇక మిగిలిందల్లా ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి పరిమిత ఓవర్ల క్రికెట్‌కు టాటా చెప్పి.. సంప్రదాయ క్రికెట్‌కు సిద్ధమవడమే. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ సేన రెండో వన్డేలో అలవోక విజయం సొంతం చేసుకుంటే.. సులువుగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజేతులా చెడకొట్టుకున్న కరీబియన్లు ఈసారి అలాంటి తప్పు చేయకూడదని భావిస్తున్నారు. మిడిల్‌లో అయ్యర్ గాడిన పడటం.. బౌలింగ్‌లో పేసర్లు విజృంభిస్తుండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశాలైతే.. సొంతగడ్డపై వరుసగా రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉండటం విండీస్‌ను కలవరపెడుతున్నది. గబ్బర్ కూడా గర్జిస్తే భారత్‌కు ఇక తిరుగుండదు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వర్షం కారణంగా ఆగుతూ.. సాగుతూ.. ముందుకు వెళ్తున్న వన్డే సిరీస్ చివరి అంకానికి వచ్చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ మొత్తం తుడిచిపెట్టుకుపోగా.. రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఫలితం తేలింది. ఇక టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు మిగిలిన చివరి వన్డే కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. రెండో వన్డేలో విజయం సాధించిన భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయడంతో పాటు స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌కు ఘనంగా వీడ్కోలు పలుకాలని విండీస్ పట్టుదలతో ఉంది. పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్లపై అదరగొట్టే ఆటతో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా వన్డే సిరీస్‌ను ఒడిసి పట్టాలని భావిస్తుంటే.. ఈ గెలుపుతోనైనా పరువు దక్కించుకోవాలని హోల్డర్ సేన తాపత్రయపడుతున్నది. ఓవరాల్‌గా టీమ్‌ఇండియా బలంగా కనిపిస్తున్నా.. ఓపెనర్ శిఖర్ ధవన్ ప్రదర్శన కాస్త ఇబ్బంది పెడుతున్నది. మరోవైపు పేపర్‌పై చూసుకుంటే భీకరంగా కనిపిస్తున్న విండీస్ లైనప్ మైదానంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. గత మ్యాచ్‌లో సులువుగా గెలిచే అవకాశాన్ని వదులుకోవడం ఆ జట్టు అనుభవరాహిత్యానికి అద్దం పడుతున్నది. మరి ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి గేల్‌ను సంతోషంగా సాగనంపుతారా చూడాలి.
india1

గేల్ ఏం చేస్తాడో!

వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్న విధ్వంసక వీరుడు క్రిస్‌గేల్ భారత్‌తో సిరీస్ అనంతరం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అయితే సొంతగడ్డపై టెస్టు ఆడాక ఆటకు వీడ్కోలు పలకాలనుకుంటే.. ఆ దేశ బోర్డు అతడిని టెస్టులకు ఎంపిక చేయలేదు. దీంతో ఇదే అతడి చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇప్పటి వరకు గేల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే తమ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన గేల్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హోల్డర్ బృందం భావిస్తున్నది. రెండో వన్డేలో బౌలర్లు రాణించినా.. బ్యాట్స్‌మెన్ వైఫల్యమే విండీస్ కొంపముంచింది. టాప్ బ్యాట్స్‌మెన్ ఉన్న టీమ్‌ఇండియాను కరీబియన్ బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేసినా.. సాధారణ లక్ష్య ఛేదనలో మంచి స్థితిలో ఉండి కూడా మ్యాచ్ కోల్పోయింది. కీలక దశలో ఒత్తిడిని అధిగమించడంలో ఆ జట్టు వెనుకబడుతున్నది. బౌలర్ల ప్రతిభకు తోడు భవిష్యత్తు తారలుగా భావిస్తున్న హోప్, హెట్‌మైర్, పూరన్ సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది.

నాలుగో స్థానంలో అయ్యర్!

గ్రౌండ్ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా తనదైన శైలిలో రెచ్చిపోయే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సత్తాచాటి టెస్టు తుదిజట్టులో స్థానం దక్కించుకోవాలని భావిస్తున్నాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న రిషబ్ పంత్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన సమయంలో చెత్త షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు. అతడిని ఫినిషర్‌గా వినియోగించుకొని అయ్యర్‌ను నాలుగులో ఆడించాలని దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరి ఈ అంశంలో కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. పంత్‌ను నాలుగులోనే కొనసాగిస్తాడా.. లేక అయ్యర్‌కు చాన్స్ ఇస్తాడా అనేది ఆసక్తికరం. రెండో వన్డేలో తక్కువ బంతులు ఆడే అవకాశం దక్కిన కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా ఫర్వాలేదనిపించారు. వీరిద్దరూ ధాటిగా ఆడాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్, షమీ అదరగొడుతుండగా.. లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ వారికి తోడ్పాటునిస్తున్నాడు. కుల్దీప్, జడేజా స్పిన్ బాధ్యత మోస్తున్నారు. విజయం సాధించిన జట్టులో మార్పులు చేయకూడదనుకునే విరాట్ ఇదే జట్టుతో బరిలో దిగొచ్చు. ఒకవేళ యువ పేసర్ నవదీప్ సైనీకి అవకాశం ఇవ్వాలనుకుంటే షమీకి విశ్రాంతినిచ్చే చాన్స్ ఉంది.
india2

ధవన్‌కు ఇదే లాస్ట్

వన్డే ప్రపంచకప్ సందర్భంగా వేలి గాయంతో మెగాటోర్నీకి దూరమైన ఓపెనర్ ధవన్ తిరిగి వచ్చాక పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. టెస్టు జట్టులో స్థానం దక్కని ధవన్‌కు విండీస్ గడ్డపై ఇదే చివరి మ్యాచ్. ఇన్‌స్వింగర్లు ఆడేందుకు తెగ ఇబ్బంది పడుతున్న గబ్బర్ బరిలో దిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మూడు టీ20ల్లో వరుసగా 1, 23, 3 పరుగులు చేసిన శిఖర్.. రెండో వన్డేలో 2 పరుగులకే వెనుదిరిగాడు. రిజర్వ్ ఓపెనర్‌గా లోకేశ్ రాహుల్ బెంచ్‌పై ఉండటం కూడా అతడిపై ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. అందుకే అతడు భారీ ఇన్నింగ్స్‌తో తనపై ఉన్న భారాన్ని తీర్చుకోవాలని భావిస్తున్నాడు.

4 మరో నాలుగు వికెట్లు తీస్తే వన్డేల్లో అత్యంత వేగంగా భారత్ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్‌గా కుల్దీప్ రికార్డుల్లోకెక్కనున్నాడు. ప్రస్తుతం 53 వన్డేల్లో అతడు 96 వికెట్లు పడగొట్టాడు. షమీ 55 మ్యాచ్‌ల్లో సెంచరీ మార్క్ దాటి అందరికంటే ముందున్నాడు.

పిచ్, వాతావరణం

గత వన్డే ఆడిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ కూడా జరుగనుంది. మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు తక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువుండి విపరీతమైన ఉక్కపోతకు చాన్సుంది.

తుది జట్లు (అంచనా)

భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, పంత్, శ్రేయస్, జాదవ్, జడేజా, భువనేశ్వర్, షమీ, ఖలీల్, కుల్దీప్.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), గేల్, లూయిస్/క్యాంప్‌బెల్, హోప్, హెట్‌మైర్, పూరన్, చేజ్, బ్రాత్‌వైట్, రోచ్, కాట్రెల్, థామస్.

1047

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles